Confusion Over Imran Khan Whereabouts: ఇమ్రాన్‌ఖాన్ మృతి?
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:11 AM
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారంటూ వదంతులు వ్యాపించడంతో.. ఆయన ఎక్కడున్నారంటూ అడియాలా జైలుపై పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ ...
జైలులో హత్యకు గురయ్యారంటూ పాకిస్థాన్‌లో పెద్ద ఎత్తున ప్రచారం
న్యూఢిల్లీ, నవంబరు 26: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారంటూ వదంతులు వ్యాపించడంతో.. ఆయన ఎక్కడున్నారంటూ అడియాలా జైలుపై పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు, అభిమానులు దాడికి దిగారు. బుధవారం వేలాది మంది జైలు ముందు చేరి ముట్టడించేందుకు యత్నించినట్లు సమాచారం. అవినీతి కేసులో రెండేళ్లుగా ఇమ్రాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అడియాలా జైలులో ఇమ్రాన్ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారంటూ పాక్‌తో పాటు బలూచిస్థాన్, అఫ్గానిస్థాన్‌కు చెందిన అనేక సోషల్ మీడియా ఖాతాలు పేర్కొన్నాయి. దీనికి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఐఎ్‌సఐ కారణమంటూ ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే గత వారం ఇమ్రాన్‌ను చూసేందుకు ఆయన ముగ్గురు చెల్లెలు జైలుకెళ్లగా.. పోలీసులు నిరాకరించి తమపై అమానుషంగా దాడి చేశారంటూవారు ఆందోళనకు దిగారు. ‘ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జైలుకెళ్లగా పోలీసులు నిరాకరించారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేయగా.. వారు పక్కా ప్లాన్‌తో కరెంట్ తీసేసి మాపై దాడి చేశారు. 71 ఏళ్ల వయసున్న నన్ను జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి రోడ్డుపై పడేశారు. దీనిపై దర్యాప్తు జరపాలి’ అని నోరీన్ నియాజీ పంజాబ్ పోలీస్ చీఫ్‌కు సోమవారం లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఆందోళనలు తీవ్రమై తాజాగా జైలును ముట్టడించే వరకు చేరుకున్నాయి. అయితే ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి, ఆయన ఎక్కడున్నారనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఏడాది జూన్ చివరలో కోర్టుకు హాజరైనప్పుడు 73 ఏళ్ల ఇమ్రాన్ చివరిసారి బహిరంగంగా కనిపించారు. ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లోనే చిత్రహింసలు పెట్టి చంపేశారని బలూచిస్థాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఐఎ్‌సఐ, ఆసిమ్ మునీరే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించింది.