Share News

Zohan Mamdani New York Mayor: అమెరికాలో జవహర్‌లాల్

ABN , Publish Date - Nov 09 , 2025 | 05:07 AM

జోహ్రాన్ మమ్దానీ అనే ఒక ముస్లిం అడ్వకేట్ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన విజయంలో అనేక ప్రత్యేకతలున్నాయి. జోహ్రాన్ భారత సంతతికి చెందినవాడు. తల్లి మీరా నాయర్ హిందువు, అంతర్జాతీయ...

Zohan Mamdani New York Mayor: అమెరికాలో జవహర్‌లాల్

జోహ్రాన్ మమ్దానీ అనే ఒక ముస్లిం అడ్వకేట్ న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన విజయంలో అనేక ప్రత్యేకతలున్నాయి. జోహ్రాన్ భారత సంతతికి చెందినవాడు. తల్లి మీరా నాయర్ హిందువు, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన దర్శక నిర్మాత. తండ్రి మహమూద్ మమ్దానీ కూడా భారతీయ ముస్లిం. కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్. బహుగ్రంథాల రచయిత. ఇదే న్యూయార్క్ నగరంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు చెందిన రెండు టవర్లను 2001 సెప్టెంబరు 11న (9/11) అల్‌ఖైదా ఉగ్రవాదులు కూల్చివేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ తరువాత ఇస్లాం సంస్కృతి సంప్రదాయాల్లోనే ఉగ్రవాదం వుందంటూ అమెరికా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం మొదలెట్టింది. దీనినే ఇస్లామోఫోబియా అంటున్నాం. ఈ ప్రచారంలోని బూటకాన్ని బయటపెడుతూ మహమూద్ మమ్దానీ ‘మంచి ముస్లిం, చెడ్డ ముస్లిం’ అనే గ్రంధాన్ని రాసి ప్రచురించాడు. 1979లో సోవియట్ రష్యా ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించినపుడు, ఆఫ్ఘన్ గెరిల్లాలకు ఆయుధాలు, డబ్బు సరఫరాచేసి, పాకిస్థాన్ సహకారంతో వారికి అమెరికా ఉగ్రవాద శిక్షణ ఇచ్చిందనీ, రోనాల్డ్ రీగన్ అధ్యక్షునిగా వుండగా ఆఫ్ఘన్ గెరిల్లాలను వైట్ హౌస్‌కు ఆహ్వానించి వాళ్లను స్వాతంత్ర్య సమరయోధులుగా పొగిడారనీ మమ్దానీ తగిన ఆధారాలతో ఈ పుస్తకంలో వివరించాడు.

మహమూద్ మమ్దానీ, మీరా నాయర్ ఉగాండాలో పనిచేస్తున్న కాలంలో వాళ్లకు జోహ్రాన్ మమ్దానీ జన్మించాడు. జోహ్రాన్ ఏడేళ్ల వయస్సులో వున్నప్పుడు మమ్దానీ కుటుంబం అమెరికాకు మారింది. జోహ్రాన్ ఈ ఏడాదే డిజిటల్ క్రియేటర్ రమా దువాజీని జోహ్రాన్‌ దుబాయ్‌లో నిఖా చేసుకున్నాడు. అలా వారిది ఒక రకంగా వసుధైక కుటుంబం. న్యూయార్క్‌లో జోహ్రాన్ అడ్వకేట్‌గా స్థిరపడి మానవహక్కుల కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అమెరికా ఎన్నికలు జోహ్రాన్‌కు కొత్తకాదు. న్యూయార్క్ శాసనసభకు అస్టోరియ (క్వీన్స్) నియోజకవర్గం నుంచి 2020లో పోటీ చేసి ఐదు వరుస విజయాలున్న ఘనాపాఠిని ఓడించాడు. 2022, 2024 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం అతను శాసనసభ్యుడు.


