మనిషిని యంత్రుడుగా మారుస్తారా?
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:27 AM
జనవరి తొమ్మిదిన రెండు వార్తలు ఉద్యోగ-, శ్రామిక రంగాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. మొదటిది, కృత్రిమ మేధ (ఏఐ) తదితర ఆధునిక సాంకేతిక ఆవిష్కరణల వల్ల దాదాపు 93 మిలియన్ల మంది ఉద్యోగులు సామూహిక...

జనవరి తొమ్మిదిన రెండు వార్తలు ఉద్యోగ-, శ్రామిక రంగాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. మొదటిది, కృత్రిమ మేధ (ఏఐ) తదితర ఆధునిక సాంకేతిక ఆవిష్కరణల వల్ల దాదాపు 93 మిలియన్ల మంది ఉద్యోగులు సామూహిక స్థానభ్రంశానికి గురి కాబోతున్నారనేది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లుఇఎఫ్) ‘ఉద్యోగుల భవిష్యత్తు’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ హెచ్చరికను చేసింది. రెండోది; లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ౯0 గంటల పని వారాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు అనేది.
సుబ్రమణ్యన్ ఒక ఆంతరంగిక సమావేశంలో యథాలాపంగా అన్న మాటల్ని పట్టించుకోవాల్సిన పనిలేదని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. సుబ్రమణ్యన్ మాట్లాడింది ఒక విధానానికి సంబంధించిన అంశం కనుక ఎక్కడ అన్నారూ అనేదానికన్నా ఏమన్నారూ అనేదే ప్రధానం. సుబ్రమణ్యన్ ప్రతిపాదన ప్రకారం వారానికి ఏడు పనిదినాలయితే రోజుకు 13 గంటలు పనిచేయాలి. ఆరు పనిదినాలయితే రోజుకు 15 గంటలు పనిచేయాలి. ఐదు పనిదినాలయితే రోజుకు 18 గంటలు పనిచేయాలి. గతంలో ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి కూడ 70 గంటల పనివారాన్ని ప్రతిపాదించారు. వారి ఉద్దేశ్యం కూడా సిబ్బందితో రోజుకు 14 గంటలు పని చేయించాలనే.
కార్మిక సంఘాలు, సామ్యవాదులు మాత్రమే గాక మానవతావాదులు, సామాన్యులు సహితం ఇలాంటి ప్రతిపాదనల్ని సహజంగానే తీవ్రంగా వ్యతిరేకిస్తారు. నిజానికి ఈ రెండు వార్తలూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. మొదటిది– ఉన్న ఉద్యోగాలే ఊడిపోతాయి అంటుంటే, రెండోది, శ్రామికులు మరిన్ని అదనపు గంటలు పనిచేయాలంటున్నది.
ప్రత్యర్థుల నోరు మూయించడానికి మన ఏలినవారు ఇటీవలి కాలంలో దేశభక్తిని తిరుగులేని ఆయుధంగా వాడుతున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీలు విడుదల చేసే కాలుష్యానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేస్తుంటే, వాళ్ళ నోళ్లు మూయించడానికి కూడా దేశభక్తిని ముందుకు తెస్తున్నారు. శిలాజ ఇంధనమైన ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించి దేశం అప్పుల పాలవుతున్నదనీ, ఇథనాల్ వంటి జీవ ఇంధనాలను ఇక్కడే తయారు చేస్తే దేశం మీద రుణభారం తగ్గుతుందనీ ఆ వాదన సారాంశం. పని గంటల విషయం లోనూ ఇదే వాదన. మన దేశం చైనాను అధిగమించాలంటే భారత ఉద్యోగులు-, శ్రామికులు అధికంగా శ్రమించాలంటున్నారు. భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు శ్రామికుల చేతుల్లోనే ఉంది అనే మాటలూ వినిపిస్తున్నాయి.
భూమి, ఆకాశం, సముద్రాలు, అడవులు, కొండలు, గనులతోపాటు దేశ శ్రామికుల్ని కూడా ప్రభుత్వం మెగా కార్పొరేట్లకు అప్పచెపుతోంది. శ్రామికులు మారు మాట్లాడకుండా దేశభక్తి పారవశ్యంతో రోజుకు 24 గంటలు పని చేస్తే భారతదేశం చైనాను ఏమిటీ, ఏకంగా అమెరికాను సహితం అధిగమిస్తుంది అనేది ఏలినవారు చెప్పదలచుకున్న సిద్ధాంతం.
