China Removes Import Duty: భారత ఔషధాలపై సుంకాలు ఎత్తేసిన చైనా
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:40 AM
అమెరికా సుంకాల బాదుడు నేపథ్యంలో భారత ఫార్మా రంగానికి ఊరటనిచ్చేలా చైనా కీలక ప్రకటన చేసింది. భారత్ నుంచి తమ దేశానికి దిగుమతయ్యే....
30 శాతంగా ఉన్న దిగుమతి సుంకం పూర్తిగా తొలగింపు
అమెరికా నిర్ణయాల వేళ భారత ఫార్మా రంగానికి ఊరట
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: అమెరికా సుంకాల బాదుడు నేపథ్యంలో భారత ఫార్మా రంగానికి ఊరటనిచ్చేలా చైనా కీలక ప్రకటన చేసింది. భారత్ నుంచి తమ దేశానికి దిగుమతయ్యే ఔషధాలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తేసింది. భారత్ నుంచి వచ్చే ఔషధాలపై ఇన్నాళ్లూ 30ు దిగుమతి సుంకాన్ని వసూలు చేసిన చైనా ఇప్పుడు దానిని సున్నా చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో భారత ఫార్మా పరిశ్రమలు ఎలాంటి దిగుమతి సుంకా లు చెల్లించకుండానే తమ ఉత్పత్తులను చైనాకు ఎగుమతి చేసుకోవచ్చు. తమ దేశానికి దిగుమతయ్యే బ్రాండెడ్ ఔషధాలపై 100ు దిగుమతి సుంకం విధిస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో చైనా తీసుకున్న ఈ నిర్ణయం భారత ఫార్మా రంగానికి కొత్త శక్తినిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నిర్ణయంతో భారత ఫార్మా రంగం మరింత విస్తరించనుందని, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ మార్కెట్ రూపరేఖలు మారనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచానికే ఫార్మసీగా పేరొందిన భారత్ నుంచి అందుబాటు ధరల్లో ఉండే జనరిక్ ఔషధాలు, టీకాలు పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుంటాయి. దిగుమతి సుంకాలు అధికంగా ఉండడంతో ఇన్నాళ్లూ భారత ఫార్మా పరిశ్రమలు చైనాలో పరిమిత స్థాయిలో వ్యాపారం చేసేవి. ఇప్పుడు దిగుమతి సుంకాలు పూర్తిగా ఎత్తేయడంతో ప్రపంచంలోని రెండో అతి పెద్ద ఫార్మాస్యూటికల్ మార్కెట్ అయిన చైనాలో భారత పరిశ్రమలు ధర, నాణ్యత అంశాల్లో ఇతరులతో పోటీ పడే అవకాశం ఏర్పడింది. చైనా తీసుకున్న విధానపరమైన నిర్ణయం భారత్, చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో సమతుల్యత తీసుకువస్తుందని, నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఫార్మా పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.