Share News

China Railway Project: ఎల్‌ఏసీ సమీపం నుంచి చైనా భారీ రైల్వే లైన్‌

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:04 AM

భారత్‌తో సరిహద్దులకు సమీపంలో భారీ రైల్వే మార్గం నిర్మాణానికి చైనా సిద్ధమైంది. జింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని.....

China Railway Project: ఎల్‌ఏసీ సమీపం నుంచి చైనా భారీ రైల్వే లైన్‌

  • జింజియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి టిబెట్‌ను అనుసంధానించేలా..

  • ఉద్రిక్త పరిస్థితులేవైనా ఏర్పడితే.. రక్షణపరంగా భారత్‌కు తలనొప్పే!

  • వేగంగా సైన్యాన్ని, ఆయుధాలను తరలించేందుకు చైనాకు అవకాశం

బీజింగ్‌, ఆగస్టు 11: భారత్‌తో సరిహద్దులకు సమీపంలో భారీ రైల్వే మార్గం నిర్మాణానికి చైనా సిద్ధమైంది. జింజియాంగ్‌ ప్రావిన్స్‌లోని హోటన్‌ నుంచి టిబెట్‌లోని లాసాకు నిర్మిస్తున్న ఈ రైల్వే మార్గంలో కొంత భాగం వాస్తవాధీన రేఖ (లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌- ఎల్‌ఏసీ)కు బాగా దగ్గరి నుంచే వెళుతుంది. ఈ ఏడాదే ఈ రైల్వే మార్గం పనులు ప్రారంభం కానున్నాయని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తాజా కథనంలో వెల్లడించింది. ఇది రక్షణ పరంగా, వ్యూహాత్మకంగా చైనాకు ప్రయోజనకరమని పేర్కొంది. మొత్తంగా టిబెట్‌ను చైనాలోని కీలక ప్రాంతాలకు అనుసంధానించేందుకు.. సుమారు రూ.4 లక్షల కోట్ల (45 బిలియన్‌ డాలర్లు) వ్యయంతో 5 వేల కిలోమీటర్ల పొడవునా చైనా చేపట్టిన నాలుగు రైల్వే మార్గాల్లో ఇది ఒకటని తెలిపింది. హిమాలయాల్లోని కారకోరం, కైలాష్‌, కున్‌లున్‌ పర్వత శ్రేణుల మీదుగా ఈ మార్గం సాగుతుందని పేర్కొంది.

భారత్‌కు ఆందోళనకరం..

చైనాతో భారత్‌కు సరిహద్దు వివాదాలు ఉన్న నేపథ్యంలో ఆ దేశం చేపడుతున్న ప్రాజెక్టులు ఆందోళన రేపుతున్నాయి. ఇప్పటికే తన ఆక్రమణలో ఉన్న ఆక్సాయ్‌చిన్‌ ప్రాంతం మీదుగా చైనా భారీ హైవేను నిర్మించింది. దానికితోడు ఇప్పుడు ఎల్‌ఏసీకి సమీపం నుంచి రైల్వే మార్గాన్ని చేపడుతోంది. భారత్‌కు రక్షణపరంగా ఇది చికాకుపరిచేదేనని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులేవైనా తలెత్తితే.. ఎల్‌ఏసీ సమీపంలోకి భారీగా, వేగంగా సైన్యాన్ని, ఆయుధ సామగ్రిని తరలించేందుకు చైనాకు ఈ రైల్వే మార్గం ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. మరోవైపు సరిహద్దులకు అతి సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అత్యంత భారీ డ్యామ్‌ నిర్మాణ పనులను చైనా ఇటీవలే ప్రారంభించింది. ఆ డ్యామ్‌ పూర్తయితే భారత్‌పై ‘జల ఖడ్గం’లా మారుతుందనే ఆందోళన నెలకొంది.

Updated Date - Aug 12 , 2025 | 06:04 AM