Share News

BBC Chief Tim Davie: బీబీసీ చీఫ్‌ డేవీ రాజీనామా!

ABN , Publish Date - Nov 11 , 2025 | 02:13 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించేలా ఎడిట్‌ చేశారంటూ విమర్శలు రావడంతో ఏకంగా బీబీసీ హెడ్‌, మరో ఉన్నతాధికారి...

BBC Chief Tim Davie: బీబీసీ చీఫ్‌ డేవీ రాజీనామా!

  • న్యూస్‌ సీఈవో టర్నెస్‌ కూడా..

  • ట్రంప్‌ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించేలా ఎడిట్‌ చేశారన్న ఆరోపణలతోనే

లండన్‌, నవంబరు 10: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించేలా ఎడిట్‌ చేశారంటూ విమర్శలు రావడంతో ఏకంగా బీబీసీ హెడ్‌, మరో ఉన్నతాధికారి రాజీనామా చేశారు. 2021, జనవరి 6న ట్రంప్‌ చేసిన ప్రసంగాన్ని ‘పనోరమ’ పేరిట డాక్యుమెంటరీ ప్రసారం చేశారు. ఇందులో ఆయన ప్రసంగంలోని రెండు వేర్వేరు భాగాలను కలిపి ఎడిట్‌ చేయడంతో 2021 జనవరిలో జరిగిన క్యాపిటల్‌ హిల్‌ అల్లర్లను ట్రంప్‌ ప్రోత్సహించినట్లుగా చూపించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో బీబీసీ డైరెక్టర్‌ జనరల్‌ టిమ్‌ డేవీ, న్యూస్‌ సీఈవో డెబోరా టర్నె్‌సలు రాజీనామా చేశారు. టిమ్‌ డేవీ ఐదేళ్లుగా బీబీసీ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. టిమ్‌ డేవీ తన రాజీనామాను ప్రకటిస్తూ, సిబ్బందికి లేఖ రాశారు. ‘‘మొత్తంగా బీబీసీ చాలా బాగా పనిచేస్తోంది. కానీ, కొన్ని తప్పులు జరిగాయి. డైరెక్టర్‌ జనరల్‌గా వాటికి నాదే బాధ్యత. రాజీనామా పూర్తిగా నా నిర్ణయమే’’ అని పేర్కొన్నారు. రాజీనామాకు ఇదొక్కటే కారణం కాకపోయినప్పటికీ, బీబీసీ న్యూస్‌ చుట్టూ నెలకొన్న వివాదం కూడా తన నిర్ణయంపై ప్రభావం చూపిందని చెప్పారు. ఇక ‘పనోరమా’ వివాదం తానెంతో ఇష్టపడే బీబీసీ సంస్థకు నష్టం కలిగించే దశకు చేరుకుందని టర్నెస్‌ పేర్కొన్నారు. జవాబుదారీగా ఉండాలి కాబట్టే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. బీబీసీ న్యూస్‌ సంస్థాగతంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని టర్నెస్‌ స్పష్టం చేశారు. బీబీసీ డైరెక్టర్‌ జనరల్‌, న్యూస్‌ హెడ్‌ రాజీనామాలను స్వాగతిస్తున్నట్లు ట్రంప్‌ చెప్పారు. ‘‘జనవరి 6న నేను చేసిన మంచి ప్రసంగాన్ని వక్రీకరించి చూపి, దొరికిపోవడంతోనే వారు వైదొలిగారు లేదా వారిని తొలగించారు’’ అని అన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 02:13 AM