Hinduphobia: 'హిందూఫోబియా' బిల్లు తెచ్చిన తొలి అమెరికా రాష్ట్రంగా జార్జియా
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:36 PM
అమెరికాలో హిందువుల రక్షణకు నడుంబిగించిన మొట్టమొదటి రాష్ట్రంగా జార్జియా నిలిచింది. కొత్తగా తెచ్చిన ఈ హిందూఫోబియా బిల్లు ఆమోదం పొందితే.. ఇక భారతీయులకు..

Georgia: హిందూఫోబియాకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టిన మొదటి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచింది. హిందువులపై విద్వేషపూరిత దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జార్జియా ఈ చారిత్రాత్మక చట్టానికి శ్రీకారం చుట్టింది. హిందూఫోబియాను అధికారికంగా గుర్తిస్తూ ఒక బిల్లును అమెరికాలోని జార్జియా రాష్ట్రం ప్రవేశపెట్టింది. దీంతో హిందూఫోబియాను గుర్తించిన తొలి అమెరికా రాష్ట్రంగా జార్జియా కీర్తించబడుతుంది. ఈ బిల్లుకు ఆమోదం లభించి, చట్టంగా మారితే, జార్జియా పీనల్ కోడ్‌ను సవరిస్తారు. ఫలితంగా దర్యాప్తు సంస్థలు హిందూఫోబియా, హిందువుల పట్ల వివక్ష, విద్వేషపూరిత నేరాలపై చర్యలు చేపట్టడానికి వీలవుతుంది.
జార్జియా జనరల్ అసెంబ్లీలో ఈ నెల 4న ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు స్పాన్సర్లుగా డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఉన్నారు. రిపబ్లికన్ సెనేటర్లు షాన్ స్టిల్, క్లింట్ డిక్సన్.. డెమోక్రటిక్ సెనేటర్లు జాసన్ ఎస్టీవ్స్, ఇమాన్యుయేల్ డి జోన్స్ ఈ బిల్లుని సంయుక్తంగా సమర్థించారు. 'కొయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా' దీనిపై హర్షం వ్యక్తం చేసింది. ఈ బిల్లుకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది. కాగా, జార్జియాలోని అతిపెద్ద ఇండో-అమెరికన్ కమ్యూనిటీ 'ఫోర్సిత్ కౌంటీ'కి ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ ప్రతినిధులు లారెన్ మెక్‌డొనాల్డ్, టాడ్ జోన్స్ ఈ తీర్మానం ప్రవేశ పెట్టడంలో కీలక పాత్ర పోషించారు.
2023-2024 'ప్యూ రీసెర్చ్ సెంటర్ రిలిజియస్ ల్యాండ్‌స్కేప్ స్టడీ' ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు 2.5 మిలియన్ల మంది హిందువులు ఉన్నారు. ఇది మొత్తం అమెరికా జనాభాలో 0.9 శాతం. వీరిలో 40,000 మందికి పైగా జార్జియాలో నివసిస్తున్నారు. ప్రధానంగా అట్లాంటా మెట్రోపాలిటన్ ప్రాంతంలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇవి కూడా చదవండి..