India Oman Relation: ఒమన్‌తో వాణిజ్య స్వేచ్ఛ!
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:05 AM
అమెరికా సుంకాల బాధ తప్పేలా, మన దేశ సరుకులకు సరికొత్త మార్కెట్‌ను సమకూర్చుకునేలా భారత్ మరో ముందడుగు వేసింది. గల్ఫ్‌లో కీలక దేశమైన ఒమన్‌తో ....
98% భారత ఎగుమతులపై సుంకాలు సున్నా
ఔషధాలు, వస్త్రాలు, సాగు ఉత్పత్తులకు అనుమతులు
ఒమన్‌లో ఆయుష్ వైద్య సేవలకూ మార్గం సుగమం
78% ఒమన్ దిగుమతులపై సుంకాల మినహాయింపు
భారత్-ఒమన్ ఒప్పందం వాణిజ్య మంత్రుల సంతకాలు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
అమెరికా సుంకాల బాధ తప్పేలా, మన దేశ సరుకులకు సరికొత్త మార్కెట్‌ను సమకూర్చుకునేలా భారత్ మరో ముందడుగు వేసింది. గల్ఫ్‌లో కీలక దేశమైన ఒమన్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఒమన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, ఆ దేశ సుల్తాన్ హైతమ్ బిన్ తారీఖ్ సమక్షంలో గురువారం ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)’ ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, ఖయిస్ బిన్ మహమ్మద్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరో స్థాయికి చేరుకున్నాయని, ఇదొక సువర్ణాధ్యాయమని మోదీ, సుల్తాన్ పేర్కొన్నారు. ఇటీవల మూడు దేశాల పర్యటన చేపట్టిన ప్రధాని మోదీ.. బుధవారమే ఒమన్‌లోని మస్కట్ నగరానికి చేరుకున్నారు. గురువారం రాజభవనం అల్ బర్ఖా ప్యాలె్‌సలో సుల్తాన్ హైతమ్ బిన్ తారీఖ్‌తో సమావేశమయ్యారు. భారత్, ఒమన్ మధ్య ద్వైపాక్షిక బంధం మొదలై 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను, వాణిజ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, రక్షణ రంగంలో పరస్పర సహకారం పెంపు, పునరుత్పాదక ఇంధన వనరులు, భారత యూపీఐ, రూపే చెల్లింపుల వ్యవస్థలు.. ఒమన్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మధ్య అనుసంధానం, ఇరు దేశాల మధ్య స్థానిక కరెన్సీలో లావాదేవీలు తదితర అంశాలపైనా చర్చించారు. ఈ సందర్భగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఒమన్, భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మక ముందడుగని అభివర్ణించారు. 21వ శతాబ్దంలో ఇరు దేశాల బంధాన్ని ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ఒమన్ సుల్తాన్‌తో భేటీ అనంతరం నిర్వహించిన ‘ఇండియా-ఒమన్ బిజినెస్ ఫోరం’ సదస్సులోనూ మోదీ మాట్లాడారు. ‘‘ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం రూ.90 వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు)కు చేరుకుంటోంది. తాజా ఒప్పందంతో ఇది భారీగా పెరుగుతుంది’’ అని చెప్పారు. ఒమన్‌లో ఉన్న భారతీయుల సంక్షేమం కోసం ఒమన్ సుల్తాన్ సహకరిస్తున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు.
మోదీకి ఒమన్ అత్యున్నత అవార్డు
ప్రధాని మోదీని ఒమన్ తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’తో సత్కరించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంఽధం బలోపేతానికి కృషి చేశారంటూ మోదీకి ఒమన్ సుల్తాన్ హైతమ్ ఈ అవార్డును ప్రదానం చేశారు. దీనితో ఇప్పటివరకు ప్రధాని మోదీ అందుకున్న విదేశీ అత్యున్నత పౌర పురస్కారాల సంఖ్య 28కి చేరడం గమనార్హం.
ఒమన్‌లో అపోలో ఆస్పత్రి: సంగీతారెడ్డి
బిజినెస్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు భారత్ నుంచి వచ్చిన వ్యాపారవేత్తల బృందంలో అపోలో ఆస్పత్రి ఎండీ సంగీతారెడ్డి కూడా ఉన్నారు. ఒమన్ దేశస్తులు చాలా మంది వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి వస్తుంటారని, ఈ క్రమంలో ఒమన్‌లో సొంతంగా అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
ఒమన్‌తో ఒప్పందంలోని కీలక అంశాలివే..
భారత్ నుంచి ఒమన్‌కు ఎగుమతి అయ్యే 98.08ు వస్తువులు, సేవలపై ఎలాంటి సుంకాలూ ఉండవు. ఇందులో వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, క్రీడా సామగ్రి, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఫర్నిచర్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు వంటివి ఉన్నాయి.
ఆయుర్వేద, హోమియో, యునానీ తదితర (ఆయుష్) సాంప్రదాయ వైద్య విధానాలు, ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించిన అంశం కూడా తాజా ఒప్పందంలో ఉంది.
ఒమన్‌లో భారత కంపెనీలకు 100ు ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఒప్పందం వీలుకల్పిస్తోంది. అక్కడి కార్యాలయాల్లో 50ు వరకు భారత ఉద్యోగులు, సిబ్బందిని నియమించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఇది 20శాతమే ఉంది. కాంట్రాక్టు విధానంలో సేవలు అందించే సిబ్బందికి ఇప్పటివరకు గరిష్ఠంగా 90 రోజులే గడువు ఉండగా.. ఇకపై రెండేళ్ల వరకు ఒమన్‌లో ఉండవచ్చు.
మరోవైపు ఒమన్ నుంచి భారత్‌కు వచ్చే దిగుమతుల్లో 77.79ు వస్తువులు, సేవలపై ఎలాం టి సుంకాలు ఉండవు. వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులు, టీ, కాఫీ, రబ్బరు, పొగాకు ఉత్పత్తులు, బంగారం, వెండి, ఆభరణాలు వంటివాటి దిగుమతులకు మాత్రం ప్రస్తుత సుంకాలు కొనసాగుతాయి.
తెలుగులో పలకరించిన మోదీ
ఒమన్ సుల్తాన్‌తో భేటీకి ముందు అక్కడి ప్రవాస భారతీయులతో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు భాషలలో పలకరించారు. ‘అందరూ బాగున్నారా’ అని తెలుగులో అడిగారు. ఒమన్‌లో తెలుగు, మలయాళం,తమిళం, కన్నడం, గుజరాతీ మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా కొందరు జనసేన అభిమానులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మోదీ కలిసి ఉన్న చిత్రంతో వేదిక వద్ద నిలబడి మోదీకి అభివాదం చేశారు. కాగా, ఒమన్‌లో రెండురోజుల పర్యటన ముగించుకున్న మోదీ గురువారం సాయంత్రం భారత్‌కు బయలుదేరారు.