జల సంరక్షణతోనే భద్ర భవిష్యత్తు
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:09 AM
వేసవి సమీపిస్తున్నప్పుడే మనకు నీటిచుక్క విలువ గుర్తుకు వస్తుంది. భానుడి భగభగలకు ఉన్న ఆ కాస్తనీరూ ఆవిరైపోతూంటే దాని సంరక్షణ విలువ తెలిసొస్తుంది. ప్రస్తుతం దేశంలో మూడింట ఒక వంతు జనాభా నీటి కొరతను...

వేసవి సమీపిస్తున్నప్పుడే మనకు నీటిచుక్క విలువ గుర్తుకు వస్తుంది. భానుడి భగభగలకు ఉన్న ఆ కాస్తనీరూ ఆవిరైపోతూంటే దాని సంరక్షణ విలువ తెలిసొస్తుంది. ప్రస్తుతం దేశంలో మూడింట ఒక వంతు జనాభా నీటి కొరతను ఎదుర్కొంటున్నది. 2050 నాటికి నీటికొరత పెచ్చరిల్లి దేశంలోని సగం జిల్లాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కోనున్నాయి. గత నలభై ఏళ్లుగా సగటు వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. అయితే వర్షపాతంలో క్షీణత లేదు. దేశంలో సగటున 1170 మి.మీల వర్షపాతం నమోదవుతోంది. కానీ వార్షిక వర్షపాతంలో ఆరు శాతం అంటే 253 బీసీఎం (బిలియన్ క్యూబిక్ మీటర్లు) మాత్రమే నిల్వ చేయగలుగుతున్నాం. అదే అభివృద్ధి చెందిన దేశాలు 25 శాతం వ్యూహాత్మకంగా శుష్క నదీపరీవాహక ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నాయి. నీతిఆయోగ్ నివేదిక ప్రకారం 2030 నాటికి దేశంలో తాగునీటి సరఫరా అవసరం రెండింతలు అవుతుంది. నీటి కొరత కారణంగా స్థూల దేశీయోత్పత్తిలో ఆరు శాతం తగ్గుదల నమోదు కావచ్చని అంచనా.
భారతదేశంలో భూగర్భ జలాల వెలికితీత దశాబ్దాలుగా పెరుగుతోంది. వేగవంతమైన గ్రామీణ విద్యుదీకరణ, ఆధునిక సాంకేతికతల లభ్యతతో 1960 దశకం నుంచి ఆహార భద్రతను కల్పించడానికి ప్రభుత్వం వ్యవసాయానికి మద్దతుగా భూగర్భ జలాలను భారీగా తోడటాన్ని ప్రోత్సహించింది. దీని వల్ల బోర్‌వెల్స్ సంఖ్య గత ఐదు దశాబ్దాలలో ఒక మిలియన్ నుంచి 30 మిలియన్లకు పెరిగి భారతదేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద భూగర్భజల వినియోగదారును చేసింది. సంవత్సరానికి 230 క్యూబిక్ కిలోమీటర్ల భూగర్భ జలాలను... అంటే ప్రపంచ భూగర్భజలాలలో నాలుగింట ఒక వంతు పైనే భారత్ వినియోగిస్తోంది. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం సుమారు 17శాతం భూగర్భ జలాల బ్లాక్‌లు భర్తీ అవుతున్నదానికంటే వేగంగా ఖాళీ అవుతున్నాయి.
