Share News

Taliban justice: 13 ఏళ్ల బాలుడికి తుపాకీ ఇచ్చి చంపించారు

ABN , Publish Date - Dec 04 , 2025 | 03:59 AM

అఫ్గానిస్థాన్‌లో 80వేల మంది జనం చూస్తుండగా ఓ వ్యక్తిని తాలిబన్లు బహిరంగంగా కాల్చి చంపించారు. అంతకుమించి దిగ్ర్భాంతికరమైన విషయం...

Taliban justice: 13 ఏళ్ల బాలుడికి తుపాకీ ఇచ్చి చంపించారు

  • అఫ్గానిస్థాన్‌లో 80వేల మంది చూస్తుండగా మరణ శిక్ష

న్యూఢిల్లీ, డిసెంబరు 3: అఫ్గానిస్థాన్‌లో 80వేల మంది జనం చూస్తుండగా ఓ వ్యక్తిని తాలిబన్లు బహిరంగంగా కాల్చి చంపించారు. అంతకుమించి దిగ్ర్భాంతికరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తిని కాల్చి చంపింది పాలబుగ్గల వయసున్న ఓ 13 ఏళ్ల బాలుడు! శిక్షకు గురైంది ఖోస్ట్‌ ప్రావిన్సులోని కుజి అబుఖానీ ప్రాంతానికి చెందిన మంగల్‌ అలియాస్‌ తలాఖాన్‌ అనే వ్యక్తి. 10నెలల క్రితం అబ్దుల్‌ రహమాన్‌ సహా అతడి కుటుంబంలోని 13 మందిని మంగల్‌ కాల్చి చంపాడు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు, ముగ్గురు మహిళలున్నారు. ఈ కేసులో మంగల్‌ను అఫ్గానిస్థాన్‌ సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించి మరణ శిక్ష విధించింది. బాధిత కుటుంబంలో 13 ఏళ్ల బాలుడొక్కడే ప్రాణాలతో మిగిలాడు. ఖోస్ట్‌ ప్రావిన్సులోని ఓ స్టేడియంలో మంగళవారం 80వేల మంది ప్రజలు చూస్తుండగా దోషి మంగల్‌ను పెడరెక్కలు విరిచి కట్టి నిల్చోబెట్టారు. ఆ సమీపంలోనే బాధిత కుటుంబానికి చెందిన బాలుడిని నిల్చోబెట్టారు. ఆ చిన్నారిని ఉద్దేశించి.. ‘‘దోషిని క్షమించి ప్రాణాలతో వదిలేస్తావా?’’ అని తాలిబన్‌ ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆ బాలుడు తిరస్కరించగా.. అతడి చేతికి తుపాకీ ఇచ్చారు. ఆ వెంటనే బాలుడు, మంగల్‌వైపు తుపాకీని గురిపెట్టి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. మంగల్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

Updated Date - Dec 04 , 2025 | 03:59 AM