Share News

Shivank Awasthi: కెనడాలో భారత విద్యార్థి దారుణహత్య

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:42 AM

కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. టొరంటో యూనివర్సిటీ స్కార్‌బొరౌగ్‌ క్యాంపస్‌ సమీపంలో దుండగుడు...

Shivank Awasthi: కెనడాలో భారత విద్యార్థి దారుణహత్య

  • టొరంటో యూనివర్సిటీ సమీపంలో శివాంక్‌ అవస్థిపై దుండగుల కాల్పులు

  • తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి

న్యూఢిల్లీ/టొరంటో, డిసెంబరు 26: కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. టొరంటో యూనివర్సిటీ స్కార్‌బొరౌగ్‌ క్యాంపస్‌ సమీపంలో దుండగుడు(లు) ఓ విద్యార్థిని తుపాకీతో కాల్చిచంపారు. బాధితుడిని శివాంక్‌ అవస్థి (20)గా కెనడా పోలీసులు గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుందని ఓ ప్రకటనలో వెల్లడించారు. హైల్యాండ్‌ క్రీక్‌ ట్రెయిల్‌ అండ్‌ ఓల్డ్‌ కింగ్‌స్టన్‌ రోడ్‌ ఏరియాలో డాక్టరేట్‌ విద్యార్థి శివాంక్‌పై దుండుగులు కాల్పులు జరిపారని తెలిపారు. బాధితుడు తీవ్ర గాయాలతో పడివున్నాడన్న సమాచారం అందుకొన్న వెంటనే అక్కడకు చేరుకున్నామని, అయితే విద్యార్థి ఘటనాస్థలిలోనే మరణించాడని పేర్కొన్నారు. పోలీసులు అక్కడకు చేరుకోక ముందు నిందితులు పరారయ్యారని తెలిపారు. శివాంక్‌ అవస్థి హత్యపై టొరంటోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ‘ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటాం. స్థానిక అధికారుల సమన్వయంతో వారికి అవసరమైన సాయం అందిస్తాం’ అని తెలిపింది. ఇదిలా ఉండగా.. గత వారం టొరంటోలో హిమాన్షి ఖురానా (30) అనే ఓ భారతీయ మహిళ హత్యకు గురయ్యారు.

Updated Date - Dec 27 , 2025 | 03:42 AM