Share News

Trump Speech: ట్రంప్‌ ఆణిముత్యాలు

ABN , Publish Date - Jun 27 , 2025 | 04:08 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాచాలత్వమే వేరు. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా ఆయన చెప్పాలనుకున్నది చెబుతారు. కాదని ఖండించినా చెబుతూనే ఉంటారు. వివిధ దేశాల ప్రధాన మంత్రులు, అధ్యక్షుల స్థాయి వాళ్లపై...

 Trump Speech: ట్రంప్‌ ఆణిముత్యాలు

  • వరుసగా విభిన్న వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు

న్యూఢిల్లీ, జూన్‌ 26: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాచాలత్వమే వేరు. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా ఆయన చెప్పాలనుకున్నది చెబుతారు. కాదని ఖండించినా చెబుతూనే ఉంటారు. వివిధ దేశాల ప్రధాన మంత్రులు, అధ్యక్షుల స్థాయి వాళ్లపై అప్పుడే ప్రశంసలు కురిపిస్తుంటారు, ఉన్నట్టుండి వ్యతిరేక వ్యాఖ్యలూ చేస్తుంటారు. అలా బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ఒక్కరోజులోనే ట్రంప్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలివి..

ఇరాన్‌ క్షిపణులు అద్భుతం!

‘‘ఇజ్రాయెల్‌కు చాలా గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా చివరి రెండు రోజుల్లో దెబ్బతిన్నది. ఆ (ఇరాన్‌) బాలిస్టిక్‌ క్షిపణులు చాలా భవనాలను ధ్వంసం చేశాయి. అవి అద్భుతంగా పనిచేశాయి’’.. ఇరాన్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌కు నష్టం ఎక్కువే జరిగిందంటూ..

అవినీతిపై విచారణ వద్దు

‘‘ఇరాన్‌ను అణచివేసి ఇజ్రాయెల్‌ చరిత్రలోనే గొప్ప ఘట్టానికి నేతృత్వం వహించిన ప్రధాని నెతన్యాహును అవినీతి ఆరోపణలపై విచారించడం దారుణం. ఈ విషయం నన్ను షాక్‌కు గురిచేసింది. దేశానికి ఎంతో చేసిన గొప్ప హీరో అయిన ఆయనపై వెంటనే అవినీతి విచారణను నిలిపివేయాలి. లేదా క్షమాభిక్ష పెట్టాలి..’’ ఈ నెల 30న నెతన్యాహు అవినీతి కేసులపై విచారణ జరగనున్న నేపథ్యంలో..

భారత్‌-పాక్‌ యుద్ధంపై పాత పాట..

‘‘భారత్‌, పాక్‌లతో మాట్లాడాను. చూడండి మీరు ఇలా యుద్ధం చేసుకుంటుంటే పరిస్థితి చెడుగా మారుతుందని, అలాగైతే అమెరికా ఎలాంటి వాణిజ్యం చేయబోదని చెప్పాను. దాంతో లేదు లేదు.. మాకు వాణిజ్య ఒప్పందం కావాలని వాళ్లు చెప్పారు. మేం అణు యుద్ధాన్ని నివారించాం’’.. భారత్‌-పాక్‌ యుద్ధాన్ని తానే ఆపానంటూ..


ముస్లిం డెమోక్రాట్‌పై వాచాలత్వం..

‘‘అనుకున్నంతా అయింది. డెమోక్రాట్లు గీత దాటారు. జోహ్రాన్‌ మమ్దానీ ఓ కమ్యూనిస్టు పిచ్చివాడు. న్యూయార్క్‌ నగర మేయర్‌ అయ్యే దిశగా వెళుతున్నాడు. ఇంతకుముందు రాడికల్‌ వామపక్షవాదులను చూశాం. కానీ ఇతను మరీ దారుణంగా ఉన్నాడు. అతడి గొంతు ఘోరంగా ఉంది. అంత తెలివైనవాడిలా కూడా కనిపించడం లేదు’’.. న్యూయార్క్‌ మేయర్‌ పదవి కోసం డెమోక్రాట్ల ప్రైమరీలు గెలిచిన నాయకుడిని తూలనాడుతూ.. (జోహ్రాన్‌ మమ్దానీ తల్లి మన కేరళకు చెందిన నాయర్‌, తండ్రి ఉగాండా ముస్లిం)

పుతిన్‌ చెబితే వినే రకం కాదు..

‘‘రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం మిగతా వాటిలా కాదు. చాలా క్లిష్టమైనది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చెబితే వినే రకం కాదు. ఆయనను తప్పుదోవ పట్టించారు. ఈ యుద్ధం ఆయనకు తలనొప్పిగా మారింది. దీన్నుంచి బయటపడాలని అనుకుంటున్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ నాకు సమస్యలు ఉన్నాయి’’.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని కూడా ఆపుతారా అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా..

మొస్సాద్‌ ఏజెంట్లు చూసివచ్చారు..

‘‘ఇరాన్‌ ఫర్దో అణుశుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. అమెరికా బాంబులు వేసిన తర్వాత ఇజ్రాయెల్‌ మొస్సాద్‌ ఏజెంట్లు అక్కడికి వెళ్లి పరిశీలించారు. మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని వారు చెప్పారు’’.. ఇరాన్‌ అణుశుద్ధి కేంద్రాలు పూర్తిగా ధ్వంసం కాలేదన్న నిఘా వర్గాల వార్తలను తప్పుపడుతూ...

Updated Date - Jun 27 , 2025 | 04:09 AM