Share News

Heart Stent Outperforms: అమెరికన్‌ స్టెంట్‌పైభారతీయ స్టెంట్‌ పైచేయి!

ABN , Publish Date - Oct 31 , 2025 | 03:30 AM

ఒకటేమో అంతర్జాతీయంగా పేరున్న, అమెరికాలో అగ్రస్థానంలో ఉన్న స్టెంట్‌! మరొకటి భారత దేశంలో తయారైన స్టెంట్‌!! ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోమంటే..

Heart Stent Outperforms: అమెరికన్‌ స్టెంట్‌పైభారతీయ స్టెంట్‌ పైచేయి!

  • టక్సెడో-2 పేరిట దేశవ్యాప్తంగా 66 కేంద్రాల్లో ట్రయల్‌

  • తక్కువ వైఫల్య రేటుతో ప్రపంచ ప్రశంసలు పొందిన సుప్రాఫ్లెక్స్‌ క్రజ్‌.

  • హృద్రోగ నిపుణుల సమావేశంలో ట్రయల్‌ ఫలితాల వెల్లడి

శాన్‌ఫ్రాన్సిస్కో, అక్టోబరు 30: ఒకటేమో అంతర్జాతీయంగా పేరున్న, అమెరికాలో అగ్రస్థానంలో ఉన్న స్టెంట్‌! మరొకటి భారత దేశంలో తయారైన స్టెంట్‌!! ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోమంటే.. మెజారిటీ హృద్రోగులు అమెరికన్‌ స్టెంట్‌నే ఎంచుకుంటారు! కారణం.. విదేశీ వైద్య ఉపకరణాలపై ఉన్న నమ్మకం. కానీ.. ఒక ట్రయల్‌లో భాగంగా ఈ రెండు స్టెంట్ల పనితీరునూ పరీక్షించగా అమెరికన్‌ స్టెంట్‌తో పోలిస్తే భారతీయ స్టెంట్‌ వైఫల్య రేటే తక్కువగా ఉన్నట్టు తేలింది!! అమెరికన్‌ మార్కెట్‌ లీడర్‌ను సైతం తోసిరాజని అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆ మేడిన్‌ ఇండియా హార్ట్‌ స్టెంట్‌ పేరు.. సుప్రాఫ్లెక్స్‌ క్రజ్‌. గుజరాత్‌లోని సూరత్‌ కేంద్రంగా పనిచేసే సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ లిమిటెడ్ (SMT) ఈ స్టెంట్‌ను అభివృద్ధి చేసింది. దీని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు.. ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్‌ చైర్మన్‌, డీన్‌ అయిన డాక్టర్‌ ఉపేంద్ర కౌల్‌ దేశవ్యాప్తంగా 66 కార్డియాలజీ కేంద్రాల్లో ‘టక్సెడో-2’ పేరిట ట్రయల్స్‌ నిర్వహించారు. అవి కూడా మామూలు ట్రయల్స్‌ కావు.. అత్యంత క్లిష్టమైన ‘మల్టీ వెసెల్‌ డిసీజ్‌’తో బాధపడుతున్న హృద్రోగులను ఇందుకు ఎంచుకున్నారాయన. సాధారణంగా గుండెకు రక్తసరఫరా చేసే ప్రధాన ధమనులు మూడు ఉంటాయి. వాటిలో ఒకటికి మించి ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి బ్లాక్‌లు ఏర్పడితే.. దాన్ని మల్టిపుల్‌ వెసెల్‌ డిసీజ్‌ అంటారు. మూడు ధమనుల్లోనూ బ్లాక్స్‌ ఉంటే దాన్ని ట్రిపుల్‌ వెసెల్‌ డిసీజ్‌ అంటారు. దానికితోడు మధుమేహం వంటి ఇతర సమస్యలు కూడా ఉంటే వారికి చికిత్స చేయడం కష్టం. అలాంటిది.. డాక్టర్‌ ఉపేంద్ర కౌల్‌ మధుమేహంతో పాటు, అడ్వాన్స్‌డ్‌ దశలో ఉన్న ట్రిపుల్‌ వెసెల్‌ డిసీజ్‌ పేషెంట్లను 80ు మందిని ఈ ట్రయల్‌లో భాగం చేశారు. ట్రయల్స్‌లో భాగంగా కొందరికి అమెరికాకు చెందిన జియెన్స్‌ స్టెంట్‌ వేశారు. మరికొందరికి సుప్రాఫ్లెక్స్‌ క్రజ్‌ స్టెంట్‌ వేశారు. అమెరికా స్టెంట్‌ వేయించుకున్నవారితో పోలిస్తే.. మన స్టెంట్‌ వేయించుకున్న పేషెంట్లలో టీఎల్‌ఎఫ్‌ (టార్గెట్‌ లీజన్‌ ఫెయిల్‌) తక్కువగా ఉన్నట్టు ఫలితాల్లో వెల్లడైంది. స్టెంట్‌ వేసిన తర్వాత రోగుల్లో కలిగే ప్రతికూల ఫలితాలను కొలిచే విధానమే టార్గెట్‌ లీజన్‌ ఫెయిల్‌. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అమెరికన్‌ స్టెంట్‌తో పోలిస్తే మన స్టెంట్‌ ఏమీ తక్కువ కాదని ఈ ట్రయల్‌ నిరూపించిందని డాక్టర్‌ కౌల్‌ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ ముగిసిన ప్రపంచ కార్డియాలజిస్టుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

Updated Date - Oct 31 , 2025 | 05:43 PM