ప్రపంచ రాజధానిగా భావించే న్యూయార్క్ నగరాన్ని సహజంగానే ప్రపంచ ధనవంతులు ఏలుతుంటారు. వాళ్లలో అత్యధికులు యూదులు. వాళ్లే రాజకీయ రంగాన్నీ శాసిస్తుంటారు. మీడియా కూడ వాళ్ల చెప్పుచేతల్లోనే వుంటుంది. వీళ్లను ఒలిగార్కీ అంటారు. ఒలిగార్కీ అండదండలు లేకుండా ఎవరూ అక్కడ ఏ రంగంలోనూ నిలదొక్కుకోలేదు. మేయర్ బరిలో దిగినప్పుడు జోహ్రాన్‌ను ఎవరూ పట్టించుకోలేదు. ఒక చేత్తో ప్లకార్డ్, మరో చేతిలో మైక్ పట్టుకుని ప్రసంగిస్తూ వీధుల్లో నడుస్తుంటే ఒక్కరూ తలతిప్పి చూసేవారు కాదు. పోటీలో పదిమంది వుంటే మీడియా అతనికి పదో ర్యాంకు ఇచ్చింది. జోహ్రాన్ వయస్సు ఇప్పుడు 34 సంవత్సరాలు. జీ జెనరేషన్ సంప్రదాయం తెలిసినవాడు. న్యూయార్క్‌లో ధనవంతుల్ని అతను అస్సలు పట్టించుకోలేదు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదల్ని లక్ష్యంగా పెట్టుకుని తన ప్రచారాన్ని సాగించాడు. ‘గోదాంలో పెట్టెలు మోసి నీలి మచ్చలు పడ్డ వేళ్లు, డెలివరీ సైకిల్ హ్యాండిల్స్ వల్ల గట్టిగా మారిన అరచేతులు, కిచెన్‌లో కాలిన గాయాలు ఉన్న మునివేళ్లు. ఇలాంటి చేతులకు అధికారాన్ని పట్టుకునే అవకాశం ఎవరూ ఇక్కడ ఇవ్వరు’. ‘ప్రతి అడ్డంకినీ దాటి, ఒక మహా రాజకీయ వంశాన్ని కూల్చివేసి, మన భవిష్యత్తును మన చేతులతో పట్టుకుందాం’ వంటి మాటలు అణగారినవారికి గొప్ప ఉత్తేజాన్నిచ్చాయి.

ఎదురీదడం జోహ్రాన్ నైజం. అతను ముస్లిం అనీ, అవకాశం ఇస్తే 9/11 టెర్రరిస్టు సంఘటనలు పునరావృతం అవుతాయని ప్రచారం మొదలెట్టారు ప్రత్యర్థులు. ‘శరణార్థి, చొరబాటుదారుడు’ అన్నవాళ్లూ వున్నారు. దానికి అతను భుజాలు తడుముకోలేదు. ‘అవును నేను ముస్లింను. ముస్లిం ఆచార వ్యవహారాలను పాటిస్తాను’ అంటూ తాను ఇష్టంగా బిర్యాని తింటున్న విడియోను సోషల్ మీడియాలో పెట్టిన గడుసరి.


ప్రపంచంలో యూదులు అత్యధికంగా నివసిస్తున్న నగరం న్యూయార్క్. అలాంటి నగరంలో ఏ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా ముందు యూదు పెద్దల ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం సంప్రదాయం. తాము గెలిస్తే ముందు ఇజ్రాయెల్ వెళతామని ఎన్నికల ప్రచారంలో అభ్యర్ధులు వాగ్దానం చేస్తుంటారు. జొహ్రాన్ మహామొండి. తాను మేయర్‌గా గెలిస్తే, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును న్యూయార్క్లో కాలుపెట్టనీయనని ప్రకటించాడు. ‘ఒకవేళ అతను వస్తే, అరెస్టు చేస్తాను’ అని కరాఖండీగా చెప్పాడు. యుద్ధనేరాలకు పాల్పడినందుకు నెతన్యాహు మీద ఏడాది క్రితం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఒక అరెస్టు వారెంటు జారీచేసిన విషయం తెలిసిందే.

న్యూయార్క్ మహానగరంలో జోహ్రాన్ ఒక సామాజికార్థిక సరిహద్దు గీత గీశాడు. ఉన్నోళ్లు తన ప్రత్యర్థులు, లేనోళ్లే తన మద్దతుదారులు. పేదల ఇంటింటికి వెళ్లి వాళ్ల కష్టాలు తెలుసుకున్నాడు. వాటి పరిష్కారాల కోసం పథకాలు ప్రకటించాడు. హెల్త్ కేర్, ఇంటి రెంటు, సొంతిల్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాల మీద జోహ్రాన్ ప్రకటించిన సంక్షేమ పథకాలు జనాకర్షణగా మారాయి. ఒక అడ్వకేట్‌గా మానవ హక్కుల పరిరక్షణ కోసం అతను చేస్తున్న కృషికి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో అతని భార్య సాగించిన ప్రచారం కూడా బాగా పనిచేసింది. క్రమంగా అతని మద్దతుదారులు పెరిగారు. మమ్దానీ రేసులో దూసుకుపోతున్నాడనే సంకేతాలు రాగానే ఒలిగార్కి తన దగ్గరున్న పావులన్నీ కదిపింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మమ్దానీని హేళన చేశాడు. అతణ్ణి మేయర్‌గా ఎన్నుకుంటే న్యూయార్క్ నగరానికి ఫెడరల్ నిధుల్లో కోత విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. డెమోక్రాటిక్‌ పార్టీకే చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా సైతం మమ్దానీ కోసం ప్రచారం చేయడానికి నిరాకరించాడు.

