Share News

Park Ride Accident: బాబోయ్.. కళ్లముందే ఘోరాతి ఘోరం..

ABN , Publish Date - Jul 31 , 2025 | 06:00 PM

Park Ride Accident Video Viral: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సరదాగా గడుపుదామని వెళ్లిన వారు.. ఆస్పత్రిపాలయ్యారు. మరికొందరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. పార్క్‌లోని థ్రిల్ రైడ్ రాడ్ కుప్పకూలడం వల్ల ఈ ఘోర ప్రమాదం..

Park Ride Accident: బాబోయ్.. కళ్లముందే ఘోరాతి ఘోరం..
Jeddah

Park Ride Accident Video Viral: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సరదాగా గడుపుదామని వెళ్లిన వారు.. ఆస్పత్రిపాలయ్యారు. మరికొందరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పార్క్‌లోని థ్రిల్ రైడ్ రాడ్ కుప్పకూలడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగింది. పార్క్‌లో ఉన్న థ్రిల్ రైడ్ స్తంభం రెండు పీస్‌లుగా విరిగిపోయి కింద పడింది. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఖలీజ్ టైమ్స్ సమాచారం ప్రకారం.. గురవారం తైఫ్‌లోని అల్ హడా ప్రాంతంలోని గ్రీన్ మౌంటైన్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో 360 డిగ్రీస్ తిరిగే థ్రిల్ రైడ్‌ సెంట్రల్ పోల్ విరిగిపోవడం క్లియర్‌గా కనిపిస్తోంది.


వైరల్ అవుతున్న వీడియోలో తొలుత.. చాలా మంది ఆ రైడ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. థ్రిల్ రైడ్ అటూ ఇటూ ఊగుతుండగా.. అందులో ఉన్నవారు కేరింతలు కొట్టారు. ఇంతలో సడెన్‌గా భారీ శబ్ధం వచ్చింది. రైడ్ స్తంభం సగానికి విరిగిపోయింది. దీంతో రైడ్ వీల్ అంతెత్తు నుంచి ఒకేసారి కుప్పకూలింది. భయంతో రైడర్లు ఆర్తనాదాలు చేశారు. ఈ ఘటనలో 23 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. రైడ్ స్తంభం ఒక్కసారిగి విరిగిపోయింది. ఒక ముక్క వెనుక వైపు పడిపోగా.. మరో ముక్క ముందు వైపు పడిపోయింది. అయితే, రైడ్ స్తంభం ఎదురుగా నిలబడిన వారి మీద పడటంతో.. వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక రైడ్ వీల్‌లో కూర్చున్న వారికి సైతం తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనపై అక్కడి దర్యాప్తు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైడ్ వీల్ విరిగిపోవడానికి గల కారణమేంటనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు.

Updated Date - Jul 31 , 2025 | 06:05 PM