Share News

Microsoft: హెచ్‌1బీ, హెచ్‌4 వీసా గడువు ముగిసేలోగాఅమెరికాకు వచ్చేయండి

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:04 AM

హెచ్‌1బీ, హెచ్‌4 వీసా అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్‌ అవుతుండడం, స్టాంపింగ్‌ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన ఉద్యోగులకు ఒక అడ్వైజరీ జారీ చేసింది.

Microsoft: హెచ్‌1బీ, హెచ్‌4 వీసా గడువు ముగిసేలోగాఅమెరికాకు వచ్చేయండి

  • అపాయింట్‌మెంట్‌ రీషెడ్యూల్‌ ఐతే ప్రయాణ ప్రణాళికలను మార్చుకోండి

  • విదేశాల్లో ఉన్న తమ ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ అడ్వైజరీ

హెచ్‌1బీ, హెచ్‌4 వీసా అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్‌ అవుతుండడం, స్టాంపింగ్‌ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన ఉద్యోగులకు ఒక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఉద్యోగులు ఏం చేయాలో, అమెరికా వెలుపల ఉన్న ఉద్యోగులు ఏం చేయాలో అందులో సూచించింది. వేరే దేశాల్లో ఉన్న ఉద్యోగుల వీసా గడువు ఇంకా మిగిలి ఉంటే గనక అది ముగిసేలోగానే అమెరికాకు వచ్చేయాలని సూచించింది. అపాయింట్‌మెంట్‌ రీషెడ్యూల్‌ అయినవారు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని పేర్కొంది. డిసెంబరు 15 నుంచి అమల్లోకి వచ్చిన ‘ఆన్‌లైన్‌ ప్రెజెన్స్‌ రివ్యూ (అంటే సోషల్‌ మీడియా తనిఖీ)’ కారణంగా హెచ్‌1బీ, హెచ్‌4 వీసాల రోజువారీ ప్రాసెసింగ్‌ సామర్థ్యం తగ్గడమే స్టాంపింగ్‌ ఆలస్యానికి, అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్‌ అవడానికి కారణమని తెలిపింది. ముఖ్యంగా.. భారత్‌లో చెన్నై, హైదరాబాద్‌ కాన్సులేట్లలో రీషెడ్యూలింగ్‌ నోటిఫికేషన్లు ఎక్కువగా జారీ అవుతున్నాయని.. కొత్త అపాయింట్‌మెంట్‌ తేదీలు 2026 జూన్‌ దాకా వెళ్లాయని.. మైక్రోసాఫ్ట్‌ అసోసియేట్‌ జనరల్‌ కౌన్సెల్‌ ఫర్‌ ఇమ్మిగ్రేషన్‌ జాక్‌ చెన్‌ తెలిపారు. కొంతమంది ఉద్యోగులు కాన్సులేట్‌కు చేరుకున్నాక.. వారి అపాయింట్‌మెంట్‌ రీషెడ్యూల్‌ అయినట్టు తెలుసుకున్నారని, కొందరికి బయల్దేరక ముందే రీషెడ్యూలింగ్‌ నోటీసులు అందాయని ఆయన వెల్లడించారు. వీసా స్టాంపింగ్‌ అవసరమైనవారు, హెచ్‌-1బీ వీసా అపాయింట్‌మెంట్‌ రీషెడ్యూల్‌ అయినవారిని తామే సంప్రదిస్తామని మైక్రోసాఫ్ట్‌ తన అడ్వైజరీలో తెలిపింది. అలాగే.. వీసా అపాయింట్‌మెంట్‌ రీషెడ్యూల్‌ అయినప్పటికీ, ప్రస్తుత వీసాపై ఇంకా కొంత గడువు ఉంటే అది ముగియక ముందే తిరిగి రావాలని సూచించింది. అమెరికాకు రావాల్సి ఉండి, కొత్త వీసా అవసరమై.. హెచ్‌1బీ వీసా అపాయింట్‌మెంట్‌ కొన్ని నెలల తర్వాతకు రీషెడ్యూల్‌ అయితే.. ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని మైక్రోసాఫ్ట్‌ సూచించింది.

Updated Date - Dec 25 , 2025 | 04:04 AM