Gen Z Takes the World by Storm in 2025: జెన్-జీ నామ సంవత్సరే..
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:42 AM
ప్రపంచంలోని ఏకైక హిందూ దేశమైన నేపాల్‌లో నేతల అవినీతితో, నేతల పిల్లల సంపద ప్రదర్శన, ప్రజా నిధుల దుర్వినియోగంతో విసిగిపోయిన యువత..
3 దేశాల్లో ప్రభుత్వాలనే కూల్చేసిన యువశక్తి
కొత్త ఏడాదిలో మరో 6 దేశాల్లో నిరసనలు?
చూస్తూచూస్తుండగానే ఏడాది గడిచిపోయింది! 2025లో ప్రపంచవ్యాప్తంగా కనిపించిన ఒక ముఖ్యమైన ట్రెండ్ ఏమిటంటే.. ‘జెన్-జీ’ జోరు! ‘ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు’ అని ఎదురుచూడకుండా వ్యవస్థలో లోపాలపై గళమెత్తిన యువతరం కొన్ని దేశాల్లో ప్రభుత్వాలనే మార్చేయగలిగింది! కెన్యా, ఇండోనేసియా, మెక్సికో, పెరు, బల్గేరియా, నేపాల్, మొరాకో.. ఇలా చాలా దేశాల్లో కుర్రాళ్లు ఈ ఏడాది నిరసనల బాట పట్టారు. యువత దెబ్బకు నేపాల్, మడగాస్కర్, బల్గేరియా దేశాల్లో ప్రభుత్వాలే మారిపోయాయి!
నేపాల్
ప్రపంచంలోని ఏకైక హిందూ దేశమైన నేపాల్‌లో నేతల అవినీతితో, నేతల పిల్లల సంపద ప్రదర్శన, ప్రజా నిధుల దుర్వినియోగంతో విసిగిపోయిన యువత.. తమ ఆక్రోశాన్ని వెలిబుచ్చడానికి ఉన్న ఏకైక మార్గమైన సోషల్ మీడియాను ప్రభుత్వం నిషేధించడంతో రగిలిపోయింది. యువతీ యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. జెన్-జీ ఆగ్రహావేశాలకు తలొగ్గిన కేపీ శర్మ ఒలి సెప్టెంబరు 9న రాజీనామా చేశారు. ఆ తర్వాత మూడురోజులకు.. యువత కోరిన సుశీల కార్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తమ పంతం నెరవేరడంతో యువత పట్టిన పట్టు విడిచారు. అయితే.. ఈ నిరసనల్లో 12 ఏళ్ల చిన్నారి సహా 76 మందిపౌరులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల తుపాకీ తూటాలకే 34 మంది నిరసనకారులు బలయ్యారు.
మడగాస్కర్
నిరుపేదలు ఎక్కువగా ఉండే దేశమైన మడగాస్కర్‌లో.. కరెంటు, నీటి సరఫరా లోపాలతో విసుగెత్తిపోయిన యువత ఆ దేశ రాజధానిలో మొదలుపెట్టిన నిరసనలు.. దేశం మొత్తానికీ పాకాయి. 2025 సెప్టెంబరు నుంచి అక్టోబరు దాకా హైప్రొఫైల్ రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని వారు తెలిపిన నిరసనల దెబ్బకు మడగాస్కర్ ప్రెసిడెంట్ ఆండ్రీ రాజొలినా.. తొలుత ఆ దేశ ఇంధన మంతిన్రి తొలగించారు. అయినా నిరసనలు ఆగకపోవడంతో.. ప్రధాని క్రిస్టియన్ ఎన్‌సై నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసి సైనిక జనరల్ రుఫిన్ జఫిసాంబోను కొత్త ప్రధానిగా నియమించారు. అయితే.. దురదృష్టవశాత్తూ ఈ నిరసనల్లో 22 మంది సామాన్యపౌరులు ప్రాణాలు కోల్పోవడం విషాదం.
