Share News

Digital Control in IVF: ఏఐ బేబీ

ABN , Publish Date - Apr 11 , 2025 | 06:11 AM

ప్రపంచంలో తొలిసారిగా, మానవ ప్రమేయం లేకుండా, ఏఐ ఆధారిత కృత్రిమ సంతానసాఫల్య విధానంలో మెక్సికోలోని వాదులహారా నగరంలో ఒక బాలుడు జన్మించాడు. డాక్టర్‌ జాక్వెస్‌ కోహెన్‌ నేతృత్వంలో అభివృద్ధి చేసిన ఈ విధానం, సంప్రదాయ కృత్రిమ సంతాన సాఫల్య విధానాలను మారుస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు

Digital Control in IVF: ఏఐ బేబీ

  • కృత్రిమ మేధ ఆధారిత ఐవీఎఫ్‌ విధానంలో తొలి శిశువు.. మెక్సికోలో జననం

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన 40 ఏళ్ల మహిళ

  • ఐవీఎఫ్‌ 23 దశలూ మానవ ప్రమేయం లేకుండా నిర్వహణ

  • వీర్యకణం ఎంపిక నుంచి.. అండంలోకి చొప్పించేదాకా..

  • అంతా కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ సాయంతోనే!

  • అమెరికా, మెక్సికో వైద్య నిపుణులు సాధించిన అద్భుతం

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 10: ప్రపంచంలోనే తొలిసారిగా.. మానవ ప్రమేయం ఏమాత్రం లేకుండా ఏఐ ఆధారిత కృత్రిమ సంతానసాఫల్య విధానంలో ఒక బాలుడు మెక్సికోలోని వాదులహారా నగరంలో జన్మించాడు. న్యూయార్క్‌, వాదులహారాకు చెందిన వైద్యనిపుణులు సాధించిన ఘనత ఇది. ప్రముఖ ఎంబ్రియాలజిస్టు డాక్టర్‌ జాక్వెస్‌ కోహెన్‌ నేతృత్వంలో.. మెక్సికోలోని ‘కన్సీవబుల్‌ లైఫ్‌సైన్సెస్‌’ అనే బయోటెక్నాలజీ సంస్థ రూపొందించిన ఈ విధానం గురించి ‘రీ-ప్రొడక్టివ్‌ బయోమెడిసిన్‌ ఆన్‌లైన్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. సహజంగా సంతాన భాగ్యం పొందలేని దంపతులకు వరంలా.. 1990ల్లో ‘ఇంట్రాసైటోప్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజెక్షన్‌ (ఐసీఎ్‌సఐ)’ విధానం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది.. ఆ విధానం ద్వారా పిల్లలను పొందారు. మహిళ అండంలోకి మాన్యువల్‌గా వీర్యకణాన్ని ఇంజెక్షన్‌ ద్వారా పంపే ప్రక్రియ ఇది. ఇందులో మొత్తం 23 దశలు ఉంటా యి. అవన్నీ అత్యంత సంక్లిష్టమైనవి. ఏ దశలో చిన్న తప్పిదం జరిగినా ప్రయత్నం మొత్తం వృథా అయిపోతుంది. అందుకే అత్యంత నిపుణులైన ఎంబ్రియాలజిస్టులను మాత్రమే ఇందుకు నియోగిస్తారు. ఆ 23 దశలనూ మానవ ప్రమేయం లేకుండానే కృత్రిమ మేధ సాయంతో, డిజిటల్‌ కంట్రోల్‌ ద్వారా రోబోటిక్స్‌తోనే నిర్వహించే విధానాన్ని కన్సీవబుల్‌ లైఫ్‌ సైన్సెస్‌ నిపుణులు అభివృద్ధి చేశారు.


ఇందులో భాగంగా నాణ్యమైన వీర్యకణాన్ని ఏఐ సాయంతో ఎంపిక చేస్తారు. లేజర్‌ సాయంతో దాన్ని కదలకుండా చేసి.. రిమోట్‌ డిజిటల్‌ కంట్రోల్‌ ద్వారా అండంలోకి చొప్పిస్తారు. మొత్తం 23 దశలనూ మనుషుల కన్నా కచ్చితంగా యంత్రాల ద్వారా నిర్వహించడానికి ఏఐ ఉపకరిస్తోంది. మెక్సికోకు చెందిన 40 ఏళ్ల మహిళ.. దాత అండాలతో ఈ విధానంలో గర్భం దాల్చి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ కొత్త విధానం.. సంప్రదాయ కృత్రిమ సంతాన సాఫ ల్య విధానం తీరుతెన్నులనే మార్చేస్తుందని డాక్టర్‌ కోహెన్‌ అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ ఏఐ ఆధారిత ఐసీఎస్ఐ నిర్వహణకు యంత్రాలకు పడుతున్న సమయం 9.56 నిమిషాలు. నిపుణులైన ఎంబ్రియాలజిస్టులకు ఇంతకన్నా తక్కువ సమయమే పడుతుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - Apr 11 , 2025 | 06:12 AM