ప్రపంచ చరిత్ర.. మరొక్కసారి!
ABN , Publish Date - Mar 05 , 2025 | 04:29 AM
ప్రజాప్రతినిధులైన వాళ్ళు పాలనలోని నియమ నిబంధనలు తెలుసుకోకుండా రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థితిగతులు, మానవ అభివృద్ధి పరిణామం చరిత్ర గురించి...

ప్రజాప్రతినిధులైన వాళ్ళు పాలనలోని నియమ నిబంధనలు తెలుసుకోకుండా రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థితిగతులు, మానవ అభివృద్ధి పరిణామం చరిత్ర గురించి అవగాహన లేకుండా ఉండటం సిగ్గుపడే అంశమని నా అభిప్రాయం. నా వరకు నేను కొద్దో గొప్పో చదువుకుని మంచి కుటుంబ నేపథ్యంలో వ్యక్తిగా ఉండి, చెడు అనిపించుకోకపోయినా... మరొక విషయంలో మాత్రం నేను లోపభూయిష్టుడుగా భావించేవాడిని. అది ఏమంటే... చరిత్ర, పాలనలకు సంబంధించిన విషయం గురించి అవగాహన లేకపోవడం... ఇవి తెలియని వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండటానికి ఎంతమాత్రం అర్హుడు కాడనేది నా అభిప్రాయం. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని నాలాగా ఎంతోమంది ప్రజాప్రతినిధులు చరిత్ర చదవకుండా, చరిత్ర తెలియకుండా, రాజకీయాల్లో ఉన్న విషయాన్ని గమనించి ముందు నన్ను నేను ప్రక్షాళన చేసుకుని జ్ఞానవంతుడు అవ్వటం నా బాధ్యత అని భావించాను. అందుచేత 1983లో నేను మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిని అయినప్పటి నుంచి పుస్తకాలు ముఖ్యంగా చరిత్ర, దేశాల పాలనలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖుల జీవిత చరిత్రలు సేకరించేవాడిని. కానీ నాకున్న సమయాభావం వల్ల వాటిని క్షుణ్ణంగా చదివే అవకాశం లేకపోయింది. వీలైనప్పుడల్లా ఆ పుస్తకాలు చదువుతూ కొంతమేర అవగాహన ఏర్పరచుకొన్నాను. నేను తెలుసుకొన్న విషయాలు నాలాంటి వారికి, ఇతరులకు అందుబాటులోకి తెస్తే మంచిది అన్న అభిప్రాయం కలిగి, 2009 నుంచి రచనలు ప్రారంభించాను.
నేను స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను ‘ఒక చరిత్ర – కొన్ని నిజాలు’ అనే నామకరణంతో నా మొదటి రచన చేశాను. దీనిని పాఠకులు బాగా ఆదరించారు.
తరువాత 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా ఏర్పడిన సందర్భంలో అసలు తెలుగువారు ఎప్పటివారు, పాలకులు ఎవరు అని, భిన్న రాష్ట్రాలుగా, భిన్న ప్రాంతాలుగా పరిపాలన సాగిన విషయాన్ని ప్రజాప్రతినిధులకు, పాఠకులకు వీలైనంత క్లుప్తంగా తెలియజేయాలని ఈ రచన కొనసాగించాను ‘తెలుగువారి చరిత్ర... వేర్పాటువాదం’ అనే పేరుతో. ఇది కూడా పాఠకుల మన్ననలు పొందింది.
ఇక మూడవది ‘ప్రపంచతత్త్వం–నాయకత్వం’ చరిత్రలో... క్రీ.పూ. 500 సంవత్సరాల నుంచి క్రీ.శ. 2000 సంవత్సరాల వరకు కాలంలో తత్త్వవేత్తలు, ప్రజానాయకులు అనేక దేశాల ఆవిర్భావాలకు, ఆయా దేశాల ప్రగతికి కారణభూతులయ్యారు. వారిలో 50 మందిని ఎంచుకుని క్లుప్తంగా వారి చరిత్ర గురించి పుస్తక రచన కొనసాగించగా, పాఠకుల ఆదరణకు నోచుకుంది.
తరువాత నాలుగవ రచనగా ‘ప్రపంచ దేశాలు పాలనా వ్యవస్థలు’ అనే పేరుతో ప్రపంచంలో ఉన్న అనేక రకాలైన పరిపాలన వ్యవస్థలను ఒకేచోటుకు చేర్చి క్లుప్తంగా రచించగా, ప్రజాపాలనలో ఉన్నవారికి ఎంతో ఉపయోగపడింది.