బల్గేరియా
యూరప్ ఖండంలో జెన్-జీ ఆగ్రహ జ్వాలలతో వణికిన తొలి దేశం బల్గేరియా. నాయకుల తీరుతో అప్పటికే విసిగిపోయి ఉన్న యువత.. ఈ ఏడాది డిసెంబరు 1న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పన్నుల పెంపు, పింఛను, సామాజిక భద్రత పథకాలకు ప్రజలు చెల్లించాల్సిన మొత్తాన్ని పెంచడంతో వీధుల్లోకి పోటెత్తారు. వారి దెబ్బకు భయపడ్డ సర్కారు బడ్జెట్‌ను ఉపసంహరించుకుంది. కానీ.. యువత ఆగ్రహావేశాలు చల్లారలేదు. ఈ ప్రభుత్వం తమకు వద్దని.. కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నిరసనలు ఉధృతం చేశారు. దేశ రాజధానిలో 50 వేల మంది యువతీయువకులు అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు. నిరసన సెగలు దేశం మొత్తానికీ పాకడంతో.. డిసెంబరు 11న బల్గేరియా ప్రధాని జెల్యాజ్‌కోవ్ రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది.
ఇతర దేశాల్లో..
విద్య, ఆరోగ్యం, ప్రజాసేవలకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్‌లో కోతలు పెట్టడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేసియాలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఆ నిరసనలు కొనసాగుతుండగానే.. ఈ ఏడాది మార్చిలో అక్కడి ప్రభుత్వం ‘ఇండోనేసియన్ నేషనల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ లా’ను సైన్యానికి అనుకూలంగా మార్చడంతో మరోసారి ప్రజాగ్రహం భగ్గుమంది. భూమి, భవనాలపై పన్నులను ఒకేసారి ఏకంగా 250 శాతం మేర పెంచేయడంతో ఆగస్టులో మూడోసారి నిరసన జ్వాలలు పెల్లుబికాయి. దాదాపు లక్షమంది జకార్తాలోని పార్లమెంటు భవనానికి చేరుకుని నిరసన తెలిపారు. చట్టసభల సభ్యులకు ఇస్తున్న జీతభత్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇలా దశలవారీగా అక్కడ యువత నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక మెక్సికోలో.. మాదకద్రవ్యాల సంబంధిత హింస పెచ్చరిల్లుతుంటే.. ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్‌బామ్ పట్టించుకోవట్లేదన్న ఆగ్రహం ప్రజల్లో చాలాకాలంగా గూడుకట్టుకుని ఉంది. ఈ క్రమంలోనే.. ఉరువాపన్ మేయర్ కార్లోస్ మాంజో హత్యకు గురికావడంతో ప్రజాగ్రహం నిరసనల రూపంలో వెల్లువెత్తింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. కాకపోతే, స్పష్టమైన లక్ష్యమేదీ లేకపోవడంతో వారి నిరసనలు ఇటీవలికాలంలో ఒకింత చల్లారాయి. మొరాకోలో సైతం.. ఉచిత విద్య, వైద్యం కోసం ‘జెన్-జీ212’, ‘మొరాకన్ యూత్ వాయిస్’ పేరుతో యువత నిరసనలకు దిగారు. ప్రజల విద్య, వైద్యానికి ఖర్చు చేయకుండా.. 2030లో జరిగే ఫిఫా వరల్డ్ కప్ కోసం ప్రభుత్వం అధికంగా ఖర్చు చేయడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
యుద్ధాలు.. ఘర్షణలు.. అంతర్యుద్ధాలు..
