Share News

Visakhapatnam Summit: విశాఖ ‍సదస్సుతో విజన్ 2047కు శ్రీకారం

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:10 AM

ఏ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికైనా పెట్టుబడులు పునాది వంటివి. అవి అభివృద్ధికి ఇంధనంగా, గమ్యానికి దిక్సూచిగా పనిచేస్తాయి. అందుకే పెట్టుబడుల సదస్సులకు రాష్ట్రాలు అంత ప్రాముఖ్యతనిస్తాయి. వాటి ద్వారా...

Visakhapatnam Summit: విశాఖ ‍సదస్సుతో విజన్ 2047కు శ్రీకారం

ఏ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికైనా పెట్టుబడులు పునాది వంటివి. అవి అభివృద్ధికి ఇంధనంగా, గమ్యానికి దిక్సూచిగా పనిచేస్తాయి. అందుకే పెట్టుబడుల సదస్సులకు రాష్ట్రాలు అంత ప్రాముఖ్యతనిస్తాయి. వాటి ద్వారా వివిధ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. గ్లోబల్ యుగంలో ఒక దేశం లేదా రాష్ట్రం కేవలం మనుగడ సాగించడమే కాకుండా, అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా వెలుగొందాలంటే నిరంతరం ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలి.

గతంలో రాష్ట్రంలో పెట్టుబడుల సదస్సులు నిర్వహించినప్పుడు ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు. అప్పుడు కుదుర్చుకున్న ