Fraud: భారతీయులను తిప్పి పంపిన దేశాల్లో సౌదీ టాప్
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:25 AM
ట్రంప్ ప్రభుత్వం అమెరికా నుంచి భారీ సంఖ్యలో భారతీయులను తిప్పి పంపిస్తోందన్న అభిప్రాయాలు నెలకొన్నప్పటికీ వాస్తవానికయితే ఈ విషయంలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది.
అక్కడి నుంచి ఈ ఏడాది 11వేల మంది స్వదేశానికి
అమెరికా నుంచి 3,800 మందే
హైదరాబాద్, డిసెంబరు 27: ట్రంప్ ప్రభుత్వం అమెరికా నుంచి భారీ సంఖ్యలో భారతీయులను తిప్పి పంపిస్తోందన్న అభిప్రాయాలు నెలకొన్నప్పటికీ వాస్తవానికయితే ఈ విషయంలో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది 11వేల మందికిపైగా భారతీయులను స్వదేశానికి పంపించింది. అదే అమెరికా కేవలం 3,800 మందిని పంపించి వేసింది. విదేశీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం 2025లో 81 దేశాలు 24,600 మంది భారతీయులను తిప్పి పంపించగా అందులో దాదాపుగా సగం మంది గల్ఫ్ దేశాలకు వెళ్లినవారే ఉన్నారు. యూఏఈ నుంచి 1,469 మంది, బహ్రెయిన్ నుంచి 764 మంది తిరిగి వచ్చారు. వీసా గడువు ముగిసినా ఆయా దేశాల్లో నివసిస్తుండడం, తగిన వర్క్ పర్మిట్లు లేకపోవడం, విధులకు గైర్హాజరు కావడం, నేరాలకు పాల్పడడం వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారంతా నైపుణ్యం లేని కూలీలే. స్థానిక చట్టాలు, అధికారిక పత్రాలపై తగిన అవగాహన లేనందున అక్కడి అఽధికారులకు చిక్కి బహిష్కరణకు గురవుతున్నారు. సైబర్ నేరాల స్థావరాలుగా మారిన మయన్మార్, కంబోడియాలను ‘సైబర్ బానిసలు’గా వెళ్లిన భారతీయులను కూడా ఆయా దేశాలు తిప్పి పంపించాయి. అఽధిక వేతనాలు చెల్లిస్తామన్న ఆశచూపడంతో అక్కడికి వెళ్లి పలువురు యువకులు మోసగాళ్ల వలలో చిక్కుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. చివరకు అక్కడి పోలీసులకు చిక్కడంతో వారు బాధితులను స్వదేశాలకు పంపిస్తున్నారు. ఈ విధంగా మయన్మార్ నుంచి 1,591 మంది, కంబోడియా నుంచి 305 మంది తిరిగి వచ్చారు. ఉద్యోగులనే కాకుండా విద్యార్థులను కూడా పలు దేశాలు వివిధ కారణాలతో తిప్పి పంపాయి. అత్యధికంగా బ్రిటన్ 170 మందిని, ఆస్ట్రేలియా 114 మందిని, రష్యా 82 మందిని, అమెరికా 45 మందిని ఈ ఏడాది తిప్పి పంపించాయి.