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నడుమ తీవ్ర ఉద్రిక్తతలు, సరిహద్దుల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మరికొన్ని దేశాలు జాతి విద్వేషాలు, అంతర్యుద్ధాలతో అట్టుడికాయి. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో మన దేశం పాక్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఏడాది మేలో ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సంగతి తెలిసిందే. దానికి ప్రతిగా పాకిస్థాన్.. ‘ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్’ పేరుతో ప్రతిదాడికి ప్రయత్నించింది. కానీ, మన వద్ద ఉన్న ఎస్400 రక్షణ వ్యవస్థ సాయంతో సమర్థంగా తిప్పికొట్టగలిగాం. అయితే, భారత్-పాక్ రెండూ అణుసామర్థ్యం ఉన్న దేశాలు కావడంతో.. ఈ ఘర్షణ ఎక్కడ అణు యుద్ధానికి దారితీస్తుందోనని చాలా మంది భయపడ్డారు. కానీ, భారత్ కేవలం ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, దాడులు జరిపి ఆ తర్వాత సంయమనం పాటించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత అక్టోబరులో.. తమకు తలనొప్పిగా మారిన ‘తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)’పై కోపంతో.. పాకిస్థాన్ అఫ్గానిస్థాన్‌లోని కాబూల్, పక్తికా ప్రావిన్సుల్లో గగనతలదాడులు చేసింది. భారత్‌లాగానే పాక్ కూడా ఆయా ప్రాంతాల్లోని టీటీపీ నేతలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్టు ప్రకటించింది. పాక్ దాడులకు ప్రతిగా అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబాన్ల సైన్యం ‘ఇస్లామిక్ నేషనల్ ఆర్మీ’ ప్రతిదాడులు జరిపింది. ఇక.. దశాబ్దాలుగా ఉప్పూనిప్పుగా ఉన్న ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఈ ఏడాది 12 రోజులపాటు యుద్ధం జరిగింది. అలాగే లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య శతాబ్దకాలంగా నలుగుతున్న సరిహద్దు వివాదం కూడా ఈ ఏడాది ఘర్షణకు దారి తీయడం గమనార్హం. ఇక.. 2022 ఫిబ్రవరి 24న మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఈ ఏడాది కూడా కొనసాగింది. 2023లో సూడాన్‌లో మొదలైన అంతర్గత సంక్షోభం ఈ ఏడాది అంతర్యుద్ధంగా మారింది. అధికారం కోసం రెండు మిలటరీ ఫ్యాక్షన్లు (సూడానీస్ ఆర్మ్‌డ్ ఫోర్సె్‌స-ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్) మధ్య జరుగుతున్న పోరులో ప్రజలు బలైపోతున్నారు.
విపరీతమైన వేడి.. తట్టుకోలేనంత చలి.. కుండపోత బీభత్సం
ఎండాకాలంలో నెత్తి మాడిపోయేంత వేడి! చలికాలంలో భరించలేనంత చలి! వర్షాకాలంలో ఊళ్లు మునిగిపోయేంత కుండపోత వానలు!! 2025 వాతావరణం గురించి మూడు ముక్కల్లో చెప్పుకోవాలంటే ఇంతే!! అత్యధిక ఉష్ణోగ్రతకు సంబంధించి 2024లో నమోదైన రికార్డు (1850 నాటి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2.63 డిగ్రీల అధికం)ను అధిగమించకపోయినప్పటికీ.. 2025ను కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో ఒకటిగా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 100 మందికిపైగా మరణించడానికి కారణమైన, ఒక ప్రాంత జనాభాలో అత్యధికులను ప్రభావితం చేసే విపత్తులను ‘విపరీత వాతావరణ ఘటనలు’గా పేర్కొంటారు. అలాంటివి ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 157 సంభవించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2025లో యూర్‌పదేశాల్లో జూన్-ఆగస్టు నెలల మధ్య వడగాడ్పుల వల్ల 24 వేల మందికి పైగా మరణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు!! మనదేశం విషయానికే వస్తే.. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు నడుమ 334 రోజులకుగాను 331 రోజుల్లో ఎక్కడో ఒకచోట ఏదో ఒక విపత్తు (వడగాడ్పులు, వరదలు, తుఫాన్లు) సంభవించింది. వీటివల్ల 4,419 మంది చనిపోగా.. 17.4 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం సంభవించింది.





