Louvre Museum: లవ్రే మ్యూజియంలో7 నిమిషాల్లోనే భారీ చోరీ!
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:06 AM
ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత లవ్రే మ్యూజియంలో సినీఫక్కీలో భారీ చోరీ జరిగింది. కేవలం 7నిమిషాల్లోనే దొంగలు తమ పని కానిచ్చేశారు! అత్యంత విలువైన పురాతన...
పారిస్‌లోని ఈ మ్యూజియంలోనే మోనాలిసా చిత్రం
పారిస్, అక్టోబరు 19: ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత లవ్రే మ్యూజియంలో సినీఫక్కీలో భారీ చోరీ జరిగింది. కేవలం 7నిమిషాల్లోనే దొంగలు తమ పని కానిచ్చేశారు! అత్యంత విలువైన పురాతన నగలు ఎత్తుకెళ్లిపోయారు! పారి్‌సలో ఉన్న లవ్రే మ్యూజియానికి పటిష్ఠ భద్రత ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మోనాలిసా అసలైన చిత్రం ఈ మ్యూజియంలోనే ఉంది. ఆదివారం తెల్లవారుజామున దోపిడీ జరిగినట్లు ఫ్రాన్స్ అంతర్గత శాఖ మంత్రి లారెంట్ నూనెజ్ వెల్లడించారు. హైడ్రాలిక్ నిచ్చెన ఉపయోగించి, ఫెన్సింగ్‌ను డిస్క్ కట్టర్లతో కత్తిరించి.. దొంగలు మ్యూజియంలోకి ప్రవేశించినట్లు చెప్పారు. అపోలో గ్యాలరీలోని విలువైన నగల్ని ఎత్తుకెళ్లినట్లు వివరించారు. ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు ఈ చోరీ చేసి ఉంటారని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండడంతో ఆదివారం మ్యూజియాన్ని మూసివేసినట్లు లవ్రే నిర్వాహకులు తెలిపారు. కాగా, మ్యూజియంలో ఓ వైపు నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. దొంగలు అక్కడి నుంచే మ్యూజియం లోపలికి చొరబడ్డారని స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. నెపోలియన్ కాలంనాటి వస్తువులు, ఆభరణాలు ఉన్న అపోలో గ్యాలరీ అద్దాలను పగలగొట్టి అందులో నుంచి తొమ్మిది వస్తువులను దొంగిలించినట్లు వెల్లడించాయి. ఈ మ్యూజియంలో మెసపొటోమియా, ఈజిప్టుకు చెందిన అనేక వస్తువులు, వివిధ రాజ్యాల చిత్రాలు, శిల్పాలు వంటి వస్తువులు 33 వేల వరకు ఉన్నాయి. మ్యూజియాన్ని రోజూ దాదాపు 30 వేల మంది సందర్శిస్తుంటారు. లవ్రే మ్యూజియంలో గతంలో కూడా చోరీలు జరిగాయి. మోనాలిసా చిత్రాన్ని 1911లో మ్యూజియంలో పనిచేసిన మాజీ కార్మికుడు విన్సెంజో దొంగిలించాడు. రెండేళ్ల తర్వాత ఇటలీలోని మోనాలిసా చిత్తరువును విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా విన్సెంజోను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 1913లో మోనాలిసా చిత్రం తిరిగి మ్యూజియానికి చేరింది.