Share News

Lakshmi Mittal: బ్రిటన్‌ను వీడిన లక్ష్మీ మిత్తల్‌

ABN , Publish Date - Nov 25 , 2025 | 03:57 AM

ప్రపంచ ఉక్కు వ్యాపార దిగ్గజం, ప్రవాస భారతీయుడు లక్ష్మీనివాస్‌ మిత్తల్‌.. బ్రిటన్‌ను వీడారు. బ్రిటన్‌లోని లేబర్‌ పార్టీ ప్రభుత్వం ఆ దేశంలోని పన్ను చట్టాల్లో సమూల మార్పులు చేసి, కుబేరులపై భారీగా పన్నులు వేస్తుండటంతో.....

Lakshmi Mittal: బ్రిటన్‌ను వీడిన లక్ష్మీ మిత్తల్‌

  • తన వ్యాపార కేంద్రం స్విట్జర్లాండ్‌కు మార్పు

  • కొత్త నివాసంగా దుబాయ్‌ ఎంపిక

  • బ్రిటన్‌ కొత్త పన్ను చట్టాలకు నిరసనగానే

  • కుబేరులపై భారీగా పన్నులు వేసిన బ్రిటన్‌

లండన్‌, నవంబరు 24: ప్రపంచ ఉక్కు వ్యాపార దిగ్గజం, ప్రవాస భారతీయుడు లక్ష్మీనివాస్‌ మిత్తల్‌.. బ్రిటన్‌ను వీడారు. బ్రిటన్‌లోని లేబర్‌ పార్టీ ప్రభుత్వం ఆ దేశంలోని పన్ను చట్టాల్లో సమూల మార్పులు చేసి, కుబేరులపై భారీగా పన్నులు వేస్తుండటంతో ఆయన తన వ్యాపార కేంద్రాన్ని స్విట్జర్లాండ్‌కు, నివాసాన్ని దుబాయ్‌కి మార్చారు. బ్రిటన్‌ కొత్త పన్ను చట్టాలను నిరసిస్తూ ఇప్పటికే చాలామంది ధనవంతులు ఆ దేశాన్ని వీడారు. బ్రిటన్‌లోని అత్యంత ధనవంతుల్లో 8వ స్థానంలో, ప్రపంచ కుబేరుల్లో 104వ స్థానంలో ఉన్న మిత్తల్‌.. ఇకపై దుబాయ్‌లో నివసించనున్నట్లు సండే టైమ్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. పన్ను పరిధిలోకి వచ్చే వ్యాపార వ్యవహారాలను మాత్రం స్విట్జర్లాండ్‌కు మార్చినట్లు పేర్కొంది. మిత్తల్‌ యాజమాన్యంలోని ఆర్సెలార్‌ మిత్తల్‌ కంపెనీ ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉంది. 2021 వరకు ఆ కంపెనీకి సీఈవోగా ఉన్న ఆయన.. తన కుమారుడు ఆదిత్య మిత్తల్‌కు ఆ పదవిని అప్పగించి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఉన్నారు. భారత్‌లోని రాజస్థాన్‌లో ఉక్కు వ్యాపార కుటుంబంలో జన్మించిన లక్ష్మీ మిత్తల్‌.. 1995 నుంచి లండన్‌లో నివసిస్తున్నారు.


కొత్త పన్ను చట్టాలపై నిరసనగానే..

బ్రిటన్‌లో చాలాకాలం తర్వాత అధికారంలోకి వచ్చిన లేబర్‌ పార్టీ ప్రభుత్వం.. ధనవంతులపై భారీగా పన్నులు విధిస్తోంది. 226 ఏళ్లుగా ఉన్న నాన్‌-డోమ్‌ చట్టాన్ని రద్దు చేసింది. ఈ చట్టం ప్రకారం బ్రిటన్‌లో నివసించే వ్యక్తులు ఇతర దేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్‌లో పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసి కొత్త చట్టం తెచ్చింది. దాని ప్రకారం ప్రపంచంలో ఎక్కడ ఆదాయం సంపాదించినా, బ్రిటన్‌లో నివసించేవాళ్లు ఆ సంపదపై బ్రిటన్‌ ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిందే. దీంతోపాటు వారసత్వ పన్ను చట్టంలోనూ మార్పులు తెచ్చి, ప్రపంచంలో ఎక్కడ వారసత్వ సంపదపై ఆదాయం వచ్చినా బ్రిటన్‌ ప్రభుత్వానికి పన్ను కట్టాలని నిబంధన పెట్టింది. వీటికి అదనంగా బ్రిటన్‌ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నవారిపై కూడా ఎగ్జిట్‌ టాక్స్‌ వేసే చట్టం తేవాలని ప్రయత్నించింది. ఈ పన్ను చట్టాలను నిరసిస్తూ రివల్యూట్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్‌ స్టోరోన్‌స్కీ ఇప్పటికే తన మకాంను యూఏఈకి మార్చారు. కాగా, పారిశ్రామిక వేత్తలు దేశాన్ని వీడి వెళ్లిపోవడంపై బ్రిటన్‌ విదేశాంగ మంత్రి కైల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

దూకుడైన వ్యాపారానికి పెట్టింది పేరు

లక్ష్మీ మిత్తల్‌ను ముద్దుగా ‘కింగ్‌ ఆఫ్‌ స్టీల్‌’ అని కూడా పిలుస్తారు. వ్యాపార విస్తరణలో అత్యంత దూకుడుగా వ్యవహరించే ఆయన.. ఉక్కు రంగంలో తనకు పోటీగా ఉన్న అనేక సంస్థలను కొనుగోలు చేసి తన యాజమాన్యం కిందికి తెచ్చుకున్నారు. 2006లో లగ్జంబర్గ్‌కు చెందిన ఆర్సెలార్‌ సంస్థను బలవంతంగా కొనేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన కంపెనీల్లో ప్రస్తుతం 1,25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆర్సెలార్‌ కొనుగోలు తర్వాత తన కంపెనీకి ఆర్సెలార్‌ మిత్తల్‌ అని పేరు పెట్టారు. దాదాపు 60 దేశాల్లో ఆయనకు వ్యాపారాలున్నాయి. పోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితా ప్రకారం ఆయన సంపద 21.4 బిలియన్‌ డాలర్లు. లండన్‌లోని ‘బిలియనీర్స్‌ రో’గా పేరున్న కెన్సింగ్టన్‌ ప్యాలెస్‌ గార్డెన్స్‌ వీధిలో ఆయనకు మూడు నివాసాలు ఉన్నాయి. 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ‘తాజ్‌ మిత్తల్‌’ భవన నిర్మాణానికి భారత్‌లోని చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ కోసం పాలరాయిని తెచ్చిన క్వారీ నుంచే తరలించటం విశేషం. యూఏఈలో కూడా మిత్తల్‌ ఖరీదైన భవనాలు ఉన్నాయి. ఎమిరేట్‌ హిల్స్‌లో ఈ ఏడాది 152.7 మిలియన్‌ పౌండ్లతో ఓ ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశారు.

Updated Date - Nov 25 , 2025 | 03:57 AM