చెన్నై బుక్‌ఫెయిర్‌ను చూసి నేర్చుకోవాలి!
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:54 AM
తెలుగు జాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది అని పాడుకున్నంత మాత్రాన భాష బల పడదు. మనకు గుర్తింపైన మన భాష ఎదగాలంటే స్థిరపడాలంటే బలపడాలంటే...

తెలుగు జాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది అని పాడుకున్నంత మాత్రాన భాష బల పడదు. మనకు గుర్తింపైన మన భాష ఎదగాలంటే స్థిరపడాలంటే బలపడాలంటే సాహితీవేత్తలు, మేధావులు, సృజనకారులు బతకాలి. వారికి తమ ఆలోచనలను ప్రకటించుకొనే అవకాశాలు, ఆ ఆలోచనలకు అక్షర రూపాన్ని ఇవ్వగల సామాజిక, ఆర్థిక వాతావరణం ఉండాలి. తమిళ భాష కోసం ‘తమిళనాడు ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్’ ఈ పని సమర్థంగా చేస్తున్నది.
గత మూడేళ్లుగా తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో నిర్వహిస్తున్న ‘ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్’ ఈ సంవత్సరం జనవరి 16–18 తేదీల్లో జరిగింది. తమిళ సాహిత్యాన్ని ప్రపంచానికి విస్తరించడం, ప్రపంచ సాహిత్యాన్ని తమిళులకు అందించడం దీని లక్ష్యం. ఈ ఉత్సవంలో అనేక సదస్సులు, గోష్ఠులు జరిగాయి. ఎంపికైన రచయితలు, అను వాదకులు, ప్రచురణకర్తలు వీటిలో పాల్గొన్నారు.
ప్రభుత్వం ఈ ఉత్సవానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందంటే అక్కడి సాంస్కృతిక మంత్రి, విద్యామంత్రి, పుస్తక ప్రచురణ సంస్థల డైరెక్టర్లు, ఆఖరికి ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ సభల్లో పాల్గొన్నారు. ముగింపుగా శశిధరూర్ చక్కని ఉపన్యాసం ఇచ్చారు. భాషల అనుసంధానం అనువాదాలతో సాధ్యమని, ఆలోచనలను అనుసంధానించి, అభివృద్ధి కాముక పథంలో నడవాలంటే సాహిత్యంలో అనువాద ప్రక్రియకి పెద్దపీట వేయాలని ఆయన చెప్పారు. ఈ ఏడాది 64 దేశాలు ఈ ఫెస్టివల్‌లో భాగస్వాములయ్యాయి. వచ్చే ఏడాది వంద దేశాలకు వ్యాపించాలన్నది లక్ష్యం! దాదాపు 1100 రచనలను అనువాదం చేయడానికి సంతకాలు చేసుకున్నారు. అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ తదితర యూరోపియన్ దేశాలు, ఆఫ్రికా దేశాలు ఇందులో ప్రధానంగా ఆసక్తిని కనబరిచాయి.
అనువాదాల వల్ల తమిళ దళిత సాహితీవేత్త ఇమయం ఫ్రాన్స్‌లో ప్రాచుర్యం పొందారట. దళిత స్త్రీల అణిచివేతను, ధిక్కార స్వరాన్ని వినిపించే ఇమయం పుస్తకం ఫ్రెంచ్ భాషలో ‘లే పేరే’గా ప్రసిద్ధి పొందింది. ఒక తమిళ రచయిత ఫ్రాన్స్‌లో చిరపరిచితుడయ్యాడు. హిందీ, బెంగాలీ, మలయాళం, కన్నడ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులు తమిళం నుంచి తమ తమ భాషల్లోకి చేసిన అనువాదాలను వివరించారు. తమ భాషల నుండి తమిళంలోకి జరిగిన అనువాదాలను కూడా చర్చించారు. ప్రఖ్యాత తమిళ రచయిత్రి లక్ష్మి అనువాదాలు చేసేటప్పుడు తమిళ సాంప్రదాయాలను వివరించడంలో అనువాదకులు నిర్లక్ష్యం చేయకూడదని గట్టిగా పట్టుబట్టారు. అనువాదం అంటే కథ చెప్పడం మాత్రమే కాదని, సంస్కృతిని, అలవాట్లను, ఆచారాలను కూడా ప్రతిబింబించాలని అన్నారు.
