విశ్వకళ్యాణ సంక్రాంతి లక్ష్మి
ABN , Publish Date - Jan 14 , 2025 | 12:25 AM
శ్రీమకర సంక్రమణ – ఉషఃశ్రీ కిరణ వి రాజ తేజస్వి – సూర్యనారాయణుండు, స్వర్ణరథమున విచ్చేయ – భవ్య పుష్య కాంతులెసగ నేతెంచె – సంక్రాంతి లక్ష్మి!...

విశ్వకళ్యాణ సంక్రాంతి లక్ష్మి
శ్రీమకర సంక్రమణ – ఉషఃశ్రీ కిరణ వి
రాజ తేజస్వి – సూర్యనారాయణుండు,
స్వర్ణరథమున విచ్చేయ – భవ్య పుష్య
కాంతులెసగ నేతెంచె – సంక్రాంతి లక్ష్మి!
పచ్చనైన గుమ్మాలన్ని – పచ్చమావి
తోరముల – రంగవల్లులతో కలకల
లాడ, గొబ్బెమ్మ – పూబంతు లలరగాను,
రమ్యగతి వచ్చె – స్వర్ణ సంక్రాంతి లక్ష్మి!
‘అన్నదాతా! శుభమస్తు!’ – అని – సిరిసం
పదల నొసగెడి – సౌభాగ్యలక్ష్మి!
‘జై జవాను!’ – యని – విజయాల నుగ్రహించు –
వీరదుర్గాంబ – శ్రీవిజయలక్ష్మి!
విద్యార్థుల – నఖిల విజ్ఞానులుగ తీర్చు –
విశ్వవిద్యా – మహావిభవలక్ష్మి!
సకల ప్రజల – దయాసాంద్రవై బ్రోచు –
అభయదాయిని! కరుణార్ద్రలక్ష్మి!
ధాన్యరాశులు – పూబంతిదండ లెల్ల –
పసిడికాంతుల రాజిల్లి – స్వాగతించ,
తెలుగు వెలుగులు – పుడమిని తేజరిల్ల –
రమ్ము – విశ్వకళ్యాణ సంక్రాంతి లక్ష్మి!
‘కళ్యాణశ్రీ’ జంథ్యాల వేంకటరామశాస్త్రి