China Military Parade: చైనా విశ్వరూపం
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:11 AM
భారీ అణు బాలిస్టిక్ క్షిపణులు, లేజర్ ఆయుధాలు, అండర్ వాటర్ డ్రోన్లు, ఐదో తరం యుద్ధ విమానాలు.. ఇలా ఒకటేమిటి ప్రపంచం ఎన్నడూ చూడని అత్యాధునిక ఆయుధ సంపత్తితో చైనా విశ్వరూపమే ప్రదర్శించింది.
భారీ అణు క్షిపణులు.. లేజర్ ఆయుధాలు
20 వేల కి.మీ. రేంజ్ ఉన్న మిస్సైల్ డీఎ్‌ఫ-5సీ
భూగోళంపై ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసే సత్తా
అండర్ వాటర్ డ్రోన్లు.. ఐదోతరం జెట్లు
బీజింగ్ మిలిటరీ పరేడ్‌లో ఆయుధ ప్రదర్శన
ప్రత్యేక ఆకర్షణగా ఎల్‌వై-1 లేజర్ ఆయుధం
ఒకేసారి ఐదు మోడళ్ల స్టెల్త్ ఫైటర్ జెట్లు ప్రదర్శన
రాకాసి అణు క్షిపణులు.. లేజర్ ఆయుధాలు, అండర్ వాటర్ డ్రోన్లు.. ఐదోతరం యుద్ధ విమానాలు
బీజింగ్ మిలిటరీ పరేడ్‌లో డ్రాగన్ ఆయుధ బల ప్రదర్శన
బీజింగ్, సెప్టెంబరు 3: భారీ అణు బాలిస్టిక్ క్షిపణులు, లేజర్ ఆయుధాలు, అండర్ వాటర్ డ్రోన్లు, ఐదో తరం యుద్ధ విమానాలు.. ఇలా ఒకటేమిటి ప్రపంచం ఎన్నడూ చూడని అత్యాధునిక ఆయుధ సంపత్తితో చైనా విశ్వరూపమే ప్రదర్శించింది. అమెరికా సుంకాల బెదిరింపుల వేళ.. తన సైనిక బలం ఏమిటో చూపించింది. బీజింగ్‌లో బుధవారం నిర్వహించిన విక్టరీ డే మిలిటరీ పరేడ్‌లో డ్రాగన్ తొలిసారిగా ప్రదర్శించిన రాకాసి అణు క్షిపణి డీఎ్‌ఫ-5సీ సహా.. పలు అత్యాధునిక ఆయుధాలను చూసి ప్రపంచదేశాలు విస్తుపోయాయి. ముఖ్యంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి డీఎఫ్-5సీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ద్రవ ఇంధనంతో నడిచే ఈ భారీ అణు క్షిపణి రేంజి 20,000 కిలోమీటర్లకుపైనే ఉంటుందని అంచనా..! అంటే ఈ మిస్సైల్ భూగోళంపై ఎక్కడి లక్ష్యాన్నైనా ఛేదించగలదు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దురాక్రమణపై విజయం సాధించి 80 ఏళ్లవుతున్న సందర్భంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) కవాతులో చైనా ఈ ఆయుధ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఇందులో తొలిసారిగా అధునాతన యుద్ధ విమానాలు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, ఎలాట్రానిక్ యుద్ధ సామగ్రిని ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సహా 26 దేశాల నేతలు హాజరయ్యారు. చైనాలో భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్, పాకిస్థాన్ ప్రధాని షరీఫ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు కూడా పాల్గొన్నారు. ఈ పరేడ్‌ను 50వేల మంది ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించారు.

మిస్సైళ్లలో బాహుబలి డీఎఫ్-5సీ
చైనా ఆయుధ ప్రదర్శనలో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది డీఎఫ్-5సీ. ఇదొక బాహుబలి మిస్సైల్. దీన్ని ఒక్క వాహనంపై తరలించడం సాధ్యంకాదు. మూడు భాగాలుగా తరలించి.. ఆ తర్వాత అసెంబ్లింగ్ చేసి ప్రయోగిస్తారు. ఇది ధ్వని వేగం కంటే 10 రెట్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో ఎంఐఆర్‌వీ వ్యవస్థను వినియోగించారు. ఇది ఒకేసారి పలు అణు, సంప్రదాయ వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. ఏకకాలంలో పది వేర్వేరు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడిచేయగలదు. ఈ పరేడ్‌లో డీఎఫ్-5సీ క్షిపణులతోపాటు ఎల్‌వై-1 అనే సరికొత్త లేజర్ ఆయుధం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎనిమిది చక్రాల సాయుధ ట్రక్ హెచ్‌జడ్-155పై అమర్చిన ఈ లేజర్ ఆయుధం.. శత్రు ఆయుధాల్లోని ఆప్టికల్ సెన్సర్లను సమర్థంగా దెబ్బతీయగలదు. సముద్ర యుద్ధ నిబంధనలను ఇది కచ్చితంగా మార్చగలదని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. లేజర్ యుద్ధాన్ని కొత్త సైనిక రంగంగా వారు పరిగణిస్తున్నారు.
చైనా పరేడ్‌లో డాంగ్‌ఫెంగ్-61 ఖండాంతర క్షిపణిని కూడా ప్రదర్శించింది. దీని రేంజ్ 12వేల కిలోమీటర్లు. డీఎఫ్-41కు ఇది అడ్వాన్స్‌డ్ వెర్షన్.
చైనా తొలిసారిగా ఐదో తరం యుద్ధ విమానాలను ప్రదర్శించింది. వైమానిక దళం కోసం రూపొందించిన జే-20, జే-20ఏ, జే-20ఎస్, జే-35ఏతోపాటు నేవీ కోసం జే-35 అనే ఐదు మోడళ్లను పరిచయం చేసింది. ఒక పరేడ్‌లో ఐదు మోడళ్ల అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లు కనిపించడం ప్రపంచంలో ఇదే తొలిసారని చైనా డైలీ తెలిపింది.
మనిషి 150 ఏళ్లు బతకొచ్చు..!
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్.. అవయవ మార్పిడి, మనిషి దీర్ఘాయుష్షు గురించి మాట్లాడుకున్నారు. బీజింగ్‌లో జరిగిన సైనిక కవాతు సందర్భంగా జిన్‌పింగ్, పుతిన్ కలిసి నడుస్తూ మాట్లాడుకున్న ఈ మాటలు మైక్‌లో రికార్డయ్యాయి. ‘‘బయోటెక్నాలజీ రంగం అభివృద్ధి చెందుతోంది. మానవ అవయవాలను మార్పిడి చేయవచ్చు. మీరు ఎంత ఎక్కువకాలం జీవిస్తే.. అంత చిన్నవారు అవుతారు. అమరత్వాన్ని కూడా సాధించగలరు’’ అని పుతిన్ అనువాదకుడు చైనీస్ భాషలో చెప్పడం మైక్‌లో వినిపించింది. జిన్‌పింగ్ స్పందిస్తూ.. ‘‘ఈ శతాబ్దంలో మానవులు 150 సంవత్సరాల వరకు జీవించవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు’’ అని చెప్పడం వినిపించింది.