Share News

Gunmen Attack Hanukkah Celebration: యూదులపై మారణకాండ

ABN , Publish Date - Dec 15 , 2025 | 04:13 AM

అది ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని ప్రఖ్యాత బోండి బీచ్‌.. ఓ పక్కన యూదుల మత కార్యక్రమం ‘హనూకా’ వేడుకలు జరుగుతున్నాయి....

Gunmen Attack Hanukkah Celebration: యూదులపై మారణకాండ

  • ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండిబీచ్‌లో ‘హనూకా’ వేడుకలపై ఇద్దరు సాయుధుల కాల్పులు

  • 29 మందికి గాయాలు.. ఒక ఉగ్రవాదిపైకి లంఘించి తుపాకీ లాక్కున్న పౌరుడు

  • పోలీసుల కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరి మృతి, మరొకరి అరెస్ట్‌

  • అతడు సిడ్నీ వాసి నవీద్‌.. ఉగ్రవాదిని ఒడిసిపట్టిన వ్యక్తి పండ్ల వ్యాపారి అహ్మద్‌?

  • ఆస్ట్రేలియా విధానాలతోనే యూదు ద్వేషానికి ఆజ్యం: నెతన్యాహూ.. మోదీ దిగ్ర్భాంతి

సిడ్నీ, డిసెంబరు 14: అది ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని ప్రఖ్యాత బోండి బీచ్‌.. ఓ పక్కన యూదుల మత కార్యక్రమం ‘హనూకా’ వేడుకలు జరుగుతున్నాయి.. వందలాది మంది గుమిగూడి ఉన్నారు.. ఉన్నట్టుండి నలుపు రంగు దుస్తుల్లో ఉన్న ఇద్దరు సాయుధులు అక్కడికి దూసుకొచ్చారు. కార్యక్రమం జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోని పాదచారుల వంతెనపైకి ఎక్కి జనం వైపు కాల్పులు మొదలుపెట్టారు. యూదు ల్లో ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. ఎటువైపువారు అటు చెల్లాచెదురయ్యారు. పదుల సంఖ్యలో రక్తపు మడుగులో పడిపోయారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఉగ్రవాదులు వారిని వెంటాడుతూ కాల్పులు జరిపారు. సుమారు ఏడు నిమిషాలపాటు మారణహోమం జరిగింది. ఈ క్రమంలో ఒక యువకుడు ధైర్యంగా ఓ ఉగ్రవాదితో కలబడి తుపాకీ లాక్కున్నారు. కాసేపట్లోనే పోలీసులు అక్కడికి చేరుకుని కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 12 మంది యూదులు మరణించగా, మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించాడు. మరొకరిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. బోండి బీచ్‌ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ వెంటనే జాతీయ భద్రతా సమావేశాన్ని నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాద దాడి చాలా దారుణమని.. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపి, చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసులు, అధికారులను ఆదేశించారు. కాగా, ప్రధాని ఆల్బనీస్‌ బోండి బీచ్‌ ఘటన యూదులపై జరిగిన దాడి అనే ప్రస్తావన తీసుకురాకపోవడంపై ఆస్ట్రేలియా యూదు అసోసియేషన్‌ తీవ్రంగా మండిపడింది. ఇది ఆయన సిగ్గుపడాల్సిన విషయమని వ్యాఖ్యానించింది. ఆస్ట్రేలియాలో యూదు ద్వేషంపై చాలా సార్లు ప్రభుత్వానికి హెచ్చరికలు వచ్చాయని, అయినా యూదులను రక్షించేందుకు తగిన చర్యలు చేపట్టలేదని పేర్కొంది. మరోవైపు ఆస్ట్రేలియాలోని ముస్లిం సంస్థలు ఈ ఉగ్రవాద దాడిని ఖండించాయి. ఇది చాలా దారుణమైన ఘటన అని.. ఆస్ట్రేలియాలోని ముస్లిం సమాజం సహా అందరిపై దాడి జరిగినట్లేనని ఆస్ట్రేలియా నేషనల్‌ ఇమామ్స్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు పేర్కొంది.


ఒక ఉగ్రవాది.. పాకిస్థానీ అని ప్రచారం!

హనుక్కా వేడుకపై జరిగినది ఉగ్రదాడేనని న్యూసౌత్‌వేల్స్‌ పోలీస్‌ కమిషనర్‌ మాల్‌ లన్యన్‌ ప్రకటించారు. దాడి ఘటన అనంతరం తనిఖీల్లో ఉగ్రవాదులకు చెం దిన కారులో ఒక బాంబు, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించగా, తీవ్రంగా గాయపడిన మరో ఉగ్రవాది పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఉగ్రవాదుల్లో ఒకరి ని సిడ్నీలోని బోనీరిగ్‌ ప్రాం తంలో ఉండే 24ఏళ్ల నవీద్‌ అక్రమ్‌గా గుర్తించినట్టు ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. కాగా అతను పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందినవాడని, సిడ్నీలోని అల్‌ మురాద్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నాడని అతడి పేరిట ఉన్న డ్రైవింగ్‌ లైసెన్సు, ఇతర ఆధారాలు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. ఈ ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో హమాస్‌ దాడిలో తృటిలో తప్పించుకున్న ఓ వ్యక్తి.. 2 వారాల క్రితమే ఆస్ర్టేలియా వచ్చి ఇప్పుడు బోండి బీచ్‌ ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడ్డారు.

