Share News

Hyderabad Stories: నాన్నా నిన్ను చివరిచూపు చూస్తానా

ABN , Publish Date - Aug 08 , 2025 | 01:15 AM

నేను క్షేమం. యుద్ధంలో ఉన్న నీ క్షేమాన్ని కోరటం అత్యాశే అవుతుంది. నిన్ను చూసే, నీతో మనసారా మాట్లాడే అవకాశం నాకెలాగూ లేదు. కనీసం నిన్ను చివరిచూపు చూస్తానో లేదోననే ఆందోళనతో...

Hyderabad Stories: నాన్నా నిన్ను చివరిచూపు చూస్తానా

నేను క్షేమం. యుద్ధంలో ఉన్న నీ క్షేమాన్ని కోరటం అత్యాశే అవుతుంది. నిన్ను చూసే, నీతో మనసారా మాట్లాడే అవకాశం నాకెలాగూ లేదు. కనీసం నిన్ను చివరిచూపు చూస్తానో లేదోననే ఆందోళనతో ఈ బహిరంగలేఖ రాస్తున్నాను. మొన్న నంబాల కేశవరావు అంకుల్‌ను అనాథగా దహనం చేసిన తర్వాత కనీసం నీ పార్థివదేహాన్ని చూడగలననే ఆశ కూడా కోల్పోయాను. నీతో ఇలా సంభాషించవలసి రావటమే అతి పెద్ద విషాదం. గత సంవత్సరం జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో నీవే మరణించావని వార్త పొక్కింది. అది నిజమో, కాదో తేల్చుకోలేక వారం పాటు బాధాతప్త హృదయంతో ఉండిపోయాం. ఎన్‌కౌంటర్‌ వార్త విన్నప్పుడల్లా మా ఇద్దరు పిల్లలు ‘తాత ఎలా ఉంటాడమ్మా’ అని అడుగుతున్నారు. సరిగ్గా నలభై ఏళ్ల కిందట ‘నాన్న ఎలా ఉంటాడమ్మా’ అని నేను మా అమ్మని అడిగిన రోజులు నా స్మృతిపథంలోకి వచ్చాయి. కాలం చూడు ఎలా గడిచిపోయిందో. నీవు అజ్ఞాతంలోకి వెళ్లి యాభై ఏళ్లు గడిచాయి. మొన్న ఎవరో అంటే విన్నాను నీవు, మల్లోజుల కోటేశ్వరరావు, గణపతి అంకుల్‌ మొదటితరం నాయకులని. మీ జీవితంలో మూడోవంతు ప్రజలకు అంకితం చేసారు. ఏ మనిషికైనా ఇలాంటి జీవితం అరుదుగా లభిస్తుంది. స్వాతంత్ర్య పోరాటంలో వీరుల గాథలను పుస్తకాలలో చదివాను. ఇప్పుడు స్వయంగా నా తండ్రే అలాంటి చరిత్రలో భాగమైనందుకు గర్వంగా ఉంది. నేను పుట్టేనాటికే నీవు విప్లవాన్ని ప్రేమించావని అమ్మ చెప్పింది. అంతకు మునుపే నీవు అమ్మను ప్రేమించావు. ఆమె నిన్ను, నీవు కోరుకున్న విప్లవాన్ని ప్రేమించి, పొత్తిళ్లలో ఉన్న నన్ను వదిలివేసి నీతో వచ్చింది. తల్లీ తండ్రీ ఉండి కూడా అనాథలా బతికాను.


