Share News

Israel intensifies control over Gaza: ఇజ్రాయెల్‌ అధీనంలోకి గాజా

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:32 AM

ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో పాటు భూతల దాడులు కూడా తోడవడంతో గాజా ధ్వంసమైపోతోంది. బహుళ అంతస్థుల భవనాలు క్షణాల్లో నేలమట్టమవుతున్నాయి....

Israel intensifies control over Gaza: ఇజ్రాయెల్‌ అధీనంలోకి గాజా

  • ఆ నగరంపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం

  • ఇప్పటికే 75% భూభాగం స్వాధీనం

  • వైమానిక దాడుల్లో పలు భవనాలు నేలమట్టం

  • ఉధృతంగా కొనసాగుతున్న భూతల దాడులు

  • తీరప్రాంతాలకు వెళ్లిపోతున్న గాజా వాసులు

  • రెండేళ్ల యుద్ధంలో 65 వేలకు చేరిన మృతులు

గాజా/టెల్‌అవీవ్‌, సెప్టెంబరు 17: ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో పాటు భూతల దాడులు కూడా తోడవడంతో గాజా ధ్వంసమైపోతోంది. బహుళ అంతస్థుల భవనాలు క్షణాల్లో నేలమట్టమవుతున్నాయి. గాజాపై ఇప్పటికే 75 శాతం నియంత్రణ తెచ్చుకున్న ఇజ్రాయెల్‌ పూర్తి పట్టుకోసం భూతల దాడులు ముమ్మరం చేసింది. దీనికి తోడు గాజా సిటీలో ఇప్పటికీ 3 వేల మంది హమాస్‌ ఉగ్రవాదులు ఉన్నారని వారిని అంతమొందిస్తేనే తమ లక్ష్యం నెరవేరుతుందంటూ దాడులు కొనసాగిస్తోంది. గాజాలో ఇజ్రాయెల్‌ మారణహోమం సృష్టిస్తోందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెలువడినా ఐడీఎఫ్‌ ఉధృతంగా దాడులు చేస్తోంది. దాడులు విధ్వంసకరంగా మారడంతో గాజా సిటీ నుంచి వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీరప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. తీర ప్రాంత రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. సిటీని వీడాలన్న ఐడీఎఫ్‌ హెచ్చరికలతో ముందుగానే మూడున్నర లక్షల మంది తీరప్రాంతాలకు వెళ్లిపోగా భూతల దాడుల తర్వాత మరో 3 లక్షల మంది గాజా నగరాన్ని విడిచిపెట్టారని సమాచారం. ఇజ్రాయెల్‌ దాడుల్లో గత రెండేళ్లలో 65,062 మంది పాలస్తీనియన్లు మృతిచెందగా 1,65,697 మంది గాయపడ్డారు.

యెమెన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు

యెమెన్‌లోని హొడైడాలో ఉన్న హౌతీల ఆయుధ స్థావరాలపై ఇజ్రాయెల్‌ భారీగా వైమానిక దాడులు జరిపింది. దీంతో హౌతీలు తమ గగనతల రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేశారు. ఈ కారణంగా ఇజ్రాయెల్‌ విమానాలు తికమకపడి వెనుతిరిగాయని హౌతీల అధికార ప్రతినిధి ప్రకటించారు. ఆ తర్వాత హౌతీలు ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించడంతో జెరుసలెంతో పాటు టెల్‌ అవీవ్‌లో సైరన్లు మోగాయి. హౌతీల రాకెట్లను కూల్చేశామని ఐడీఎఫ్‌ ప్రకటించింది.


ఈయూ ఆంక్షల యోచన

గాజాపై భారీ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించాలని యూరోపియన్‌ యూనియన్‌ యోచిస్తోంది. అయితే ఏకాభిప్రాయం కుదరడం లేదు. జర్మనీ, హంగేరీ, చెక్‌ రిపబ్లిక్‌ వంటి దేశాలు వ్యతిరేకిస్తుండగా స్పెయిన్‌, ఐర్లాండ్‌ దేశాలు ఆంక్షలను సమర్ధిస్తున్నాయి. మరోవైపు తమపై ఆంక్షలు విధించాలన్న ఈయూ యోచనను ఇజ్రాయెల్‌ తప్పుబట్టింది.

3.jpg2.jpg

Updated Date - Sep 18 , 2025 | 04:32 AM