Masood Azhar: భారత్‌పై దాడుల సూత్రధారి
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:04 AM
ఉగ్రవాదులు తమ భూభాగంలో లేరంటూ పాకిస్థాన్ చెబుతున్న మాటలు అబద్ధమని మరోసారి తేలింది. ఉగ్రవాద సంస్థ అయిన జైష్ ఎ మహమ్మద్‌లో...
మసూద్ అజహరే పార్లమెంటుపై దాడి, ముంబయి పేలుళ్లు అతడి పనేనన్న జైషే కమాండర్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: ఉగ్రవాదులు తమ భూభాగంలో లేరంటూ పాకిస్థాన్ చెబుతున్న మాటలు అబద్ధమని మరోసారి తేలింది. ఉగ్రవాద సంస్థ అయిన జైష్ ఎ మహమ్మద్‌లో కమాండర్‌గా పనిచేసిన మసూద్ ఇల్యాస్ కశ్మీరీ చెప్పిన దానిప్రకారం భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలకు రూపకల్పన పాకిస్థాన్‌లోనే జరిగింది. వెలుగులోకి వచ్చిన ఓ వీడియోలో ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. దీని ప్రకారం జైష్ ఎ మహమ్మద్ సంస్థ అధిపతి మజూద్ అజహర్ భారత్‌పై జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రూపొందించాడు. అయిదేళ్లపాటు తిహాడ్ జైలులో శిక్ష అనుభవించిన అతడు అక్కడి నుంచి తప్పించుకొని పాక్‌కు పారిపోయాడు. బాలాకోట్‌లో స్థావరం ఏర్పాటు చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడు. ఈ స్థావరంపైనే 2019లో భారత్ వైమానిక దాడులు చేయడం గమనార్హం. ఆ వీడియో ప్రకారం..ఇల్యాసీ మాట్లాడుతూ- ‘‘తిహాడ్ జైలు నుంచి తప్పించుకున్న మసూద్ అజహర్ పాకిస్థాన్ వచ్చాడు. తన విజన్, మిషన్, కార్యకలాపాలను అమలు చేయడానికి బాలాకోట్ నేల అతడికి ఆశ్రయం ఇచ్చింది. అక్కడ నుంచే ఢిల్లీ, ముంబయి దాడులకు ప్లాన్ చేశాడు. ఆ విధంగా ఆ దేశాన్ని భయపెట్టాడు’ అని చెప్పడం అందులో ఉంది. భారత్ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు బాలాకోట్ కేంద్రంగా మారిందన్న విషయాన్ని బహిరంగంగా వెల్లడించాడు. ఇదే సందర్భంగా ఒసామా బిన్ లాడెన్‌ను అమరవీరుడిగా కీర్తించాడు. పాక్ మిలటరీ శిక్షణలోనే ఉగ్రవాద స్థావరాలు పనిచేస్తున్నాయంటూ ఎప్పటి నుంచో భారత్ చెబుతున్న మాటలు నిజమని తేలింది.