H 1B Visa Interviews: హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలు రద్దు
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:37 AM
హెచ్1బీ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన తప్పనిసరి చేయడంతో పెద్ద సంఖ్యలో వీసా ఇంటర్వ్యూలు రద్దయ్యాయి...
వాషింగ్టన్, డిసెంబరు 10: హెచ్1బీ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన తప్పనిసరి చేయడంతో పెద్ద సంఖ్యలో వీసా ఇంటర్వ్యూలు రద్దయ్యాయి. ఇది అనేకమంది ప్రయాణ ప్రణాళికలను దెబ్బకొట్టింది. ఈనెల 15 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానున్న నేపథ్యంలో హెచ్1బీ వర్కర్లు, వారి కుటుంబసభ్యుల్లో అనిశ్చితి నెలకొంది. ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన వల్ల పెద్ద సంఖ్యలో వీసా ఇంటర్వ్యూలు రీషెడ్యూల్ అవుతున్నాయి. దీంతో అనేకమంది దరఖాస్తుదారుల ప్రయాణాలు హఠాత్తుగా రద్దవుతున్నాయి. ఈనెల మధ్య నుంచి నెలాఖరు వరకు నిర్వహించాల్సిన ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను హైదరాబాద్, చెన్నై సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాన్సులేట్లు రద్దు చేశాయని ఇమ్మిగ్రేషన్ లాయర్లు తెలిపారు. వీటిలో అనేక స్లాట్లను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేయడంతో వారి ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి వస్తోంది. అయితే, తాజా నిబంధన నేపథ్యంలో రోజువారీ ఇంటర్వ్యూల సంఖ్య ను కాన్సులేట్లు తగ్గిస్తున్నాయి. దీనివల్ల అనేకమంది ఇంటర్వ్యూలు రద్దవుతున్నాయి. వీసా రద్దయినవారిలో 8 వేలమందికిపైగా విద్యార్థు లు ఉన్నారని అమెరికా విదేశాంగశాఖ సీనియర్ అధికారి తెలిపారు. రద్దైన వీసాల్లో దాదాపు సగం.. మద్యం మత్తులో వాహనం నడపడం, చోరీ, దాడి తదితర కారణాలతోనే రద్దయ్యాయన్నారు. ఉగ్రవాదాన్ని సమర్థించడం వంటి తీవ్రమైన కారణాలు, గడువు ముగియడం వంటి పరిపాలనాపరమైన కారణాల వల్ల కూడా వీసాలు రద్దు చేశామని అంతుకుముందు మీడియాకు విదేశాంగశాఖ వెల్లడించింది.