Internet Shutdown: అఫ్ఘానిస్థాన్‌లో ఇంటర్నెట్‌పై నిషేధం!
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:57 AM
తాలిబన్ల పాలనలోని అఫ్ఘానిస్థాన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని మొబైల్ ఫోన్లు మూగబోయాయి. ఇంటర్నెట్ సదుపాయం బంద్ అయింది....
దేశవ్యాప్తంగా మొబైల్ సర్వీసులూ బంద్
అనైతిక కార్యకలాపాలను నిరోధించే పేరుతో తాలిబన్ సర్కార్ కఠిన చర్యలు
కాబూల్/ఇస్లామాబాద్, సెప్టెంబరు 30: తాలిబన్ల పాలనలోని అఫ్ఘానిస్థాన్‌లో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని మొబైల్ ఫోన్లు మూగబోయాయి. ఇంటర్నెట్ సదుపాయం బంద్ అయింది. దేశంలో అనైతిక కార్యకలాపాలను నిరోధించేందుకు తాలిబన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఇందుకు కారణం! దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మొబైల్ ఫోన్ సర్వీసులు, ఇంటర్నెట్ నిలిచిపోగా.. మంగళవారం కూడా కొనసాగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ పేమెంట్లు, విమాన సర్వీసులు, ఆన్‌లైన్ విద్య వంటి వాటిపై ప్రభావం పడింది. ఈ షట్‌డౌన్ తదుపరి నోటీసులు వచ్చే వరకు అమల్లో ఉంటాయని ఒక ప్రభుత్వాధికారి పేర్కొన్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదించింది. అయితే సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ఇంటర్నెట్ షట్‌డౌన్‌కు తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా కారణంగా చెప్పాల్సిఉంది. తాలిబన్లు సెప్టెంబరు మధ్య నుంచే ఇంటర్నెట్‌పై నియంత్రణ చర్యలు చేపట్టారు. వీటి ప్రభావం టెలిఫోన్ సేవలపై కూడా పడింది. కాగా, దేశవ్యాప్త ఇంటర్నెట్ షట్‌డౌన్ నేపథ్యంలో అఫ్ఘాన్‌లో ప్రధానమైన కాబూల్ విమానాశ్రయం స్తంభించిపోయింది. రాజధానిలోని ఎయిర్‌పోర్టు దాదాపు నిర్మానుష్యంగా కనిపించింద ని, ఇక్కడకు వచ్చే లేదా ఇతర చోట్లకు వెళ్లే విమానాలు కనిపించలేదని స్థానికుడు ఒకరు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, టెలీ కమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించాలని అఫ్గానిస్థాన్‌లోని ఐక్యరాజ్యసమితి మిషన్ తాలిబన్ ప్రభుత్వాన్ని కోరింది.