Car Bomb Blast: పాక్‌లోని క్వెట్టాలో కారుబాంబు పేలుడు
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:45 AM
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నగరంలో సంభవించిన భారీ కారుబాంబు పేలుడులో 14 మంది మరణించారు. 32 మందికి పైగా గాయపడ్డారు...
14 మంది మృతి.. 32 మందికి గాయాలు
క్వెట్టా/పెషావర్, సెప్టెంబరు 30: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నగరంలో సంభవించిన భారీ కారుబాంబు పేలుడులో 14 మంది మరణించారు. 32 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం ఫ్రాంటియర్ కాన్‌స్టాబ్యులరీ (పారామిలిటరీ) దళాల ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ దాడి జరిగింది. పేలుడు అనంతరం కాల్పుల శబ్దం కూడా వినిపించడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, భవనాల కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు, పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ పేలుడుకు సంబంధించి ఇప్పటివరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. మరోవైపు.. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన రెండు వేర్వేరు బాంబు పేలుళ్ల ఘటనల్లో నలుగురు మిలిటెంట్లు సహా తొమ్మిది మంది మరణించారు. అఫ్ఘానిస్థాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న సౌత్ వజీరిస్థాన్ జిల్లాలో మంగళవారం ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.