సాహిత్యంతో పరిచయం ఉన్నవాళ్లకు మమ్దానీ ఉపన్యాస శైలి జాక్ లండన్ నవల ‘ఉక్కుపాదం’ (ఐరన్ హీల్)లోని కథానాయకుడు ఎర్నెస్ట్ ఎవ్వర్ హార్డ్‌ను గుర్తుకు తెచ్చింది. సామాజిక ఉద్యమాలతో పరిచయం వున్నవాళ్లకు ముస్లిం మస్జీద్ నిర్మాత, ఆఫ్రో అమెరికన్ ఉద్యకారుడు మాల్కమ్–ఎక్స్ను గుర్తుకు తెచ్చింది. ప్రత్యర్థులు మమ్దానీని కమ్యూనిస్టు, మార్క్సిస్టు, రాడికల్ అన్నారు. ఈ మాటలతో న్యూయార్కీయులు భయపడతారని అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. ఇస్లామోఫోబియా రాజ్యం చేస్తున్న చోట ఒక ముస్లింను ఎన్నుకున్నారు. వలసదారుల భరతం పడతానంటూ దేశాధ్యక్షుడు రంకెలు వేస్తున్న చోట ఒక వలసదారుడిని గెలిపించారు. ఇదేమీ విప్లవం కాదు; అక్కడేమీ సోషలిస్టు రాజ్యం ఏర్పడడంలేదు. కాకపోతే, ప్రధానంగా ఇది అమెరికాలో అణగారిన సమూహాలకు ఆత్మగౌరవ విజయం!


ఆర్థిక విధానాల్లో రిపబ్లికన్స్, డెమొక్రాట్స్ మధ్య పెద్ద తేడాలేదు. డెమోక్రాట్స్‌లో జోహ్రాన్ నిస్సందేహంగా వామపక్షం. మనకు కూడా కాంగ్రెస్‌లో ఒకప్పుడు కుడిపక్షం, వామపక్షం ఉండేవి. గోపాలకృష్ణ గోఖలే, సర్దార్ వల్లభ్‌భాయి పటేల్‌ కుడిపక్షం; జవహర్‌లాల్ నెహ్రు, సుభాష్ చంద్రబోస్ వామపక్షంగా వుండేవారు. జోహ్రాన్ మమ్దానీ కమ్యూనిస్టు కాడు; నక్సలైటూ కాడు. కేవలం సోషల్ డెమోక్రాట్. అతనిప్పుడు అమెరికాలో జవహర్‌లాల్ నెహ్రూ. గెలిచినప్పుడు కూడ అతను నెహ్రూని తలుచుకోవడం యాదృచ్ఛికం కాదు.

‘న్యూయార్క్– వలసదారులు నిర్మించిన నగరం. వలసదారులు శక్తిమంతంగా తీర్చిదిద్దిన నగరం. ఈ రాత్రి నుంచి అయితే వలసదారులు నడుపుతున్న నగరం. ఇది వలసదారుల నగరంగానే కొనసాగుతుంది. అయ్యా డొనాల్డ్ ట్రంప్‌ గారూ! నా మాటలు గట్టిగా ఆలకించండి. ఇక్కడ మీరు ఎవరిని తాకాలన్నా మమ్మల్ని అందరినీ దాటుకుని వెళ్లాలి’ అంటూ జోహ్రాన్ తన విజయోత్సవ సభలో అన్న మాటలు అమెరికా రాజకీయాల్లో రాబోయే మార్పులకు సంకేతం కావచ్చు.

డానీ

సమాజ విశ్లేషకులు

ఇవి కూడా చదవండి...

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 09 , 2025 | 05:07 AM