Share News

Indian Fertilizer Firms: రష్యాలో భారత్‌ యూరియా కర్మాగారం

ABN , Publish Date - Oct 27 , 2025 | 01:31 AM

దేశంలో యూరియా కొరతను నివారించడానికి భారతీయ ఎరువుల తయారీ కంపెనీలు వినూత్నంగా ఆలోచించాయి. ముడిసరకు అధికంగా లభించే రష్యాలోనే ఏకంగా కర్మాగారాన్ని...

Indian Fertilizer Firms: రష్యాలో భారత్‌ యూరియా కర్మాగారం

  • నిర్మించాలని ఎరువుల కంపెనీల ప్రతిపాదన

  • పుతిన్‌ పర్యటనలో ప్రకటించే అవకాశం

న్యూఢిల్లీ, అక్టోబరు 26: దేశంలో యూరియా కొరతను నివారించడానికి భారతీయ ఎరువుల తయారీ కంపెనీలు వినూత్నంగా ఆలోచించాయి. ముడిసరకు అధికంగా లభించే రష్యాలోనే ఏకంగా కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. యూరియా సరఫరాపై చైనా ఆంక్షలు విధించడంతో గుణపాఠం నేర్చుకున్న కంపెనీలు రష్యాలో తొలిసారిగా సొంతంగా కర్మాగారాన్ని నిర్మించనున్నాయి. రష్యాలో విస్తారంగా అమ్మోనియా, సహజవాయువు లభిస్తుండడంతో అక్కడే కర్మాగారాన్ని నిర్మించి యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని భావిస్తున్నాయి. ఈమేరకు ప్రభుత్వ రంగ సంస్థలైన రాష్ట్రీయ కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌ (ఆర్‌సీఎఫ్‌), నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌ఫఎల్‌), ఇండియన్‌ పొటాష్‌ లిమిటెడ్‌ (ఐపీఎల్‌)లు రష్యన్‌ భాగస్వాములతో ‘గుట్టు ఒప్పందా’ (నాన్‌ డిస్క్లోజర్‌ అగ్రిమెంట్‌-ఎన్‌డీఏ)న్ని కుదుర్చుకున్నాయి. అంతా ఖరారయ్యే వరకు వివరాలను బహిర్గత పరచకూడదన్నది ఈ ఒప్పందం సారాంశం. ఏటా 20 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల కర్మాగారం అక్కడ ఏర్పాటు కానుంది. స్థలం కేటాయింపు, అమ్మోనియా ధర నిర్ధారణ, రవాణా సౌకర్యాల కల్పనపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమ్మోనియా, సహజ వాయువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని దేశంలో యూరియాను తయారు చేస్తున్నారు. ముడిసరకు దిగుమతుల్లో ఇబ్బందులు వస్తే దాని ప్రభావం యూరియా లభ్యతపై కనిపిస్తోంది. ఇటీవల యూరియా, ఇతర ముడిసరకులపై చైనా ఆంక్షలు విధించడంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో తగినంతగా దొరకక రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే రష్యాలో సొంతంగా కర్మాగారం నిర్మించుకోవడమే మేలని ప్రభుత్వ సంస్థలు భావిస్తున్నాయి.

Updated Date - Oct 27 , 2025 | 01:31 AM