Share News

Global Oil Trade: ట్రంప్‌ చెప్పినట్లే..

ABN , Publish Date - Oct 29 , 2025 | 06:00 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్టుగానే రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ తగ్గించుకుంటోందా రష్యా చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షల ప్రభావంతో...

Global Oil Trade: ట్రంప్‌ చెప్పినట్లే..

  • రష్యా చమురు కొనుగోళ్లు బంద్‌!

  • అమెరికా ఆంక్షలతో నిలిపేసిన భారత రిఫైనరీలు

  • ఇతర దేశాల నుంచి కొనుగోలుకు ఏర్పాట్లు

  • స్పాట్‌ మార్కెట్లో కొనుగోళ్లు చేపట్టిన రిలయన్స్‌!

  • రెండు కంపెనీలపైనే ఆంక్షలు.. ఇతర రష్యా కంపెనీల నుంచి దిగుమతికి ప్రయత్నిస్తామంటున్న రిఫైనరీలు!

  • అమెరికా నుంచి పెరిగిన చమురు దిగుమతులు

న్యూఢిల్లీ, అక్టోబరు 28: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్టుగానే రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్‌ తగ్గించుకుంటోందా? రష్యా చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షల ప్రభావంతో భారత రిఫైనరీలు ఇతర దేశాల నుంచి చమురు కొనుగోళ్లు చేపట్టక తప్పడం లేదా? ఇదే సమయంలో అమెరికా నుంచి భారత్‌కు భారీగా చమురు దిగుమతులు పెరిగాయా?.. ఈ ప్రశ్నలన్నింటికీ భారత రిఫైనరీ, పెట్రోలియం సంస్థలు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ఇటీవల ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు రష్యాకు చెందిన భారీ చమురు సంస్థలు ల్యూకోయిల్‌, రాస్‌నె్‌ఫ్టలపైనా ఆర్థిక ఆంక్షలు విధించారు. అటు యూరోపియన్‌ యూనియన్‌ కూడా పలు ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయక తప్పడం లేదని పెట్రోలియం మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ రంగం సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఇప్పటికే బహిరంగ మార్కెట్‌ నుంచి చమురు కొనుగోలు కోసం టెండర్‌ నోటీసు జారీ చేసిందని గుర్తు చేశాయి. మూడేళ్లుగా రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న రిలయన్స్‌ కూడా.. స్పాట్‌ మార్కెట్లో చమురు కొనుగోళ్లు చేపట్టిందని వెల్లడించాయి. అటు రష్యా సరఫరాదారుల నుంచి, ఇటు భారత ప్రభుత్వం నుంచి ఈ అంశంలో స్పష్టత వచ్చే వరకు కొత్తగా చమురు కొనుగోళ్లకు ఆర్డర్లు పెట్టే పరిస్థితి లేదని తెలిపాయి.


ఆంక్షలు వర్తించని కంపెనీల నుంచి కొనే యత్నాలు..

అయితే రష్యా చమురుపై టోకున ఆంక్షలు విధించలేదని, కేవలం రెండు పెద్ద కంపెనీలపైనే విధించిందని భారత రిఫైనరీ వర్గాలు అంటున్నాయి. అందువల్ల ఆంక్షలు వర్తించని ఇతర రష్యా కంపెనీల నుంచి చమురు కొనుగోళ్లకు ప్రయత్నిస్తామని పేర్కొంటున్నాయి. అంతేగాకుండా రష్యా నుంచి కొని ఇతర దేశాలకు సరఫరా చేసే యూరోపియన్‌, గల్ఫ్‌ దేశాల కంపెనీల నుంచీ చమురు కొనుగోలు చేయవచ్చని.. కానీ రష్యా నుంచి నేరుగా కొనే చమురుకు వస్తున్న రాయితీ లభించకపోవచ్చని స్పష్టం చేస్తున్నాయి. నిజానికి రష్యా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న చమురులో 70శాతం వరకు రాస్‌నెఫ్ట్‌, ల్యూకోయిల్‌ సంస్థల నుంచే వస్తుండటం గమనార్హం. మిగతా 30శాతం ఇతర రష్యా కంపెనీల నుంచి దిగుమతి అవుతోంది. కాగా, అమెరికా ఆంక్షల నేపథ్యంలో విదేశాల్లో ఉన్న తమ ఆస్తులను విక్రయించేస్తున్నట్టు ల్యూకోయిల్‌ సంస్థ ప్రకటించింది. 11 దేశాల్లో ఉన్న తమ చమురు, గ్యాస్‌ ప్రాజెక్టులపై ఇప్పటికే కొనుగోలు దారులతో చర్చలు ప్రారంభించినట్టు తెలిపింది.


అమెరికా నుంచి భారీగా పెరిగిన చమురు కొనుగోళ్లు..

ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్న మేరకు రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లు నిలిచిపోతుండగా.. మరోవైపు అమెరికా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. చమురు సరఫరా గణాంకాల సంస్థ కెప్లర్‌ డేటా ప్రకారం.. ఈ ఏడాది అక్టోబర్‌ 27 నాటికి అమెరికా నుంచి భారత చమురు దిగుమతులు సగటున రోజుకు 5.4 లక్షల బ్యారెళ్లకు (బీపీడీ) చేరాయి. గత ఏడాది సగటు దిగుమతులు 3 లక్షల బీపీడీ మాత్రమే కావడం గమనార్హం.

Updated Date - Oct 29 , 2025 | 06:03 AM