Share News

Khamenei: అమెరికాపై మాదే విజయం

ABN , Publish Date - Jun 27 , 2025 | 04:01 AM

అమెరికాపై తాము విజయం సాధించామని ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక ఆయన తొలిసారి ఈ యుద్ధంపై స్పందించారు.

 Khamenei: అమెరికాపై మాదే విజయం

  • మా దాడులు అమెరికాకు చెంపదెబ్బల్లాంటివి

  • ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా ఖమేనీ వెల్లడి

టెహ్రాన్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, జూన్‌ 26: అమెరికాపై తాము విజయం సాధించామని ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక ఆయన తొలిసారి ఈ యుద్ధంపై స్పందించారు. 10 నిమిషాల నిడివిగల వీడియోను విడుదల చేశారు. దాన్ని ఇరాన్‌ అధికారిక వార్తా చానల్‌ ప్రసారం చేసింది. ఆ వీడియోలో ఖమేనీ పలుమార్లు అమెరికా, ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. ‘‘12 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్‌పై మేమే విజయం సాధించాం. పశ్చిమాసియాలో అమెరికా కు చెందిన అతిపెద్ద బేస్‌పై దాడులు చేశాం. ఇవి అమెరికాకు చెంపదెబ్బ లాంటివే..! మరోమారు అమెరికా దుస్సాహసం చేస్తే.. మా క్షిపణులు అమెరికాను తాకుతాయనే సంకేతాన్నిచ్చాం’’ అని వ్యాఖ్యానించారు.

ఇరాన్‌కు తీవ్ర నష్టం: సీఐఏ

అమెరికా దాడులతో ఇరాన్‌ అణు కేంద్రాలకు తీవ్రంగా పరిగణించగలిగే స్థాయిలో నష్టం వాటిల్లిందని అగ్రరాజ్య కేంద్ర దర్యాప్తు సంస్థ(సీఐఏ) డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ వెల్లడించారు. కాగా.. ఇరాన్‌ అణు కార్యక్రమం పూర్తిస్థాయిలో దెబ్బతిన్నదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పునరుద్ఘాటించారు. నాటో సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘‘మా దాడులు పూర్తవ్వగానే.. మొస్సాద్‌ ఏజెంట్లు అణు కేంద్రాల వద్ద పరిశీలించారు. ఆయా కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు నిర్ధారించారు’’ అని చెప్పారు. కాగా, పన్నెండు రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరాన్‌లో 1,054 మంది మరణించారని, 4,476 మంది క్షతగాత్రులయ్యారని మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. అయితే.. ఇరాన్‌ ప్రభుత్వం మాత్రం 606 మంది మృతిచెందారని, 5,332 మంది క్షతగాత్రులయ్యారని ప్రకటించింది.

Updated Date - Jun 27 , 2025 | 04:02 AM