దాడిని ఖండించిన ఇజ్రాయెల్‌

సిడ్నీలో హనుక్కా వేడుకపై దాడిని యూదు దేశమైన ఇజ్రాయెల్‌ తీవ్రంగా ఖండించింది. ఆస్ర్టేలియా ప్రభుత్వ విధానాలు దీనికి కారణమని ఆరోపించింది. యూదులపై ద్వేషభావం ఆస్ట్రేలియా సమాజాన్ని కలుషితం చేస్తోందని.. ఆస్ట్రేలియాప్రభుత్వ విధానాలు ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ మండిపడ్డారు. 3నెలల కింద పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టుగా ఆస్ట్రేలియా ప్రకటించిన సమయంలోనే ఆ దేశ ప్రధాని ఆల్బనీ్‌సకు లేఖ రాసినట్టు గుర్తు చేశారు. నేతలు సరిగా స్పందించకున్నా, మౌనంగా ఉన్నా యూదులపై ద్వేషం ఒక క్యాన్సర్‌లా విస్తరిస్తుందన్నారు. ఆస్ట్రేలియాలోని యూదులపై ఉగ్రవాదులు అత్యంత నీచంగా, క్రూ రంగా దాడికి పాల్పడ్డారని ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఐసాక్‌ హెర్జోగ్‌ అన్నారు.


చీకటిపై వెలుగు సాధించిన విజయమే‘హనూకా’

భారతీయులకు దీపావళి పండుగ తరహాలో యూదులు ‘హనూకా’ వేడుకను జరుపుకొంటారు. యూదులు క్రీస్తుపూర్వం 141 సంవత్సరంలో తాము ఎంతో పవిత్రంగా భావించే జేరుసలేం ఆలయాన్ని సెల్యూసిడ్‌ సామ్రాజ్యం నుంచి తిరిగి దక్కించుకున్నారు. అన్ని రోజులుగా చీకటిలో వదిలేసిన పవిత్ర ఆలయంలో దీపం వెలిగించారు. కానీ ఒక్క రోజుకు సరిపడా మాత్రమే నూనె ఉండటంతో ఆందోళన చెందారు. అయితే వారికి తిరుగుబాటు దళాల నుంచి సాయం అందేదాకా 8 రోజుల పాటు ఆ దీపం వెలుగుతూనే ఉంది. అది దైవ మహిమ అని.. చీకటిపై వెలుగు సాధించిన విజయమని తలచి ఏటా చలికాలంలో 8 రోజుల పాటు ‘హనూకా’ పండుగగా జరుపుకొంటారు. ఈ పండుగలో భాగంగా ఆదివారం తొలి రోజున బోండి బీచ్‌లో క్యాండిల్స్‌ వెలిగించేందుకు సిద్ధమైన యూదులపై ఉగ్రవాదులు దాడి చేశారు.

ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు: ప్రధాని మోదీ

ఆస్ట్రేలియాలో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ దిగ్ర్భాం తి వ్యక్తం చేశారు. ఉగ్రదాడి దారుణమని, బాధితులకు భారత ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నానని ‘ఎక్స్‌’లో తెలిపారు. ఉగ్రవాదాన్ని భారత్‌ ఏమాత్రం సహించే ప్రసక్తేలేదన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్‌ అన్ని రకాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు.

మెరుపులా వచ్చి.. తుపాకీ లాక్కుని..

బోండి బీచ్‌ ఘటనలో అహ్మద్‌ అల్‌ అహ్మద్‌ అనే వ్యక్తి చూపిన తెగువ ప్రశంసలు పొందుతోంది. కార్లు పార్క్‌ చేసిన ప్రాంతంలో నిలబడిన అహ్మద్‌.. ఒక ఉగ్రవాది కాల్పులు జరుపుతూ అటువైపు రావడంతో ఓ కారు వెనక నక్కారు. అత ను తిరిగిన వెంటనే మెరుపులా దూసుకెళ్లి వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నారు. ఉగ్రవాది నుంచి తుపాకీని లాక్కుని అతడిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. అంతలోనే మరో వ్యక్తి అహ్మద్‌కు సాయంగా వచ్చారు. కానీ దూరంగా ఉన్న మరో ఉగ్రవాది కాల్పులు జరపడంతో అహ్మద్‌, మరో వ్యక్తి పక్కనున్న చెట్టు వెనుక దాక్కున్నారు. అహ్మద్‌ తుపాకీ లాక్కుని ఉండకపోతే మరెందరో కాల్పులకు బలయ్యేవారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా.. సాహసం అందులో రికార్డయింది. 43ఏళ్ల అహ్మద్‌ బీచ్‌ ప్రాంతంలోనే పండ్ల వ్యాపారం చేస్తుంటారని మీడియాలో వార్తలు వచ్చాయి.

Updated Date - Dec 15 , 2025 | 05:13 AM