Share News

Putin Ahead of Visit: పుతిన్‌ను విమర్శిస్తూ భారత పత్రికలో వ్యాసం

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:06 AM

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటనకు వస్తున్న సమయంలో ఆయనను, రష్యాను తీవ్రంగా విమర్శిస్తూ ఉమ్మడిగా కథనం రాసిన మూడు...

Putin Ahead of Visit: పుతిన్‌ను విమర్శిస్తూ భారత పత్రికలో వ్యాసం

  • ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే రాయబారుల తీరును తప్పుబట్టిన కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 3: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత పర్యటనకు వస్తున్న సమయంలో ఆయనను, రష్యాను తీవ్రంగా విమర్శిస్తూ ఉమ్మడిగా కథనం రాసిన మూడు దేశాల దౌత్యవేత్తల తీరును భారత్‌ తప్పుబట్టింది. తమకు సంబంధం లేని మూడో దేశం వ్యవహరంలో జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది. పుతిన్‌ గురువారం భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌లోని యూకే హైకమిషనర్‌ లిండీ కామెరాన్‌, ఫ్రాన్స్‌ రాయబారి థియెరీ మాథౌ, జర్మనీ హైకమిషనర్‌ ఫిలిప్‌ అకర్‌మన్‌ సోమవారం టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఒక ఉమ్మడి వ్యాసం రాశారు. ఉక్రెయిన్‌పై రష్యా పక్కా ప్రణాళిక ప్రకారమే యుద్ధం చేస్తోందని.. శాంతి నెలకొల్పే ఆలోచన పుతిన్‌కు ఏమాత్రం లేదని అందులో విమర్శించారు. పుతిన్‌ శాంతి చర్చల్లో జాప్యం చేసినకొద్దీ తాము ఉక్రెయిన్‌కు రక్షణ, ఇతర సహయ సహకారాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. దీనిని భారత విదేశాంగ శాఖ అధికారులు తీవ్రంగా తప్పుబట్టారు. పుతిన్‌ పర్యటనకు ముందు భారత పత్రికల్లో ఇలాంటి వ్యాసం రాయడం ఇక్కడి వారిని ప్రభావితం చేసే ప్రయత్నమేనని పేర్కొన్నారు. ఇది అసాధారణమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. దౌత్యపరమైన వ్యవహారాలకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. ఇక మూడు దేశాల దౌత్యవేత్తల ఉమ్మడి వ్యాసం.. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, రష్యా వ్యతిరేకతను ప్రచారం చేయడమేనని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్‌ సిబల్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 04:06 AM