నిరాదరణ, ఈసడింపులు జీవితాన్ని వెక్కిరించాయి. దుఃఖం కట్టలు తెంచుకొని నిద్రలేని రాత్రులు నాతో సహవాసం చేశాయి. బంధువులకు భారమైనప్పుడల్లా నేను గూడులేని పక్షినే. ఆరేళ్ల వయసులో అనుకుంటాను నేనున్న చోటుకు సంవత్సరం తర్వాత ఒకరోజు అమ్మ వచ్చింది. నేను అమ్మను గుర్తుపట్టలేదు. యథాలాపంగా నా ఆటలో నేను మునిగిపోయాను. ఆమె నా దరి చేరి అక్కున చేర్చుకొని ‘నేను మీ అమ్మనని’ చెప్పింది. ఈ ప్రపంచంలో ఏ తల్లికి అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. ఇక ఆ తర్వాత అమ్మ కూడా నా దగ్గరకు రావటం తగ్గిపోయింది. నేను అక్షరాలు నేర్చుకుంటున్న సమయంలోనే నా బాగోగులు చూసుకుంటున్న వారిని వదిలి మరో చోటుకు పంపించారు. హాయిగా అమ్మ ఒడిలో నిద్రించవలసిన వయసు, చందమామ కథలు వినవలసిన సమయం, గోరుముద్దలు తినవలసిన కాలంలో బతుకు చితికి, కన్నీళ్లు మింగాల్సివచ్చింది. బాలకార్మికురాలి పాత్రలోకి జీవితం తర్జుమా అయింది. ఉదయాన్నే నిద్రలేచి, నా వయసుకు తగని పనులు చేసి, అప్పటికే అలసిపోయి బడికి వెళ్లేదాన్ని. కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర నాకు చాలా దూరంగా ఉండిపోయాయి. పారిపోవాలని ఉండేది కానీ గమ్యం తెలియదు. చనిపోవాలని అనిపించేది కానీ మార్గం తెలియదు. అప్పుడప్పుడు ఊళ్లోకి వచ్చే నీ సహచరులు కనుక్కునే యోగక్షేమాలే నాకు లభించే ఊరట. ఇంటర్మీడియట్‌ చదువుకునే రోజుల్లో డాక్టర్‌ కావాలని ఉండేది కానీ, నాకు సరైన దారి దొరకలేదు సరికదా దారిచూపేవాళ్లూ లేరు. అప్పుడనిపించింది. అందరిలాగా నాకు అమ్మానాన్న ఉంటే ఇష్టమైన చదువు దొరికేది కదా! అని. అంతిమంగా నావి అస్థిరమైన వానాకాలం చదువులయ్యాయి. నా ప్రమేయం లేకుండానే నేను ఉండే స్థలం, చదువు నిర్ణయం జరిగి మారుతుండేవి. అలా హైదరాబాద్‌ నగరానికి మారిపోయాను. లక్షలాది మంది అనాథలను, వలస కార్మికులను తన ఒడిలో చేర్చుకున్న ఈ నగరం నాకింత చోటిచ్చింది. కాస్త జీవితాన్నిచ్చింది. కొంత జ్ఞానానిచ్చింది. కొత్త స్నేహాలు, రాజకీయాలు, సామాజిక చలనాలు, ఆచరణ, అధ్యయనం నాకింత మనోధైర్యాన్ని ఇచ్చాయి. ప్రపంచం అర్థమయ్యేకొద్దీ సాంత్వన లభించింది. సరిగ్గా ఈ సమయంలోనే నా జీవితాన్ని అల్లకల్లోలం చేసిన పిడుగులాంటి వార్త విన్నాను.


చంటి పిల్లగా నన్ను వదిలేసిపోయిన మా అమ్మ ఎన్‌కౌంటర్‌ అయింది (ఆగస్టు 13, 1998). అది జరిగిన నెల రోజులకు నాకు ఆ విషయం తెలిసింది. అనాథ శవంగా మా అమ్మ మిగిలిపోయింది. ఆమెను ఎవరో ఖననం చేసారు. పిచ్చిదానిలా హైదరాబాద్‌ రోడ్లు పట్టి తిరిగాను. రాత్రి, పగలని తేడా లేకుండా సంచరించాను. నిద్రాహారాలు మాని దుఃఖాన్ని ఆశ్రయించాను. ఒంటరిదాన్ని అయిపోయాను. కనిపించని శత్రువుతో మౌనంగా యుద్ధం చేసాను. తండ్రి ఉండీ రాలేడు. తల్లి మరణించింది. ఈ జీవితం ఎందుకని ఎన్నిసార్లు అన్పించిందో! ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో సీటురావటం నా జీవితానికి చుక్కానిలా అన్పించింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావటం వలన మామూలు మనిషిని కాగలిగాను. కానీ నేను పెళ్లి చేసుకున్న రోజు నీవు నా పక్కన ఉంటే ఎంత బాగుండునో కదా! నీ మనుమరాలు నా కడుపులో పడినప్పుడు ఈ వార్త నీతో చెప్పాలని ఎంత ఆశపడ్డానో. అందరు స్త్రీల వలె తల్లిదండ్రుల చేతుల మీదుగా నాకు సీమంతం జరగాలని ఎన్నిసార్లు అన్పించిందో. బాలింత వాసన తీరకముందే నా బిడ్డకు నేనే స్నానం చేయించుకోవలసి వచ్చింది. నీ చేతుల్లో ఆడుకోవాలని, నీ భుజాల మీద కూర్చోవాలని, నీ వేలు పట్టి నడవాలని ఎన్నోసార్లు కోరుకున్నాను. కనీసం నా పిల్లలనైనా నీవు ఎత్తుకుంటే చూసి మురిసిపోవాలని భావించాను. డియర్‌ నాన్న, నేను కోరుకున్నవేవీ జరగలేదు, జరుగుతాయనే నమ్మకం లేదు. కానీ నీవు, నీ సహచరులు క్షేమంగా ఉండాలని, నీకు ఏ ప్రమాదం జరగకూడదని బిడ్డగా నా కోరిక. నీవు కోరుకున్న పోరాటం జయాపజయాలతో నిమిత్తం లేకుండా, విరామమెరుగని నీ ప్రయాణంలో ‘మా నాన్న హీరోనే’నని నా పిల్లలకు చెప్పే రోజొకటి ఉంటుందని మాత్రం చెప్పగలను. నీవు మల్ల రాజిరెడ్డివో, మీసాల రాజన్నవో, సాయన్నవో, సంగ్రాంవో, మురళివో నాకు తెలియదు. నాకు మాత్రం బాపువే. ప్రేమతో

స్నేహలత మల్ల

ఇవీ చదవండి:

ఫ్లాట్ కొనడమంటే అతిపెద్ద ఆర్థిక తప్పిదం.. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధిపతి వార్నింగ్

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

Read Latest and Business News

Updated Date - Aug 08 , 2025 | 01:15 AM