Share News

India IT Outsourcing: అమెరికా ఒక్కటే దిక్కు కాదు

ABN , Publish Date - Sep 08 , 2025 | 03:52 AM

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరతల కారణంగా, నానాటికీ పెరుగుతున్న ఏఐ వినియోగం, ఆటోమేషన్‌ వల్ల ఇప్పటికే పలు సవాళ్లు ఎదుర్కొంటున్న భారత ఐటీ రంగం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాల రంకెలతో తీవ్ర ఆందోళనకు గురవుతోంది!

India IT Outsourcing: అమెరికా ఒక్కటే దిక్కు కాదు

  • జపాన్‌, పశ్చిమాసియా, యూరప్‌, ఆఫ్రికాల్లో ఐటీ సేవలకు పెరుగుతున్న గిరాకీ

  • వాటిపై దృష్టి సారించాలంటున్న నిపుణులు.. ఇప్పటికే పలు దేశాలతో భారత్‌ చర్చలు

  • మన ఐటీ ఔట్‌సోర్సింగ్‌పై అమెరికా ఆంక్షల రంకెలు రాజకీయ సందేశం కావొచ్చు

  • ఆ దేశం భారత ఐటీ ప్రతిభపై ఎక్కువగా ఆధారపడి ఉంది: నిపుణులు

ఆంధ్రజ్యోతి డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరతల కారణంగా, నానాటికీ పెరుగుతున్న ఏఐ వినియోగం, ఆటోమేషన్‌ వల్ల ఇప్పటికే పలు సవాళ్లు ఎదుర్కొంటున్న భారత ఐటీ రంగం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాల రంకెలతో తీవ్ర ఆందోళనకు గురవుతోంది! భారతీయ ఉత్పత్తులపై సుంకాలు విధించినా ఇండియా బెదరకపోవడంతో ట్రంప్‌ భారత ఐటీ ఎగుమతులపై సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నారని.. ఐటీ ఔట్‌సోర్సింగ్‌ను అడ్డుకునే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారని వస్తున్న వార్తలు ఐటీ ఉద్యోగులను భయపెడుతున్నాయి. భారత ఐటీ కంపెనీలను అడ్డుకునేందుకు ట్రంప్‌ వీసా నిబంధనలను కఠినతరం చేయడం వంటి నిర్ణయాలు తీసుకుంటే నిర్వహణ ఖర్చులు పెరిగి.. కంపెనీలు స్థానికులనే తీసుకోవడానికి మొగ్గుచూపుతాయని, ఇక్కణ్నంచీ ఉద్యోగులను అక్కడకు పంపవని.. ఫలితంగా ఇక్కడ నియామకాలు తగ్గుతాయని ఇండస్ట్రీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారతదేశ ఐటీ ఔట్‌సోర్సింగ్‌ సేవల విలువ దాదాపు 283 బిలియన్‌ డాలర్లు. అంటే దాదాపుగా 24 లక్షల కోట్ల రూపాయలు. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌, విప్రో వంటి కంపెనీల వాటా ఇందులో అత్యధికం. ఆయా ఐటీ కంపెనీల ఆదాయంలో సింహభాగం (60 శాతానికి పైగా) అమెరికా నుంచే వస్తుంది. కానీ, ఆయా కంపెనీల్లో ఎక్కువ మంది సిబ్బంది భారత్‌లోనే ఉంటారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తీసుకునే ఎలాంటి దుందుడుకు నిర్ణయమైనా ఆయా కంపెనీలపై, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ‘‘ఈ కంపెనీలన్నీ అమెరికాలో గణనీయంగా పన్నులు చెల్లిస్తున్నాయి. వాటి సేవల ఎగుమతులపై సుంకాలు విధించడమంటే రెట్టింపు పన్ను విధించినట్టే. ఇది భారత్‌ ఆధారిత సర్వీస్‌ ప్రొవైడర్ల వృద్ధికి చేటు చేస్తుంది’’ అని ఎవరెస్ట్‌ గ్రూప్‌ (అమెరికా బేస్డ్‌ టెక్నాలజీ కన్సల్టెన్సీ/ఎనలిస్ట్‌ సంస్థ) భాగస్వామి యుగళ్‌ జోషి అన్నారు.


దేశీయ డిమాండ్‌పై దృష్టి..

