Heavy Rains Devastate Pakistan: పాక్‌లో భారీ వర్షాలు.. 214 మంది మృతి
ABN , Publish Date - Aug 16 , 2025 | 02:54 AM
పాకిస్థాన్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. పాకిస్థాన్‌లోను, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోను గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కనీసం 214 మంది మృతి చెందారు. ...
నీలం లోయలో చిక్కుకున్న 600 మంది పర్యాటకులు
పెషావర్/ఇస్లామాబాద్, ఆగస్టు 15: పాకిస్థాన్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. పాకిస్థాన్‌లోను, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోను గురువారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కనీసం 214 మంది మృతి చెందారు. అనేక మంది గల్లంతయ్యారు. వరదల్లో అనేక మంది గల్లంతు కావడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కుండపోత వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు రావడంతో కొండచరియలు విరిగిపడి అనేక ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పాకిస్థాన్ ఆర్మీ, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్ ద్వారా సహాయం అందిస్తున్న క్రమంలో శుక్రవారం ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో సహా అయిదుగురు మృతి చెందారు. పీవోకేలోని కారకోరం, బాల్టిస్థాన్ రహదారులు దెబ్బతిన్నాయి. నీలం లోయలోని రట్టి గలీ సరస్సు వద్ద 600 మంది పర్యాటకులు చిక్కుకున్నారు.