16వ శతాబ్దంలో ఆధునిక యంత్రాల మీద ఉత్పతి విధానం మొదలయినప్పుడే మనిషి ఒక రోజులో ఎంత సమయం శ్రమించాలి అనే చర్చ కూడా మొదలయింది. ఇందులో తాత్త్విక, ధార్మిక, సాంస్కృతిక దృక్పథాలు ఉన్నాయి. శ్రమించడం దైవారాధనకు మరో రూపం, సాతాను ప్రభావంలో ఉన్నవాళ్ళు శ్రమించరు – వంటి భావనని జాన్ కాల్విన్ వంటివాళ్ళు ముందుకు తెచ్చారు. అంతకుముందే సెయింట్ బెనెడిక్ట్ రులే వంటివారు ప్రార్థన, శ్రమ, విశ్రాంతుల మధ్య సమయ విభజన చేయడానికి ప్రయత్నించారు. 18వ శతాబ్దపు బెంజామిన్ ఫ్రాంక్లిన్ Early to bed and early to rise అంటూ మనందరికీ బాగా తెలిసిన నీతిని చెపుతూ త్వరగా పడుకొని త్వరగా లేచే మనిషిని ఆరోగ్యం, ధనం, జ్ఞానం వరిస్తాయి అని ఆశపెట్టాడు. ఇస్లాం ప్రబోధించే ఉపవాసాల్లోనూ ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి అనే అంశాలతో పాటు మనిషి తన జీవితాన్ని, ఆర్థిక సామాజిక కర్తవ్యాలని సూర్యోదయ సూర్యాస్తమయాలతో అనుసంధానం చేయాలనే సూచనలు ఉంటాయి. తరువాత ఆడమ్ స్మిత్, మాక్స్ వేబర్ వంటి అర్థశాస్త్ర, సమాజశాస్త్ర ఆదిపురుషులు వచ్చారు. సమయం అంటే డబ్బు అనే మాట అప్పుడే పుట్టింది. అయితే, వీళ్ళందరూ తమకు తెలిసో తెలియకో పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాదనలు చేశారు.
దానికి విరుద్ధమైన వాదనలు కూడా అప్పట్లోనే వచ్చాయి. మనందరం ఏ తొమ్మిదో తరగతిలోనో న్యూటన్ చలన సూత్రాలను చదివి ఉంటాం. అందులో బాగా గుర్తుండిపోయేది: ప్రతి చర్యకు తత్సమానమైన వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది అనేది. మనం తరచూ అక్కడితో ఆగిపోతాం. ఆ ప్రతిచర్య కూడా ఒక చర్య అయినప్పుడు దానికీ ఒక ప్రతిచర్య ఉంటుందని గుర్తించం. ఇలాంటి చర్య ప్రతిచర్యల నిరంతర కొనసాగింపే గతితర్కం.
ఆహార సేకరణ కాలంలో మనిషి కూడా దాదాపు జంతువుల్లానే జీవించాడు. అయితే, మనిషి పరికరాలు, యంత్రాలను సృష్టించి వాటిని విస్తృతంగా వాడడం మొదలు పెట్టాక సమయ పాలన అతన్ని జంతు ప్రపంచం నుంచి పూర్తిగా విడగొట్టేసింది. ఆహార నిద్రా మైథునాలనే శరీర ధర్మాలు, మతం, వాణిజ్యం వంటి సాంస్కృతిక, సామాజిక ధర్మాలతోపాటు శ్రమకు ఎంత సమయాన్ని కేటాయించాలనే అంశం చర్చకు వచ్చింది.
రోజుకు 24 గంటలు అనుకుంటే దాన్ని మూడు భాగాలు చేసి మొదటిదాన్ని శ్రమకు, రెండోదాన్ని సమాజానికీ, మూడోదాన్ని విశ్రాంతికీ కేటాయించాలనే అభిప్రాయం క్రమంగా బలపడింది. ఒక్కోదానికి చెరో ఎనిమిది గంటలు అన్నమాట. 19వ శతాబ్ద ఆరంభ కాలపు సమాజశాస్త్రవేత్త రాబర్ట్ ఒవెన్ ఈ సమాన సమయ విభజనను సిద్ధాంతీకరించాడు అంటారు. ఇందులో సమాజం అనే మాటకు చాలా అర్థాలున్నాయి. తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, మిత్రులు, కళా సాహిత్య అభిరుచులు, రాజకీయ ఆసక్తులు, ప్రేమ, ద్వేషాలు వగైరాలన్నీ ఇందులో ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడే మనిషి సంఘజీవి అవుతాడు.