విస్తృతమైన నదీ వ్యవస్థ కలిగి చైనా, అమెరికా తరువాత పెద్ద సంఖ్యలో (5334) ఆనకట్టలు, బ్యారేజీలు, రిజర్వాయర్లు ఉన్నా, దేశంలో సురక్షితమైన తాగునీరు, సుస్థిర వ్యవసాయ నీటిపారుదల సౌకర్యాల కొరత ఉంది. ఆనకట్టలలో 234 ప్రధాన డ్యాంలు నిర్మించి వందేళ్లు పైబడగా, 50 నుంచి 100 సంవత్సరాల మధ్యలో 1034 డ్యాంల నిర్మాణం జరిగింది. దేశంలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు ఒక్కసారి నిండితే రెండేళ్లపాటు నీటి భద్రత లభిస్తుంది. అయితే నిర్వహణలోపం వల్ల వీటి స్థూల నీటి నిల్వ సామర్ధ్యం 325.45 బీసీఎంల (11,484.50 టీఎంసీ) నుంచి ప్రత్యక్ష నీటి నిల్వ సామర్ధ్యం 8,796.64 బీసీఎం (సుమారు 8,797 టీఎంసీ)లకు తగ్గిపోయింది.
ప్రతి ఏడాది సుమారు 1200 బీసీఎంల (దాదాపు 42,378 టీఎంసీలు) వర్షపు నీరు సముద్రంలో కలుస్తోంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నీటి సంవత్సరం తొలి అర్ధభాగంలోనే 11,082 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తే వినియోగించుకున్నది 972.83 టీఎంసీలు మాత్రమే. వృధాగా సముద్రంలో కలుస్తున్న విలువైన నీటిని నదుల అనుసంధానం ద్వారా దారి మళ్లించి వినియోగించుకోగలిగితే దేశంలో సాగునీరు, తాగునీరు ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లో పదకొండు నదుల అనుసంధానం కోసం రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన డీపీఆర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం రాష్ట్రానికి శుభ సంకేతంగా, నదుల అనుసంధాన ప్రక్రియలో కీలక పరిణామంగా భావించాలి. పట్టిసీమ నీటిని కృష్ణా ఆయకట్టుకు తరలించి సత్ఫలితాలు సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.70 వేల కోట్లతో వంశధార–గోదావరి–కృష్ణా–పెన్నా నదుల అనుసంధాన ప్రణాళిక కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయని ఆశిస్తున్నారు.
ప్రస్తుత పోకడలు కొనసాగితే, 20 ఏళ్లలో భారతదేశంలోని మొత్తం 60 శాతం జలాశయాలు ప్రమాదకర స్థితిలో ఉంటాయి. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా చెక్ డ్యాములు, ఇంకుడు గుంతలు నిర్మాణం ద్వారా స్థానికంగా భూగర్భ జల మట్టాలను పెంచుకోవాలి. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల స్థానే రసాయన ఎరువులు వాడని సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఎక్కడికక్కడ చిన్న నీటిపారుదల వ్యవస్థలను, స్థానిక నీటి వనరులను బలోపేతం చేయాలి. అడవులను సంరక్షించుకోవడంతో పాటు బీడు, బంజరు భూములను కాపాడాలి. దేశంలో సాంప్రదాయ సాగునీటి వనరులైన కాలువలు, చెరువులు, బావులు వంటి మూడు ముఖ్యమైన సాగునీటి వనరులు వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు, ఊట జలాలను నింపుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటాయి. నిర్వహణ కొరవడి, పూడికతీత లేక, కబ్జాలకు గురై ఈ సాంప్రదాయ సాగునీటి వనరులు క్రమేపీ ఉనికి కోల్పోతున్నాయి. సాంప్రదాయ నీటి వనరులను కాపాడటంతో పాటు కొత్త చెరువులు నిర్మించి వర్షాకాలం వరదలతో వాటిని నింపుకోవాలి. మేజర్, మైనర్ కాలువ కట్టలను పటిష్ఠపరచుకుని నీటిని నిల్వ చేయాలి. వర్షాకాలంలో కురిసే ప్రతి నీటి బొట్టును భూమిలో ఇంకేలా చర్యలు చేపట్టి, నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. జలాశయాలలో నీటి సంరక్షణ, నదుల అనుసంధానం, నీటి పొదుపు వంటి బహుముఖ చర్యలతో నీటి భద్రతను సాకారం చేయవచ్చు.
లింగమనేని శివరామ ప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే..
Betting Apps: బెట్టింగ్ యాప్స్ భూతానికి మరో యువకుడు బలి..