Khalistani Group Threatens: భారత కాన్సులేట్‌ను ముట్టడిస్తాం
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:28 AM
కెనడాలోని వాంకోవర్ నగరంలో ఉన్న భారత కాన్సులేట్‌ను గురువారం 12 గంటలపాటు ముట్టడించనున్నామని ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థ ...
కెనడాలోని ఖలిస్థానీ సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’ హెచ్చరిక
నేడు కాన్సులేట్‌కు వెళ్లొద్దని ఇండో-కెనడియన్లకు సూచన
వాంకోవర్, సెప్టెంబరు 17: కెనడాలోని వాంకోవర్ నగరంలో ఉన్న భారత కాన్సులేట్‌ను గురువారం 12 గంటలపాటు ముట్టడించనున్నామని ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’ హెచ్చరించింది. అందువల్ల గురువారం భారత కాన్సులేట్‌కు వెళ్లొద్దని ఇండో-కెనడియన్లకు ఒక ప్రకటనలో సూచించింది. భారత కాన్సులేట్ కెనడాలో గూఢచర్య నెట్‌వర్క్‌ను నడుపుతోందని, ఖలిస్థానీలపై నిఘా పెట్టిందని ఆ ప్రకటనలో ఆరోపించింది. దీనిపై కాన్సులేట్‌ను జవాబుదారీ చేయాలనే డిమాండుతో ఖలిస్థాన్ అనుకూలురైన సిక్కులు ఈ ముట్టడి నిర్వహించనున్నట్టు తెలిపింది. ‘హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజంట్ల పాత్ర గురించి దర్యాప్తు జరుగుతోందని రెండేళ్ల క్రితమే నాటి ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటుకు తెలిపారు. రెండేళ్లు దాటినా భారత కాన్సులేట్‌లు కెనడాలో గూఢచర్య నెట్‌వర్క్‌లను నడుపుతూనే ఉన్నాయి. ఖలిస్థాన్ ఉద్యమకారులపై నిఘా కొనసాగిస్తూనే ఉన్నాయి’ అని ఆ ప్రకటనలో ఆరోపించింది. కెనడాలోని భారత నూతన రాయబారి దినిశ్ పట్నాయక్ లక్ష్యంగా ఆయన ఫొటోతో ఒక పోస్టరును కూడా విడుదల చేసింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరుదేశాల మధ్య రెండేళ్లుగా దెబ్బతిన్న సంబంధాల పునరుద్ధరణలో భాగంగా భారత్, కెనడా దేశాలు పరస్పరం కొత్తగా రాయబారులను నియమించుకొన్న వారం రోజులకే ఖలిస్థానీల నుంచి తాజా బెదిరింపులు రావడం గమనార్హం. 2023 జూన్‌లో వాంకోవర్‌లోని ఒక సిక్కు ఆలయం బయట ఇద్దరు సాయుధులు నిజ్జర్‌ను కాల్చి చంపారు. ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ఆరోపించింది. నాటి భారత రాయబారితోపాటు అనేకమంది దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించింది. కెనడా ఆరోపణలను తోసిపుచ్చిన భారత్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. కెనడా రాయబారి సహా ఆ దేశానికి చెందిన ఆరుగురు సీనియర్ దౌత్య వేత్తలను భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది.