Share News

H 1B Visa Rules: అమెరికా చదువుపై అనాసక్తే

ABN , Publish Date - Oct 22 , 2025 | 05:48 AM

అమెరికా హెచ్‌ 1బీ వీసా కొత్త నిబంధనలపై స్పష్టత వచ్చినా, అక్కడే చదువుకుని, ఉద్యోగంలో చేరేవారికి లక్ష డాలర్ల ఫీజు వర్తించదని తేలినా.. భారత విద్యార్థులు...

H 1B Visa Rules: అమెరికా చదువుపై అనాసక్తే

  • హెచ్‌-1బీ నిబంధనల సమస్య తేలినా.. భారతీయుల్లో తగ్గని ఆందోళన

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): అమెరికా హెచ్‌-1బీ వీసా కొత్త నిబంధనలపై స్పష్టత వచ్చినా, అక్కడే చదువుకుని, ఉద్యోగంలో చేరేవారికి లక్ష డాలర్ల ఫీజు వర్తించదని తేలినా.. భారత విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. తాజా నిబంధనలు భారతీయులకు మేలు కలిగించేలా ఉన్నా కూడా అమెరికా చదువులపై తెలుగువారు అనాసక్తి చూపుతున్నారని హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి. అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం విదేశీయులకు సంబంధించి ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హెచ్‌-1బీ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు విధించడం భారతీయులే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయమనే భావన ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో అత్యధికులు అమెరికానే ఎంచుకునేవారు. కానీ ఇటీవలి పరిణామాల నేపథ్యంలో వారి దృక్పథంలో మార్పు వచ్చిందని హైదరాబాద్‌లోని వీజేసీ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ప్రతినిధి హేమంత్‌ తెలిపారు. విద్యార్థి వీసాల (ఎఫ్‌-1)పై వెళ్లినవారు తాత్కాలిక ఉద్యోగాలేవీ చేయకుండా నిబంధనలు కఠినతరం, ఉద్యోగ వీసాలకు సంబంధించి పూటకో ప్రకటన చేయడం, ఇటీవల ఏకంగా లక్ష డాలర్ల ఫీజు విధించడం వంటివి విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేపాయని పేర్కొన్నారు. ఎఫ్‌-1 వీసా నుంచి హెచ్‌-1బీ వీసాకు మారేందుకు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదని తాజాగా విడుదల మార్గదర్శకాలు చెబుతున్నా మునుపటి ఉత్సాహం కనిపించడమే లేదని తెలిపారు. అమెరికాలో మారిన పరిస్థితుల నేపథ్యంలో అనేకమంది ఆ దేశం వెళ్లాలనే ఆలోచనలను విరమించుకుంటున్నారని హిమాయత్‌నగర్‌లోని ఇంపీరియల్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ ప్రతినిఽధి నయీమ్‌ తెలిపారు. ‘‘బీటెక్‌ తర్వాత మాస్టర్స్‌, ఇతర పీజీ కోర్సుల కోసం 70శాతం మంది అమెరికాను ఎంచుకునేవారు. ఇప్పుడు మా వద్దకు వస్తున్నవారిలో అత్యధికులు కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకేకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు’’ అని వెల్లడించారు.

Updated Date - Oct 22 , 2025 | 05:48 AM