Share News

ధాత్రికి దాపురించిన పాడుకాలం!

ABN , Publish Date - Jan 31 , 2025 | 02:19 AM

డొనాల్డ్‌ ట్రంప్‌ తాను ఆశించింది చేశారు, మనం ఊహించిందే పూర్తి చేశారు. లక్షలాది మైళ్ల దూరం నుంచి, ఆ నడి రాత్రి ట్రంప్‌ విజయ గర్వంతో ఆర్భాటంగా తన దేశాన్ని పారిస్‌ ఒడంబడిక...

ధాత్రికి దాపురించిన పాడుకాలం!

డొనాల్డ్‌ ట్రంప్‌ తాను ఆశించింది చేశారు, మనం ఊహించిందే పూర్తి చేశారు. లక్షలాది మైళ్ల దూరం నుంచి, ఆ నడి రాత్రి ట్రంప్‌ విజయ గర్వంతో ఆర్భాటంగా తన దేశాన్ని పారిస్‌ ఒడంబడిక నుంచి వైదొలిగింపచేసేందుకు ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వుపై సంతకం చేయడాన్ని, వీక్షించాను. ‘ఈ నిర్ణయంతో, లక్షల కోట్ల డాలర్లను ఆదా చేసుకోనున్నా’ మని హర్షధ్వానాలు చేస్తున్న తన అభిమానుల నుద్దేశించి అమెరికా కొత్త అధ్యక్షుడు అన్నారు.

హరిత ఉద్యమాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ట్రంప్‌ గతంలో కంటే ఇప్పుడు మరింత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాతావరణ మార్పుతో సంభవిస్తున్న విధ్వంసం ఎల్లెడలా ప్రతి ఒక్కరి అనుభవంలోకి వస్తోన్న రోజులివి. ట్రంప్‌ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఆనవాయితీ ప్రకారం కాంగ్రెస్‌ భవనం వెలుపల లక్షలాది ప్రజల సమక్షంలో కాకుండా లోపల జరిగింది. చలిగాడ్పులు ప్రచండంగా ఉండడమే అందుకు కారణం. ఉత్తర ధ్రువ ప్రాంతాలలో సుడిగాలులు మరింత చంచలమై అమెరికా పశ్చిమ తీర ప్రాంతాలను బలంగా తాకాయి. ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవం సమయంలోనే లాస్‌ఏంజెలెస్‌లో సంపన్నుల, సెలెబ్రిటీల విశాల హర్మ్యాలు దావానలంలో మాడి మసి అయిపోతున్నాయి. ప్రతి ప్రాంతమూ, సామాన్యులూ సంపన్నులూ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రకృతి విపత్తులకు గురవుతుండగా వాతావరణ మార్పు అనేది ఒక మిథ్య అని వాదించడంలో విజ్ఞత ఏమైనా ఉన్నదా? ఠాఠ్‌, వాతావరణ మార్పు ఒక అభూతకల్పన అని ట్రంప్‌ మహాశయుడు ఘోషిస్తున్నాడు. ఆయనకు ఓటు వేసినవారిలో అత్యధికులు సైతం ఆయన వాదనతో ఏకీభవించేవారే.


వాతావరణ మార్పు అనే పదం ట్రంప్‌ రాజకీయ పరిభాషలో లేనే లేదు. అది రాజకీయంగా సరైన భావన కాదు అనేది ఆయన సునిశ్చిత విశ్వాసం. ట్రంప్‌ వైఖరికి మరో బలమైన కారణమున్నది. శిలాజ ఇంధనాల వాడకం పెరగాలని, విదేశాలకు తరలి పోయిన తయారీ రంగ పరిశ్రమలను మళ్లీ స్వదేశానికి తీసుకురావాలనేది ఆయన లక్ష్యం. ‘డ్రిల్‌, బేబీ, డ్రిల్‌’కు వ్యతిరేకత అనేది లేకుండా పోవాలంటే వాతావరణ మార్పు అంశాన్ని పూర్తిగా తిరస్కరించి తీరాలని ట్రంప్‌ విశ్వసిస్తున్నారు. స్వచ్ఛ ఇంధనానికి పరివర్తన ప్రణాళికలను నిరోధించేందుకు అమెరికాలో లభ్యమయ్యే సహజ వాయువును సమస్త దేశాలకు సరఫరా చేయాలని ట్రంప్‌ భావిస్తున్నారు. అధిక సుంకాల భారం పడకుండా ఉండాలంటే తమ సహజవాయువును యూరోపియన్‌ దేశాలు కొనుగోలు చేయవలసిందేనని ట్రంప్ నిర్దేశిస్తున్నారు. అలాగే ఇంటర్నల్‌ కంబస్టియన్‌ ఇంజిన్‌ (అంతర్దహన యంత్రం) వాహనాలను మళ్లీ రంగంలోకి తీసుకురావాలని ట్రంప్‌ ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నారు. ఆ వాహనాల సాంకేతికతలు, తయారీలో అమెరికా అగ్రగామిగా ఉండడమే ట్రంప్‌ను అందుకు పురిగొల్పుతోంది విద్యుత్‌ వాహనాల రంగంలో చైనా అగ్రగామిగా ఉందన్న వాస్తవాన్ని ట్రంప్‌ విస్మరించలేరు. మొత్తం మీద అంతర్జాతీయ వాణిజ్యం, ప్రపంచ రాజకీయాలు అమెరికా ఆధిపత్యం, పెత్తనంలో ఉండాలనేది ఆయన అభిమతం. ప్రపంచ దేశాలు, వాటి వాణిజ్యంపై అమెరికా ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు ఆయన ఆరంభించిన చరిత్రాత్మక పోరాటంలో వాతావరణ మార్పును నిరోధించడమనేది ఒక అప్రధాన విషయమే.


