Share News

Elon Musk Reveals Partner: నా సహచరికి భారతీయ మూలాలు

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:39 AM

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ తన సహచరి శివోన్‌ జిలిస్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన సహజీవన భాగస్వామి శివోన్‌కు...

Elon Musk Reveals Partner: నా సహచరికి భారతీయ మూలాలు

  • కుమారుడి పేరులో ‘శేఖర్‌’: మస్క్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 1: ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ తన సహచరి శివోన్‌ జిలిస్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన సహజీవన భాగస్వామి శివోన్‌కు భారతీయ మూలాలు ఉన్నాయని చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ పాడ్‌కాస్ట్‌ ‘‘డబ్ల్యూటీఎఫ్‌ ఈస్‌?’’లో తన వ్యక్తిగత జీవితం గురించి మస్క్‌ మాట్లాడారు. శివోన్‌ బాల్యం కెనడాలో గడిచిందని, అక్కడే ఆమె పెరిగారని చెప్పారు. తమకు కలిగిన ఓ కుమారుడి పేరులో నోబెల్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆస్ట్రోఫిజిక్స్‌ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ గౌరవార్థం ఆయన పేరులో ‘శేఖర్‌’ను కలిపినట్లు తెలిపారు. శివోన్‌ గురించి పోడ్‌కా్‌స్టలో అడిగినప్పుడు మస్క్‌ స్పందిస్తూ.. ‘‘బాల్యంలోనే ఆమెను దత్తతకు ఇచ్చారు. కెనడాలో పెరిగింది. మిగతా వివరాలు పెద్దగా తెలియవు’’ అని చెప్పారు. అలాగే కష్టపడే భారతీయులు, వారి ప్రతిభతో అమెరికా అత్యంత లాభపడిందని చెప్పారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారుతోందన్నారు.

ఎవరు ఈ శివోన్‌..?

శివోన్‌ తల్లి పంజాబ్‌కు చెందిన హిందూ మహిళ. తండ్రి కెనడాకు చెందిన శ్వేతజాతీయుడు. యేల్‌ యూనివర్సిటీలో ఆర్ట్స్‌, ఎకనామిక్స్‌, ఫిలాసఫీలో శివోన్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 2017లో మస్క్‌ సంస్థ న్యూరాలింక్‌లో చేరారు. ప్రస్తుతం ఆ సంస్థ ఆపరేషన్స్‌, స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మస్క్‌ సహచరిగా ఆమెకు కలిగిన నలుగురు సంతానంలో కవలలు స్ట్రైడర్‌, అజ్యూర్‌, కుమార్తె అర్కాడియా, మరో కుమారుడు సెల్డన్‌ ఉన్నారు. వీరిలో ఓ కుమారుడి పేరు మధ్యలో శేఖర్‌ అని కలిపారు.

Updated Date - Dec 02 , 2025 | 04:39 AM