Share News

When Fear Dies Corruption Thrives: భయం చచ్చిపోతే అవినీతి బరితెగిస్తుంది

ABN , Publish Date - Nov 02 , 2025 | 01:45 AM

ఒక సీనియర్ పోలీసు అధికారి ఎప్పుడు అవినీతి పరుడవుతాడు? సమాధానం– ‘అతనికి భయం లేకపోతే.’ అవినీతి లాభదాయకమని తెలిసినప్పుడు. తనను ఎవరూ పట్టుకోలేరని నమ్మినప్పుడు. తనను...

When Fear Dies Corruption Thrives: భయం చచ్చిపోతే అవినీతి బరితెగిస్తుంది

ఒక సీనియర్ పోలీసు అధికారి ఎప్పుడు అవినీతి పరుడవుతాడు? సమాధానం– ‘అతనికి భయం లేకపోతే.’

అవినీతి లాభదాయకమని తెలిసినప్పుడు. తనను ఎవరూ పట్టుకోలేరని నమ్మినప్పుడు. తనను రక్షించేవారు ఉన్నారని తెలిసినప్పుడు. తన భాగస్వాములు తనకు భయపడతారని, చట్టానికి కాదు అని తెలిసినప్పుడు. తనను ఎవరూ బహిర్గతం చేయలేరని, ఎందుకంటే తాను వారి రహస్యాలను కూడా బయటపెట్టగలడని తెలిసినప్పుడు– అప్పుడు తెగులు ప్రారంభం అవుతుంది.

ఒకసారి అవినీతి మొదలైతే, అది మౌనంగా వ్యాపిస్తుంది. ఇటీవల ఒక డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) అవినీతిలో పట్టుబడి జైలులో ఉండటం ప్రజల నమ్మకాన్ని మరోసారి కుదిపేసింది. ఇతను ఇంతకాలం, అంత ఎలా దాచుకున్నాడు కాదు. అసలైన ప్రశ్న– ఇతని గురించి ఎంతమందికి మందికి తెలుసు? ఎవరెవరు లాభపడ్డారు?

పోలీసు వ్యవస్థలో ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాలు ఉన్నా, ఇంత పెద్ద అవినీతి ఎవరికీ తెలియకపోవడం నమ్మశక్యం కాదు. కానీ హోదాలు శాసించే వ్యవస్థలో, మౌనం ఆధారంగా నడిచే వ్యవస్థలో అవినీతి గురించి తెలియడం, దానికి వ్యతిరేకంగా చర్య తీసుకోవడం చాలా భిన్నమైన విషయాలు.

అవినీతిపరుడు ఒంటరిగా కాదు, మౌనంగా సహకరించే వారి మధ్యలో జీవిస్తాడు. అతని సహచరులు లంచాలు పంచుకోకపోయినా, మౌనం పంచుకుంటారు. అతని సీనియర్లు అతని లోభాన్ని నమ్మకపోయినా, ప్రశ్నించకుండా ఉండటానికి ఇష్టపడతారు. జూనియర్‌లు చూస్తారు, నేర్చుకుంటారు– నిజాయితీ అనేది లాభదాయకమైంది కాదని భావిస్తారు. క్రమంగా ఒక ప్రమాదకరమైన అంచనాకు వస్తారు– వ్యవస్థలో అవినీతి మినహాయింపు కాదు, వ్యవస్థాగత యంత్రం నడవడానికి కందెన అనే నమ్మకం ఏర్పడుతుంది. అందుకే ఒక సీనియర్ అధికారి అవినీతి సొమ్ముతో దొరికిపోయినప్పుడు కలిగే విభ్రాంతి చాలా కృత్రిమంగా ఉంటుంది. పోలీస్ వ్యవస్థలో పనిచేసే వారందరికీ తెలుసు, అవినీతి దారితప్పిన వ్యక్తిది కాదు, అది లోతుగా వ్యాపించిన వ్యాధి అని.


ఐపీఎస్‌ను ‘ఎలైట్’ సర్వీస్‌గా పిలుస్తారు. నిజంగా చాలా మంది అధికారులు ధైర్యంగా, నిజాయితీగా పని చేస్తారు. అందుకు చాలా మూల్యం కూడా చెల్లిస్తారు. కానీ ఈ ‘ఎలైట్’ అనే పదం కొందరికి రక్షణ కవచంగా మారింది. చట్టానికి అందనంత దూరంలో ఉన్నట్లు భావిస్తారు. రాజకీయ సంబంధాలు, బ్యూరోక్రటిక్ శక్తి, అనుచరుల విశ్వాసం కలగలిపి వారికి రక్షణ కవచం ఉన్నట్లు భావన కలిగిస్తుంది. బదిలీలు మేనేజ్ చేయవచ్చు, విచారణలు ఆలస్యం చేయవచ్చు, ఫైళ్లు మాయమవుతాయి. పర్యవేక్షణ వ్యవస్థలు తప్పు చేసిన వారిని జవాబుదారీ చేయడం కంటే కాపాడడానికే ఉపయోగపడతాయి. ఈ విధంగా శిక్షల నుంచి రక్షించే వలయం ఏర్పడుతుంది.

