ICE Raids: అమెరికాలో హ్యుండయ్ ప్లాంట్‌పై దాడి
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:22 AM
అక్రమ వలసదారుల ఏరివేత పేరుతో అమెరికా ఫెడరల్ ఏజెన్సీ-ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న హ్యుండయ్ ఎలక్ట్రిక్ వాహన ప్లాంట్ వద్ద...
వాషింగ్టన్/సియోల్, సెప్టెంబరు 7: అక్రమ వలసదారుల ఏరివేత పేరుతో అమెరికా ఫెడరల్ ఏజెన్సీ-ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న హ్యుండయ్ ఎలక్ట్రిక్ వాహన ప్లాంట్ వద్ద గురువారం జరిపిన దాడులు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. ముసుగులు ధరించి, సాయుధులైన సైనికులు ప్లాంట్లోకి వచ్చి, అక్కడ పనిచేస్తున్న 475 మందిని అరెస్టు చేశారు. వీరిలో 300 మంది వరకు దక్షిణ కొరియా పౌరులు ఉన్నారు. అక్రమంగా వలస వచ్చిన కార్మికులు ఈ ప్లాంట్‌లో పనిచేస్తున్నారనే అనుమానాలతో దాడులు జరిపినట్లు ఐసీఈ ప్రకటించింది. తాత్కాలిక కార్మిక వీసాలపై వచ్చిన వారు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపించింది. ఈ మధ్యకాలంలో అమెరికాలో జరిగిన అతిపెద్ద ఇమిగ్రేషన్ దాడి ఇదే. ఐసీఈ బలగాల దాడులతో దక్షిణ కొరియా కార్మికులు కకావికలమయ్యారు. కొందరు చెరువులోకి దూకి, పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే.. ఐసీఈ బలగాలు అప్పటికే సిద్ధం చేసిన బోట్లలో వారిని వెంబడించి అరెస్టు చేశాయి. ఐసీఈ దాడులపై దక్షిణ కొరియా స్పందించింది. ఐసీఈ గుర్తించిన వర్కర్లలో ఎక్కువ మందిని డీపోర్ట్ చేయాల్సి ఉన్నట్లు తేలడంతో.. చార్టెడ్ విమానాలను పంపి, వారిని తీసుకువస్తామని ఆదివారం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది.