Share News

American Airlines: టేకాఫ్‌ అవుతుండగా విమానం టైరు నుంచి మంటలు

ABN , Publish Date - Jul 28 , 2025 | 05:13 AM

అమెరికాలోని డెన్వర్‌ విమానాశ్రయం నుంచి అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి శనివారం టేకాఫ్‌ అవుతుండగా టైరు నుంచి మంటలు రావడంతో రన్‌వేపైనే నిలిచిపోయింది.

American Airlines: టేకాఫ్‌ అవుతుండగా విమానం టైరు నుంచి మంటలు

  • అత్యవసర ద్వారం నుంచి బయటపడిన ప్రయాణికులు, సిబ్బంది

  • అమెరికాలోని డెన్వర్‌లో ఘటన

డెన్వర్‌, జూలై 27 : అమెరికాలోని డెన్వర్‌ విమానాశ్రయం నుంచి అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఒకటి శనివారం టేకాఫ్‌ అవుతుండగా టైరు నుంచి మంటలు రావడంతో రన్‌వేపైనే నిలిచిపోయింది. అందులోని 173 మంది ప్రయాణికులు, సిబ్బంది అత్యవసర ద్వారం నుంచి బయటపడ్డారు. లాండింగ్‌ గేర్‌ సరిగ్గా పనిచేయక టైరు నుంచి మంటలు, పొగ వచ్చాయి. దీంతో ప్రయాణికులను అత్యవసర ద్వారం నుంచి సురక్షితంగా దింపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఒక వ్యక్తికి మాత్రం స్వల్ప గాయాలైనట్లు పేర్కొన్నారు.


మయామి బయలుదేరిన బోయింగ్‌ 737 మాక్స్‌8 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు అత్యవసరం ద్వారం నుంచి జారి బయటపడుతుండగా.. టైరు నుంచి మంటలు, భారీగా పొగ రావడం వీడియోల్లో కనిపించింది. విమానం ఉన్న చోటును పొగ కమ్మేసింది. ఈ ఘటనపై విచారణ జరపనున్నట్లు అమెరికాకు చెందిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. విమానం నుంచి వచ్చిన మంటలను అదుపు చేసినట్లు డెన్వర్‌ అగ్నిమాపక విభాగం పేర్కొంది. నిర్వహణ సమస్యతో విమానం టైరు నుంచి మంటలు వచ్చినట్లు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. కాగా డెన్వర్‌లో ఇది రెండో ఘటన.

Updated Date - Jul 28 , 2025 | 05:13 AM