Iran Uranium Stockpile: 408 కిలోల యురేనియం ఎక్కడ
ABN , Publish Date - Jun 24 , 2025 | 05:00 AM
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు.. అని సామెత ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి వ్యవహారం అలాగే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున బీ2 బాంబర్లను ప్రయోగించి.. ఫోర్డో అణు కేంద్రంపై 12 బంకర్ బస్టర్ బాంబులు వేసినా...
అమెరికా దాడులకు ముందే తరలించిన ఇరాన్
‘‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు..’’ అని సామెత! ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి వ్యవహారం అలాగే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున బీ2 బాంబర్లను ప్రయోగించి.. ఫోర్డో అణు కేంద్రంపై 12 బంకర్ బస్టర్ బాంబులు వేసినా దానికి అంతగా నష్టం వాటిల్లలేదని ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! దీనికితోడు.. అసలు అమెరికా దాడులకు ముందే ఇరాన్ ఆ కేంద్రం నుంచి 408 కిలోల యురేనియంను తరలించివేసినట్టు తెలుస్తోంది.. ఈ విషయాన్ని చెప్పింది మరెవరో కాదు.. సాక్షాత్తూ ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు అధికారులు. అమెరికా దాడికి ముందే ఇరాన్ ఫోర్డో ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున యురేనియం నిల్వలను, ఇతర పరికరాలను అక్కడి నుంచి వేరే చోటుకు పంపించివేసిందని వారు ‘న్యూయార్క్ టైమ్స్’ వార్తాసంస్థకు తెలిపారు. అంటే.. ఇరాన్‌పై దాడులకు దిగాలా వద్దా? దిగితే ఎలా దాడి చేయాలి? అని ట్రంప్ వార్ రూమ్‌లో సమాలోచనలు జరుపుతున్న సమయంలోనే.. 60ు శుద్ధి చేసిన 400 కిలోల యురేనియంను ఇరాన్ తరలించిందన్నమాట. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆ దేశానికి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు సైతం ఇరాన్ ఆ యురేనియాన్ని ఎక్కడికి తరలించిందో తెలియదని చెప్పినట్టు న్యూయార్క్‌టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అయితే.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఇరాన్ తరలించిన ఈ యురేనియం గురించి తమకు అత్యంత ఆసక్తికరమైన నిఘా సమాచారం ఉందని ప్రకటించడం గమనార్హం.
తాజా పరిణామాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇరాన్‌పై దాడులను సమర్థించుకున్నారు. అణ్వాయుధాల తయారీతోపాటు.. నెలకు 300 బాలిస్టిక్ క్షిపణుల తయారీ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న ఇరాన్‌కు కళ్లెం వేయడానికే టెహ్రాన్‌పై దాడులు జరిపినట్టు పునరుద్ఘాటించారు. తమ ఆందోళనల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కూడా చెప్పానని.. తక్షణం ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించానని వెల్లడించారు. ఇక.. గాజాలో యుద్ధం ఎప్పుడు ఆగుతుందని ప్రశ్నించగా.. ‘‘రేపే ఆగొచ్చు. హమాస్ లొంగిపోయి, తన ఆయుధాలన్నీ అప్పజెప్పి, బందీలను విడుదల చేస్తే ఈరోజే ఆగిపోవచ్చు. ’’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు.
- సెంట్రల్ డెస్క్