హిందువులకు మార్గదర్శకులు ఎవరు?
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:48 AM
హిందూ సమాజానికి సూచనలు, ఆదేశాలు ఇచ్చే అధికారం ఎవరిది అనే విషయంపై గత కొన్ని రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. హిందూ సాంస్కృతిక సంస్థగా చెప్పబడే ఆర్‌ఎస్‌ఎస్ అధినేత ఒక ముఖ్య...

హిందూ సమాజానికి సూచనలు, ఆదేశాలు ఇచ్చే అధికారం ఎవరిది అనే విషయంపై గత కొన్ని రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. హిందూ సాంస్కృతిక సంస్థగా చెప్పబడే ఆర్‌ఎస్‌ఎస్ అధినేత ఒక ముఖ్య సూచనను ఇచ్చాడు. ప్రతి మసీదు వెనుక ఒక శివలింగాన్ని వెతకవద్దు అని హిందూ సమాజానికి, స్థానిక నాయకులకు ఒక సూచన ఇచ్చాడు. భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదగాలని, అది అందరూ కలిసి ఉన్నప్పుడే సాధ్యమవుతుందని చెప్పాడు. అలాగే మరొకచోట మాట్లాడుతూ మతం పేరిట గతంలో ఎన్నో హింసలు, ఘోరాలు అత్యాచారాలు జరిగాయి. అవన్నీ మతం స్వరూపంపై, ధర్మం అంటే ఏమిటి అనే విషయంపై అవగాహన లేక జరిగిన ఘోరాలు అని వ్యాఖ్యానించాడు. మత గ్రంథాలపై మానవ విలువల వెలుగులో సరైన వ్యాఖ్యల్ని తీసుకురావాలని కూడా చెప్పాడు.
పై సూచనపై ప్రముఖ మతాచార్యులు తీవ్రంగా స్పందించారు. హిందూ మతాన్ని గూర్చి సమాజానికి ఆదేశాలు ఇచ్చే అధికారం తమకే ఉన్నదని, సామాజిక సంస్థల నేతలకు లేదని చెప్పారు. ‘మేం అతనికి ఆదేశాలిస్తాము, అతను మాకు ఇవ్వడం కాదు,’ అంటూ ఇంకా కొంత తీవ్రంగా, ఆ నేత తుష్టీకరణ విధానానికి లొంగిపోయాడని, నాయకుడు కావాలనే ఆశతో ఉన్నాడని కూడా ఆరోపించారు. ఈ ఇద్దరూ హిందూ పక్షపాతులే. వారివి కేవలం భిన్న అభిప్రాయాలు కావచ్చు లేదా మరి ఎవరికైనా సంకేతం కావచ్చు. ఆ విషయంలోకి పోకుండా వారి మాటలను కేవలం ఒక చర్చ విషయంగా తీసుకొని విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను.
ఇంతకూ ఆర్ఎస్ఎస్ నేత మాట్లాడినది ఏమిటి? స్థానిక నాయకులు సంయమనం పాటించాలని, అత్యుత్సాహానికి పోకూడదని చెప్పారు. కొత్త అంశాలని లేవనెత్తవద్దని ఆయన చెప్పడం స్పష్టంగా ఉంది. ఇదివరకే వివాదంలోనూ, చర్చల్లోనూ ఉన్న విషయాలను వదిలి కొత్త విషయాల్ని పెంచుకుంటూ పోతే అనేక చోట్ల ఘర్షణ వాతావరణం పెరుగుతుంది. దేశంలో ప్రతి మసీదు వెనుక ఒక దేవాలయం ఉన్నదని ఆందోళన చేస్తే దేశం వాతావరణం మొత్తం కలుషితమవుతుంది. దేశం ఆర్థికంగా ప్రగతి సాధించాల్సిన సమయంలో అంతర్గత సమస్యలను పెంచుకుంటూ పోతే అది భారతదేశాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్న శక్తులకు సహాయం చేసినట్లు అవుతుంది. వారికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్లు అవుతుంది.
