Libya army chief: టర్కీలో విమానం కూలి.. లిబియా ఆర్మీ చీఫ్ దుర్మరణం
ABN , Publish Date - Dec 25 , 2025 | 03:57 AM
ఒక ప్రైవేటు జెట్ విమానం కుప్పకూలి లిబియా ఆర్మీ చీఫ్ జనరల్ మహమ్మద్ అలీ అహ్మద్ అల్ హద్దాద్, మరో నలుగురు సైనిక ఉన్నతాధికారులు దుర్మరణం పాలయ్యారు...
అంకారా, డిసెంబరు 24: ఒక ప్రైవేటు జెట్ విమానం కుప్పకూలి లిబియా ఆర్మీ చీఫ్ జనరల్ మహమ్మద్ అలీ అహ్మద్ అల్ హద్దాద్, మరో నలుగురు సైనిక ఉన్నతాధికారులు దుర్మరణం పాలయ్యారు. టర్కీలోని అంకారా శివార్లలో మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. టర్కీతో మిలటరీ సహకారం, పలు రక్షణ అంశాలపై ఉన్నతస్థాయి చర్చల కోసం లిబియా ఆర్మీ చీఫ్ నేతృత్వంలోని బృందం అంకారాకు వచ్చింది. టర్కీ రక్షణ మంత్రి యాసర్ గులర్‌తో చర్చల అనంతరం ఫాల్కన్-50 ప్రైవేటు జెట్ విమానంలో తిరిగి బయలుదేరింది. అంకారా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయున కాసేపటికే హైమానా ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదానికి విమానంలో సాంకేతిక సమస్యలే కారణమని, అత్యవసర ల్యాండింగ్ కోసం పైలట్ విజ్ఞప్తి కూడా చేశారని టర్కీ అధికారులు ప్రకటించారు. 2011లో అంతర్యుద్ధం తర్వాత లిబియాలో పాలన పశ్చిమ(నేషనల్ యూనిటీ), తూర్పు(ఎల్‌ఎన్‌ఏ)గా చీలిపోయింది. ‘నేషనల్ యూనిటీ’ ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అయితే, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సోమవారం ఎల్‌ఎన్‌ఏ ఆధీనంలోని బెంఘాజీలో పర్యటించారు. ఆయుధ ఒప్పందం చేసుకున్నారు. ఇది జరిగిన మరునాడే ‘నేషనల్ యూనిటీ’ ప్రభుత్వ ఆర్మీ చీఫ్ విమాన ప్రమాదంలో చనిపోవడం, అది కూడా పాక్‌కు సన్నిహిత టర్కీలో జరగడం చర్చనీయాంశంగా మారింది.