ఎనిమిది గంటల పని దినాన్ని ఫ్యాక్టరీ యజమానులు ఆమోదించలేదు. ఇప్పటి సుబ్రహ్మణ్యన్, నారాయణ మూర్తిల్లా 16 గంటల పనిదినం అమలు కావల్సిందేనని పట్టుబట్టారు. 1886లో అమెరికా అంతటా ఎనిమిది గంటల పనిదినం డిమాండు చాలా బలంగా ముందుకు వచ్చింది. ఆ ఏడాది మే ఒకటిన ఆల్బర్ట్ పార్సన్స్, ఆగస్టు స్పయీస్ తదితరుల నాయకత్వంలో చికాగో నగరంలో జరిగిన ఉద్యమాన్ని రక్తపాతంతో ముంచెత్తారు. అయినప్పటికీ అది విజయం సాధించింది. ఇప్పుడు ఆ విజయాన్ని బలహీనపరిచి 18 గంటల పనిదినాన్ని పునరుద్ధరించాలన్న వాదనలు మొదలయ్యాయి.
చైనాతో మనం ఏ విధంగానూ పోల్చుకోలేము. పని స్థలానికి సమీపంలోనే అక్కడి ప్రభుత్వం కార్మికులకు నివాసాన్ని ఏర్పాటు చేస్తుంది. దానివల్ల మూడు లాభాలుంటాయి. ప్రయాణ సమయం, వాహనాల ఇంధన ఖర్చు, దేశంలో కాలుష్యం మూడూ తగ్గుతాయి. భారతదేశంలో అలాంటి ఏర్పాటు లేదు.
ఉదాహరణకు హైదరాబాద్‌లో పనిచేయడానికి కొందరు ఇప్పటికీ ప్రతిరోజూ వరంగల్, భూదాన్ పోచంపల్లి నుంచి వస్తుంటారు. కార్యాలయంలో ఎనిమిది గంటల పనిదినం ఎలాగూ తప్పదు. అది మారదు. ప్రయాణ సమయం సులువుగా 6-–7 గంటలు ఉంటుంది. దీని కోసం వాళ్ళు సామాజిక జీవితాన్నయినా కోల్పోవాలి, లేదా విశ్రాంతి సమయాన్ని అయినా కోల్పోవాలి. వెరసి మనిషి ఒక యంత్రంగా మారిపోవాలి. ఇవి ఆ శ్రామికుల జీవితాల్లో అనేక కొత్త సంక్షోభాలను సృష్టిస్తాయి. మనిషిని యంత్రుడుగా మార్చే కపటం కొనసాగుతుంది.
సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర రావు 1947లో రాసిన ‘మాభూమి’ నాటకంలో, నెలల పసిబిడ్డ అయిన తన కొడుకు నిద్రలేవడానికి ముందే ఓ వెట్టి కూలీ పనికి పోతుంటాడు. రాత్రి ఆ పిల్లవాడు నిద్రపోయాక ఇంటికి చేరుతుంటాడు. మెలకువగా ఉండగా తన కొడుకును చూడలేదని నెలల తరబడి వాపోతాడతడు. వర్తమాన ఉద్యోగ సమూహాలు అంతకన్నా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు దీనికి మినహాయింపు కావచ్చు.
కృత్రిమ మేధ (ఏఐ) వచ్చాక లెక్క ప్రకారం మనిషికి పనిభారం తగ్గాలి. విడ్డూరం కాకపోతే ఈ పని గంటలు పెంచడం ఏమిటీ? కృత్రిమ మేధను ఒక బూచిగా చూపించి ఉద్యోగ,- శ్రామిక వర్గాలను మరింతగా లొంగదీసుకోవడానికి మెగా కార్పొరేట్లు కుట్రలు పన్నుతున్నారా? అనే సందేహం ఎవరికయినా రావాలి.
డానీ
సమాజ విశ్లేషకులు