ఆర్ఎస్ఎస్ నేత ఇచ్చిన రెండవ సలహా అన్ని మతాలకు అన్వయించేది. చరిత్రలో ఘోరాలు, నరమేధాలు చేసి; ప్రపంచమంతా తమ మతం మాత్రమే ఉండాలని శాశ్వత అజెండా ఉన్న మతాలు హిందూ మతాన్ని నిర్మూలించాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలుసు. హింసను ప్రోత్సహించే విధంగా తమ మత గ్రంథాలను అర్థం చేసుకున్నారని, మతం స్వరూపాన్ని, భగవంతుని స్వరూపాన్ని అర్థం చేసుకొని తమ గ్రంథాలను వ్యాఖ్యానించి ఆచరించాలని ఆయన సూచన. హిందూ సమాజానికి కూడా పై సూచన వర్తిస్తుంది. హిందూ సమాజంలో నరమేధాలు లేకపోయినా కొన్ని వర్గాల వారిని సామాజికంగా దూరం పెట్టడం అనే మానసిక హింస ఉంది. ఒకనాడు ఏ కారణాల వల్ల సమర్థించుకున్నా అలాంటి వివక్షకు ఈనాటి మానవ విలువలు పూర్తిగా వ్యతిరేకం. ఈ విషయంలో హిందూ మతాచార్యులు ఆలోచించాలని కూడా ఆయన మాటకు అర్థం.
పై చర్చ వల్ల సామాన్య హిందువు మనసులో ఒక ప్రశ్న వస్తుంది. హిందూ సమాజానికి సూచనలను ఇచ్చే అధికారం ఎవరికి ఉంది? కేవలం ధర్మాచార్యులే ఇవ్వాలా, మరి ఎవరికీ అధికారం లేదా? సమాజ శ్రేయస్సు గురించి ఎవరు సలహా ఇచ్చినా అది ధర్మమే అవుతుంది. సమాజానికి హాని కలిగించే ప్రయోగాల్ని ఎవరు చేసినా అది అధర్మమే అవుతుంది. దీర్ఘకాలికంగా దేశానికి మేలైన మార్గం ఏమిటి అని ఆలోచించే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంది.
ధర్మసూక్ష్మాలను కేవలం ధర్మాచార్యులే చెప్పగలరా మరి ఎవరికీ అధికారం లేదా అన్న విషయంపై భారతంలోనే రెండు కథలు ఉన్నాయి. ఒకటి కౌశికుడు అనే బ్రాహ్మణుడు ధర్మవ్యాధుడు అనే కటికవాడి వద్దకు వెళ్లి ధర్మాన్ని గూర్చి తెలుసుకోవడం. మరొకటి శాంతి పర్వంలోనిది. గొప్ప తపస్సు చేసిన జాజలి అనే బ్రాహ్మణుడు తులాధారుడు అనే ఒక సాధారణ వర్తకుడి వద్దకు వెళ్లి ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవడం. ఏదైనా ఒక సందర్భంలో మనం చేయాల్సిన పని ధర్మబద్ధమో కాదో తెలుసుకోవాలంటే ఎవరో ఆచరించిన విధానాన్ని అనుసరించడం కాకుండా మనం మన బుద్ధితో విచారించి ధర్మాన్ని నిర్ధారించుకోవాలని తులాధారుడు చెప్తాడు. ఇలాంటి ఉదాహరణలు పురాణాల్లోనూ అనేకాలు ఉన్నాయి. అందువల్ల ఎవరి పరిధి ఎంతవరకు ఉన్నది అని పరిమితిని విధించలేము. ప్రతి ఒక్కరికి ఆలోచించి విమర్శించే అధికారం, అవకాశం ఉన్నాయి. అందువల్లే 14వ శతాబ్దంలోనే వచ్చిన ‘సర్వదర్శన సంగ్రహం’ అనే పుస్తకంలో ఆనాటి హిందూ సమాజంలో 16 దర్శనాలు (Schools of thought) ఉన్నట్లు చూడగలం. హిందూ ధర్మాచార్యులు కొత్త వివాదాల్ని సమర్థించడం వల్ల సమాజం ఒకటవుతుందని భావిస్తున్నారా అని ఆలోచించాలి. నిజానికి హిందూ సమాజం వీరితో ఉందా అన్నది కూడా ఒక ప్రశ్న. ఇలాంటి చర్యల వల్ల హిందూ సమాజంలోనే చాలామంది వీరికి ఇదివరకే దూరంగా ఉన్నారు, మరికొందరు దూరమయ్యే పరిస్థితి ఉంది. హిందూ ఐక్యత జరగకపోగా మిగతా వర్గాల వారిని ఏకం చేసినట్లు అవుతుంది. మతాచార్యులు దీన్ని కూడా ఆలోచించాలి.