ఇకపోతే ప్రస్తుత రచన ‘ప్రపంచ చరిత్ర’ ఆది నుంచి నేటి వరకు వచ్చేటప్పటికి...
ఈ గ్రంథంలో చెప్పిన విషయాలు ఇంతకు ముందు అనేక మంది పెద్దలు గ్రంథస్థం చేసినవే. నేను కొత్తగా ఏమీ సృష్టించలేదు. కొత్త కోణం కూడా కాదు. కాకపోతే అనేక రచనలుగా ఉన్న ప్రపంచ చరిత్రలోని అనేక భాగాలైన... భూమి, నీరు ఎలా ఏర్పడ్డాయి దగ్గర నుంచి, ఖగోళం, రాతియుగం, జీవి పుట్టుక, ఆదిమానవుడు, ప్రాచీన నాగరికతలు, రోమ్, గ్రీక్ సంస్కృతులు, వివిధ మతాల ఆవిర్భావం, మతకలహాలు, రాజ్యాలు ఏర్పడటం, అవి పతనమవటం, రాజ్యపాలనలు, సాంస్కృతిక పునరుజ్జీవనం, పారిశ్రామిక విప్లవం, ఫ్రెంచ్, రష్యా ఇతర విప్లవాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, వలస రాజ్యాలు, ప్రపంచ యుద్ధాలు, రష్యా, అమెరికా వైరాలు, వివిధ దేశాల స్వాతంత్ర్య పోరాటాలు, సాంస్కృతిక– సైన్సు ఆవిష్కరణలు, భారత్ చైనా లాంటి దేశాల చరిత్ర, ఇంకా అనేకం కలిపి ఇందులో క్లుప్తంగా క్రోడీకరించాను. చివరిగా కరోనా గురించి, భవిష్యత్ దర్శినిని కూడా చేర్చి ముగించాను.
వేటికి వాటిగా ప్రత్యేక రచనలుగా ఉన్న విభిన్న అంశాలను ఒకచోట చేర్చడం ఈ రచనలోని ప్రధాన అంశం. దీనితోబాటు గత రెండు వందల సంవత్సరాల్లో జరిగిన సాంస్కృతిక విజ్ఞాన ఆవిష్కరణలయిన అచ్చుయంత్రం, ఆవిరియంత్రం, కరెంటు, రేడియో, మోటార్‌కారు, రైలు, విమానం, టెలిఫోన్, కంప్యూటర్, టీవీ, సెల్‌ఫోన్ వంటి వాటి వివరాలు చెప్పుకున్నాం. ఎక్కడో దేశాంతరంలో ఉన్న వారితో ఫోన్‌లో చూస్తూ మాట్లాడటం, ఇంటి నుంచే పాఠాలు, ఉద్యోగం, వ్యాపారం చేయటం ప్రపంచ సమాచారాన్ని మొత్తం గూగుల్ ద్వారా చిటికెలో అందుబాటులోకి తెచ్చుకోవడం, వైద్య రంగంలో అనేక ఆవిష్కరణలు, వ్యాధి నివారణలో అత్యాధునిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి. వందలకొద్దీ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి కొత్త చరిత్ర సృష్టించబడింది. ఇవన్నీ మన కళ్లముందు మనం జీవించిన కాలంలో ఆవిష్కరించబడ్డ అద్భుతాలయితే, వీటిలో కొన్నింటిని దార్శనికులు కొంతమంది ముందే ఊహించారు. హెచ్.జి వెల్స్ అనే మేధావి 19వ శతాబ్దంలో ఊహించి తన రచనలలో కొన్ని ఊహతో జరిగే పరిణామాలను పొందుపరచగా, 20వ శతాబ్దంలో చాలావరకు అవి నిజమయ్యాయి.
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు
డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర (ఆదినుండి నేటివరకు– ఆ తరువాత) పుస్తకంలోని ‘నామాట’ నుంచి కొన్ని భాగాలు ఇవి.
గ్రంథావిష్కరణ కార్యక్రమం రేపు ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ
ఆడిటోరియంలో జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథి.
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు, ఇంగ్లిష్ అనువాదం ‘ద గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరిస్తారు.
పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి
కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.