ఒక ఆరోగ్యకరమైన వ్యవస్థలో రెండు రకాల భయాలు ఉంటాయి– తప్పు చేయడం అంటే భయం... పట్టుబడడం అంటే భయం. ఇవి రెండూ లేకపోతే, అవినీతి తప్పనిసరిగా విజృంభిస్తుంది. నాయకత్వ స్థాయిలో ఉన్న చాలామందికి ఈ భయాలు పోయి చాలా కాలమైంది. రాజకీయ ప్రాబల్యం ఒక రక్షణ వలయం వారికి. వ్యవస్థీకృత జడత్వం ఇంకొక రక్షణ వలయం. నిశ్శబ్దంగా లేక పంచుకున్న అవినీతి వల్ల సహకరించేవారు ఈ రక్షణ వలయాన్ని పూర్తి చేస్తారు. వ్యవస్థను తప్పుదారి పట్టించగలను, దర్యాప్తును ప్రభావితం చేయగలను, విచారణను తొక్కి పెట్టగలను అని అధికారి భావించినంత కాలం, నీతిగా ఉండడం అనేది వీలైతే పాటించే ఒక సుగుణం.

ఒక సీనియర్ అధికారి పట్టుబడితే, అది కేవలం అతని పరాభవమే కాదు– మొత్తం పోలీసు వ్యవస్థపై మచ్చ. నిజాయితీపరులైన వందలాది అధికారుల విశ్వసనీయతను అది బలహీనపరుస్తుంది. ప్రజలు పోలీసులను రక్షకులుగా కాకుండా, యూనిఫామ్‌లో ఉన్న వేటగాళ్లుగా చూస్తారు. నిజాయితీ గల ఒక కానిస్టేబుల్ లేదా ఎస్పీ తాము ఒంటరివాళ్లమై పోయామని భావిస్తారు. అవినీతి పై నుంచి కిందికి పాకుతుంది– హెడ్‌క్వార్టర్స్ నుంచి వీధిలోని రోజువారీ మామూళ్లు వసూలు చేసే బీట్ కానిస్టేబుల్ వరకు. అవినీతిని మౌనంగా భరిస్తే చెల్లించే మూల్యం కేవలం డబ్బులో కాదు– దిగజారే మనోబలంలో ఉంటుంది.


ఒకరిని సస్పెండ్ చేయడం లేదా అరెస్ట్ చేయడం సరిపోదు. వ్యవస్థను శుద్ధి చేయాలంటే లోతుగా చూడాలి– అవినీతికి సహకరించిన నెట్‌వర్క్‌లు, మౌనంగా ఉన్న అధికారులు, లాభపడిన రాజకీయ నాయకుల వైపు చూడాలి. స్వతంత్ర విజిలెన్స్, స్వేచ్ఛతో కూడిన విచారణలు అవసరం. పోలీస్ విభాగంలో ఉన్న విజిల్‌ బ్లోయర్లకు రక్షణ అవసరం. బదిలీలను రాజకీయ ప్రభావం నుంచి రక్షించాలి.

అత్యంత ముఖ్యంగా– పోలీస్ వ్యవస్థలో చట్టం పట్ల భయాన్ని పునరుద్ధరించాలి, రాజకీయ నాయకులు అంటే కాదు. పదవులు, హోదాలు అవినీతిపరులను రక్షించలేవనే విశ్వాసాన్ని కలిగించాలి. పట్టుబడడం అంటే పరువు పోవడమని, బేరసారాలకు తలుపులు తెరవడం కాదని తెలియజెప్పాలి. అప్పుడు మాత్రమే అతను తీసుకునే ప్రమాణం– ‘‘భయమూ, పక్షపాతం లేకుండా సేవ చేయడం’’– అర్థవంతమవుతుంది.

భయపడడానికేమి లేదని ఒక సీనియర్ అధికారి భావిస్తే, అవినీతి అనివార్యం అవుతుంది. వ్యవస్థ తనను జవాబుదారీ చేస్తుందని నమ్మితే, నిజాయితీ తిరిగి వస్తుంది. ఏది ఎంచుకుంటామనేది మన చేతుల్లోనే ఉంది– మౌనంగా ఉండడమా లేక ధైర్యంతో ఎదుర్కోవడమా? మౌన అంగీకారమా లేక మనస్సాక్షితో ప్రశ్నించడమా. ఎందుకంటే చట్టాన్ని అమలు చేసేవారు దానికి భయపడకపోతే, ఆ చట్టానికి అర్థమే ఉండదు.

డా. కిరణ్ బేడీ

తొలి మహిళా ఐపీఎస్ అధికారి

అనువాదం: ప్రొఫెసర్‌ మురళి కర్ణం (నల్సార్‌)

ఈ వార్తలు కూడా చదవండి...

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2025 | 01:45 AM