Share News

Press Conference: అఫ్ఘాన్‌ మంత్రి ప్రెస్‌మీట్‌లో మహిళా జర్నలిస్టులు

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:16 AM

విలేకరుల సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అఫ్గాన్‌ విదేశాంగమంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

Press Conference: అఫ్ఘాన్‌ మంత్రి ప్రెస్‌మీట్‌లో మహిళా జర్నలిస్టులు

  • తాజాగా ఆహ్వానించి విలేకరుల సమావేశం నిర్వహణ

  • మొన్న జరిగినది ‘ఉద్దేశపూర్వకం’ కాదని వివరణ

న్యూఢిల్లీ, అక్టోబరు 12: విలేకరుల సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అఫ్గాన్‌ విదేశాంగమంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాజాగా స్ర్తీ, పురుష జర్నలిస్టులందరినీ ఆహ్వానించి ఆదివారం ఢిల్లీలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం నాటి విలేకరుల సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడం ఉద్దేశ పూర్వకంగా చేసినది కాదని, అది సాంకేతికంగా జరిగిందని వివరణ ఇచ్చారు. ‘కొందరు నిర్దిష్ట జర్నలిస్టులతో ప్రెస్‌మీట్‌ నిర్వహించాలని మా రాయబార కార్యాలయ అధికారులు భావించారు. చాలా తక్కువ సమయం ఉండటం వల్లే కొద్దిమంది విలేకరులనే ఆహ్వానించాం. అది సాంకేతికంగా జరిగింది. అందులో ఉద్దేశపూర్వకం ఏమీ లేదు. మహిళలైనా, పురుషులైనా.. ఏ ఒక్కరి హక్కునూ నిరాకరించకూడదు’ అని ముత్తాఖీ పేర్కొన్నారు. శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ముత్తాఖీ అదే రోజు ఢిల్లీలోని అఫ్ఘాన్‌ రాయబార కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కాగా, జైశంకర్‌తో తాను జరిపిన ద్వైపాక్షిక చర్చల గురించి తాజా విలేకరుల సమావేశంలో ముత్తాఖీ వివరించారు. అఫ్ఘానిస్థాన్‌లో నిలిచిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను పునఃప్రారంభించేందుకు ఇరుపక్షాలూ అంగీకరించినట్టు చెప్పారు. త్వరలో అఫ్ఘాన్‌ నుంచి దౌత్య బృందం ఢిల్లీకి రానుందని తెలిపారు. అలాగే, అమృత్‌సర్‌ నుంచి అఫ్ఘాన్‌కు త్వరలోనే విమానాలు నడవనున్నట్టు తెలిపారు.


భారత్‌-అఫ్గాన్‌ సంయుక్త ప్రకటనపై పాక్‌ భగ్గు

భారత్‌-అఫ్గానిస్థాన్‌ సంయుక్త ప్రకటనలోని అంశాలపై పాకిస్థాన్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్‌లోని అఫ్గాన్‌ రాయబారికి తన అభ్యంతరాలను తెలియజేసింది. సంయుక్త ప్రకటనలో జమ్మూకశ్మీర్‌ను ప్రస్తావించడంపై పాకిస్థాన్‌ మండిపడింది. ‘జమ్మూకశ్మీర్‌ను భారత భూభాగంగా పేర్కొనడం ఐరాస భద్రతామండలి తీర్మానాలను తీవ్రంగా ఉల్లంఘించడమే’ అని పేర్కొంది. ఉగ్రవాదాన్ని పాక్‌ అంతర్భాగంగా ముత్తాఖీ పేర్కొనడాన్నీ తోసిపుచ్చింది.

Updated Date - Oct 13 , 2025 | 06:17 AM