హిందూ ధర్మాచార్యులు చేయగలిగిన, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. హిందూ ఐక్యత దేశ రక్షణకు, దేశ సమగ్రతకు ఎంత అవసరమో ప్రజలకు తెలపాలి. దేశంలో ఘర్షణ వాతావరణం లేకుండా, దేశ సమగ్రతకు భంగం కాకుండా హిందువుల ఐక్యత ఉన్నప్పుడు, హిందువులు తమ సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు ఇతర వర్గాలు వారు కూడా తమ మత స్వతంత్రాన్ని కలిగి భయం లేకుండా కలిసి ఉండవచ్చు.
అన్నింటికన్నా ముఖ్యంగా హిందూ ఆచార్యులు చేయగలిగిన పని హిందూ మతంపై వచ్చిన అనేక విమర్శలకు సమాధానాలు చెప్పడం. ఉదాహరణకు సనాతన ధర్మం అంటేనే కులం అని అందరి మనసులో నాటుకొని ఉన్నప్పుడు హిందువులు ఎందుకు మతాచార్యుల వెంట ఉండాలి? సనాతన ధర్మానికి కులానికి సంబంధం లేదు. సనాతన ధర్మం కులాన్ని సృష్టించినట్లు మన పుస్తకాలు అన్నింటినీ తిరగవేసినా ఎక్కడా కనిపించదు. కేవలం మనిషి స్వభావాన్ని బట్టి నాలుగు వర్ణాలను చెప్పారు కానీ సమాజంలో ఉన్న వేలకొద్దీ కులాల గురించి ఎవరూ చెప్పలేదు. మనుస్మృతిలో ఉంది కదా అని అడగవచ్చు. మనువు కాలానికే సమాజం చాలా అభివృద్ధి చెందింది. ఈనాడు సమాజంలో ఉన్న అన్ని రకాల లిటిగేషన్లు, వ్యాజ్యాలు అప్పుడు కూడా ఉన్నాయి, అందులో వివరింపబడ్డాయి కూడా. వర్ణసంకరం వల్ల పుట్టిన వారిని అదివరకే ఉన్న కులాలలో మనువు చేర్చాడు. అంతేకానీ అతను కొత్త కులాలను సృష్టించలేదు. బ్రాహ్మణులు కులాన్ని సృష్టించలేదనే విషయాన్ని అంబేడ్కర్ స్వయంగా చెప్పాడు. ఏ ఋషి కూడా కులాన్ని సృష్టించలేదు. మనుషుల్ని నిలబెట్టి నీవు ఆ పని చేయి, నీవు ఈ పని చేయి, నువ్వు గుడ్డలు నేయాలి, నువ్వు ఉతకాలి అంటూ ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు. సమాజం అవసరాల్ని బట్టి ఏర్పడినవి కులాలు. హిందూ ధర్మాచార్యులు ఈ విషయాన్ని స్పష్టం చేయాలి. కుల ఆచారాల్ని వదలమని చెప్పాల్సిన పనిలేదు, కులాల సృష్టికి మతంతో సంబంధం లేదని మాత్రం చెబితే చాలు.
ముఖ్యమైన వివాదాస్పద విషయాలపై, సమాజంలో పేరుకుపోయిన సందేహాల గురించి ధర్మాచార్యులు సమాధానం చెబితే హిందువుల్లో ఐక్యత దానంతట అదే వస్తుంది. కులాల విషయంలో ప్రభుత్వాల పాలసీ ఎలా ఉన్నా మతాచార్యులకు అనవసరం. రాజకీయ పార్టీలు తమ అవసరాలకు కులాన్ని వాడుకోవచ్చు. ధర్మాచార్యులు మాత్రం వైదిక సిద్ధాంతంలో ఉన్న విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెబితే చాలు. అంతేకాక విద్యావంతులు ఎవరైనా ధర్మాన్ని గురించి విశ్లేషించి వ్యాఖ్యానించే సంప్రదాయం మన సమాజంలో ఉంది. అలాంటి స్వేచ్ఛ ఉండడం మన సంస్కృతి గొప్పదనం. దానికి మనం గర్విద్దాం.
కె. అరవిందరావు
మాజీ డీజీపీ