ట్రంప్‌ ప్రతికూల వైఖరితో వాతావరణ మార్పుపై పోరుకు చాలా హాని వాటిల్లుతుంది. అసలు భూ ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమైన హరిత గృహ వాయు (జిహెచ్‌జి) ఉద్గారాలకు ఇతోధికంగా దోహదం చేసింది, చేస్తోంది అమెరికాయే కాదూ? ఈ వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. వర్తమానంలోనే కాదు, చారిత్రకంగా కూడా భూతాపం పెరుగుదలలో ప్రధాన బాధ్యత అమెరికాదే. ఇప్పుడు జిహెచ్‌జి కాలుష్యం వెనుక ప్రథమ స్థానంలో చైనా ఉండగా ద్వితీయ స్థానంలో అమెరికా ఉన్నది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ పాలనలో 2030 సంవత్సరానికల్లా కాలుష్యకారక వాయు ఉద్గారాలను 50– 52 శాతం తగ్గించేందుకు, 2035 నాటికి 61–66 శాతానికి తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఇప్పుడు ట్రంప్‌ అసలు ఆ అంశాలను పరిగణనలోకే తీసుకోవడం లేదు.

బైడెన్‌ హయాంలో వాతావరణ మార్పుపై పోరులో అమెరికా సరైన మార్గంలో ఉందని నేను చెప్పబోవడం లేదు. నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా తన కాలుష్యకారక వాయు ఉద్గారాలను చాలా తక్కువగా మాత్రమే తగ్గించింది. అయితే మరింత ఎక్కువగా తగ్గించేందుకు హామీ ఇవ్వడమే కాకుండా అందుకు నిబద్ధతతో వ్యవహరిస్తుంది కూడా. హరిత ఒప్పందాల అమలు సాధ్యమయ్యేందుకు ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం (ఐఆర్‌ఎ) విశేషంగా తోడ్పడింది. పునరుద్ధరణీయ ఇంధనం, విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంపొందించేందుకు బైడెన్‌ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ట్రంప్‌ రెండోరాకడతో ఇదంతా మారిపోయింది. వచ్చిన రెండు రోజులలోనే అమెరికా వ్యాప్తంగా ఇంధన అత్యవసర పరిస్థితిని విధించారు.


ట్రంప్‌ విధానాల ఫలితంగా కాలుష్యకారక వాయు ఉద్గారాలు మరింతగా తప్పక పెరుగుతాయి. అమెరికా ఉద్గారాలు 2005లో గరిష్ఠ స్థాయిలో రికార్డయ్యాయి. వస్తూత్పత్తి పరిశ్రమలను మళ్లీ స్వదేశానికి తీసుకువచ్చి ఉద్యోగాల కల్పనను పెంపొందిస్తానని ట్రంప్‌ పదే పదే చెబుతున్నారు. అదే జరిగినప్పుడు జిహెచ్‌జి ఉద్గారాలూ పెరుగుతాయి.

సరే, కృత్రిమ మేధ అభివృద్ధి, పర్యవసానాలనూ విస్మరించలేము. డేటా సెంటర్లకు విద్యుత్‌ ఇతోధికంగా అవసరమవుతుందని అంచనా. ఈ విద్యుత్‌ను శిలాజ ఇంధనాల నుంచే ఉత్పత్తి చేయాలనది ట్రంప్ నిర్దేశం. ట్రంప్‌ పునరాగమనం శుభకర పరిణామమేమీ కాదు. ఇప్పటికే కాలుష్యకారక వాయు ఉద్గారాల తగ్గింపునకు సంకోచిస్తున్న వివిధ దేశాల ప్రభుత్వాలు ట్రంప్‌ స్ఫూర్తితో శిలాజ ఇంధనాల వాడకాన్ని పెంచేందుకు సానుకూలమవుతాయి. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు శిలాజ ఇంధనాలపై ఆధారపడటం మరింతగా పెరుగుతుంది. ఇదంతా నిరుత్సాహాన్ని కలిగిస్తోంది కదూ. అయితే ఒక ఆశారేఖ లేకపోలేదు. సకల దేశాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వాతావరణ మార్పు ప్రభావాలను నెదుర్కొనేందుకు సమష్టిగా చర్యలు చేపట్టాలి.


దీనివల్ల ప్రకృతి ఉత్పాతాల తీవ్రత తగ్గిపోగలదు. మన మనుగడకు ఈ భూమి తప్ప మరో గ్రహం లేదు. ఈ భూమిని మన నివాసానికి అనుకూలంగా కాపాడుకోవడమే మన ముందున్న మార్గం. అయితే ట్రంప్‌ యుగంలో అదెలా సాధ్యమవుతుంది? దీనిపై చర్చను మనం కొనసాగించి తీరాలి.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌,

‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)


Also Read: ఆ రోజు మహాకుంభమేళకు వెళ్తున్నారా.. ఈ వార్త మీ కోసమే..

Also Read: మాఘ మాసంలోనే అత్యధిక వివాహాలు.. ఎందుకంటే..

Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం

Updated Date - Jan 31 , 2025 | 02:20 AM