భాషకు సంబంధించి ఇప్పటికే ద్రవిడ ఉద్యమం వలన తమిళనాడు ప్రభుత్వం అక్కడి సైన్ బోర్డులన్నీ తమిళం లోనే ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో తమిళ భాషనే వాడాలని తీసుకున్న నిర్ణయాలను కచ్చితంగా అమలు చేస్తున్నది. బడులలో తమిళం నేర్చుకోవడం తప్పనిసరి చేసి, తమిళ భాషా ఉపాధ్యాయులకు మంచి వేతనం ఇస్తూ ఎనలేని గౌరవం అందిస్తున్నది. రచయితలకు పారితోషికాలను ఏటేటా పెంచు తున్నది. లైబ్రరీలను ప్రోత్సహిస్తున్నది. లైబ్రరీలకు పుస్తకాలు అందజేస్తున్నది. అదనంగా ఇప్పుడు చేసిన ఉత్సవం రచయితలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేదిగా ఉంది. దానికి కొనసాగింపుగా ఈ అనువాద ఉద్యమం.
ఈ ఏడాది ఉత్సవంలో ప్రాచీన సాహిత్యం, వాడుక భాష; కవిత్వం, కథ, నవల; దళిత, స్త్రీవాద సాహిత్యాలతో పాటుగా తమిళంలో సృష్టించబడుతున్న కొత్త పదాలు, డిక్షనరీల వంటి అంశాలు చర్చకు వచ్చాయి. పరిశోధనలకి ఆ ప్రభుత్వం చక్కటి అవకాశం ఇస్తున్నది. ఈ ఏడు జరిగిన చర్చలో ఒక పండితుడు, పరిశోధకుడు సంస్కృతంలోని 470 పదాలు తమిళంలోనివని రుజువు చేశారు. ఈ మధ్యనే జరిగిన తవ్వకాలలో దాదాపు బి.సి.3500 ఏళ్ల కిందటే తమిళనాడులో ఇనుము వాడకం జరిగినట్టు బయటపడింది. తమిళ శిలా ఫలకాలు దొరికాయి. ఈ ఉత్సవంలో ఈ అంశాలపై చర్చ జరిగింది.
ఇంతటి కోలాహలంలో తెలుగు స్వరం మూగ పోవడం బాధాకరం. ఇక్కడి ఏ చర్చలోను ఏ వేదిక పైనా మన ప్రాతినిధ్యం లేదు. మనం కూడా తమిళ సాహిత్యాన్ని తర్జుమా చేసుకుంటున్నాం. మన సాహిత్యం కూడా తమిళంలోకి అనువాదం అవుతూనే ఉంది. కానీ ఏ వేదిక మీదా మనం కనిపించలేదు. భాష బతకాలంటే రచయితలకు అవకాశాలు ఉండాలి. ఆ ప్రాపకం ప్రభుత్వమే ఇవ్వాలి. రచయితలను అనువాదకులను ప్రచురణకర్తలను ఒకచోట చేర్చాలి. అందుకు ప్రభుత్వం అండదండలు ఇవ్వాలి. భాషాభిమానం గురించి గొప్పలు చెప్పకోకుండా, పూని ఏదైనా చేసినప్పుడే తెలుగు భాష బతుకుతుంది. వెలుగుతుంది. స్థిరపడుతుంది. జాతి గర్వంగా నిలబడుతుంది.
కె. ఉషారాణి
For Telangana News And Telugu News