GST Removal on Insurance Premiums: బీమాపై భారం తగ్గేది కొంతే..
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:37 AM
అన్ని రకాల జీవిత, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంపై పన్నును జీఎస్టీ పాలకమండలి పూర్తిగా ఎత్తేసింది. దీంతో పాలసీ ధరలు దిగిరానున్నాయి. ...
అన్ని రకాల జీవిత, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంపై పన్నును జీఎస్టీ పాలకమండలి పూర్తిగా ఎత్తేసింది. దీంతో పాలసీ ధరలు దిగిరానున్నాయి. పాలసీ కొనుగోలుదారులకు ఇది శుభవార్త అని, పాలసీ కొనుగోళ్ల దిశగా ప్రజలను ప్రోత్సహించినట్టు అవుతుందని బీమా సంస్థల వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, జీఎస్టీని రద్దు చేయడం వల్ల పాలసీ కొనుగోలుదారులకు పూర్తి ప్రయోజనం దక్కుతుందా? అంటే ప్రస్తుతానికి కాదు అనే సమాధానమే వస్తుంది. బీమా కంపెనీలు చేసే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్‌లే ఇందుకు కారణమని బీమా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బీమా పాలసీ కొనుగోలుపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. అంటే ఏదైనా ఓ బీమా ప్రీమియం ధర రూ.10వేలు అయితే పాలసీ కొనుగోలుదారు 18 శాతం జీఎస్టీ కలుపుకొని రూ.11,800 చెల్లించాలి. పాలసీ కొనుగోలుదారు నుంచి జీఎస్టీ కింద వసూలు చేసిన సొమ్మును బీమా సంస్థలు ప్రభుత్వానికి చెల్లిస్తాయి. దానికంటే ముందు బీమా సంస్థ తాను అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన జీఎస్టీని లెక్కించి మిగిలిన మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తుంది. దీనినే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) క్లెయిమ్ అంటారు. బీమా సంస్థలు సేవా రంగంలోకి వస్తాయి. కార్యాలయాల అద్దె, సాఫ్ట్‌వేర్ లైసెన్సులు, ప్రచారం, మార్కెటింగ్, ఆడిటింగ్ వంటి వాటికి జీఎస్టీని చెల్లిస్తాయి. ఈ మొత్తాన్ని ఐటీసీ కింద క్లెయిమ్ చేసుకుంటాయి. ఇప్పుడు పాలసీ కొనుగోళ్లపై జీఎస్టీని ఎత్తేయడంతో ఐటీసీ భారా న్ని బీమా సంస్థలు పాలసీ కొనుగోలుదారులపై వేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం, బీమా సంస్థల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.