దేశంలో 56.7 లక్షల మంది ఉద్యోగులతో ఐటీ సేవల రంగం ఎగుమతి ఆదాయానికి కీలకంగా తోడ్పడుతోంది. అయితే, ఈ రంగం ఎక్కువగా విదేశీ మార్కెట్‌పై.. మరీ ముఖ్యంగా అమెరికాపై ఆధారపడి ఉంది. అమెరికా భారత ఐటీ సేవలపై ఆంక్షలు విధిస్తే.. ఈ రంగం అనుసరించే ‘ఆఫ్‌షోర్‌ డెలివరీ మోడల్‌ (అంటే ఇక్కణ్నుంచే అమెరికన్లకు సేవలందించే విధానం)’పై ఒత్తిడి భారీగా పెరుగుతుంది. ఐటీ సేవలకు దేశీయంగా గిరాకీ పెంచే అవకాశాలున్నాయా? అంటే.. యూపీఐ, ఆధార్‌, డిజిటల్‌ ఇండియా, స్మార్ట్‌ సిటీస్‌ తదితర ప్రాజెక్టుల వల్ల ఇప్పటికే దేశీయంగా ఐటీ సేవల అవసరం భారీగా పెరిగిందని ఐటీ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమెరికా, ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవచ్చని వారు పేర్కొంటున్నారు.


ఇతర మార్కెట్లపైనా..

దేశీయ డిమాండ్‌ను పెంచుకోవడంతోపాటు.. అమెరికాకు బదులుగా యూరప్‌, ఆసియా-పసిఫిక్‌, పశ్చిమాసియా, ఆఫ్రికా మార్కెట్లపై దృష్టి సారించాలని.. ఆయా దేశాలకు ఐటీ ఎగుమతులను, ఔట్‌సోర్సింగ్‌ సేవలను పెంచే అవకాశాలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు.. యూర్‌పలో ఇటీవలికాలంలో ఐటీసేవలకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో వంటి సంస్థ యూర్‌పలోని పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక.. జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ లాంటి దేశాల్లో ఆటోమొబైల్‌, తయారీ పరిశ్రమలు ఎక్కువ. వాటికి అవసరమైన ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఆటోమేషన్‌, సరఫరా చైన్ల నిర్వహణకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ఇప్పటికే భారత కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయి. అటు జపాన్‌లో.. వృద్ధుల జనాభా ఎక్కువ కావడం వల్ల ఐటీ ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉంది. యూఏఈ, సౌదీ.. ‘విజన్‌ 2030’ కింద భారీగా స్మార్ట్‌సిటీలు, ఈ-గవర్నెన్స్‌, క్లౌడ్‌, కృత్రిమ మేధ మీద పెట్టుబడులు పెడుతున్నాయి. ఆయా దేశాల్లో తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున ఐటీ సేవలు అందించగల సత్తా మన ఐటీకి ఉంది. ఈ నేపథ్యంలోనే.. భారత ప్రభుత్వం ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ తెలిపారు.

- సెంట్రల్‌ డెస్క్‌


అమెరికాకు అంత వీజీ కాదు..

భారత్‌ ఐటీ ఔట్‌సోర్సింగ్‌పై ఆంక్షలకు సంబంధించి జరుగుతున్న ఈ చర్చ అంతా విధానపరమైన నిర్ణయాలకు సంబంధించింది కాకపోవచ్చని, కేవలం రాజకీయ సందేశం (అమెరికా ప్రజలను, ఓటర్లను ఆకర్షించడానికి) అయి ఉండొచ్చని హెచ్‌ఎఫ్ఎస్‌గ్రూప్ సీఈవో, చీఫ్‌ అనలిస్ట్‌ ఫిల్‌ ఫెర్ష్త్‌ వంటివారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ చర్చ నిజమై అయ్యి.. ఆంక్షలు విధించాలనుకుంటే అది వస్తువులపై సుంకాలు విధించినంత సులభం కాబోదని, అది చాలా సంక్లిష్టమైన అంశమని ఫిల్‌ పేర్కొన్నారు. ‘‘ఎందుకంటే.. అమెరికా తన టెక్నాలజీ ఆర్థికవ్యవస్థను కాంపిటీటివ్‌గా ఉంచుకోవడానికి భారత్‌ ఐటీ, ఇంజినీరింగ్‌ ప్రతిభపై అమెరికా చాలా ఎక్కువగా ఆధారపడింది’’ అని ఆయన విశ్లేషించారు. అమెరికాకు చెందిన పలువురు టెక్‌ బిలియనీర్ల ప్రభావం ట్రంప్‌ యంత్రాంగంపై ఎక్కువగా ఉందని.. వారిలో అత్యధికులు భారత్‌ అనుకూలురేనని గుర్తుచేశారు.

Updated Date - Sep 08 , 2025 | 03:58 AM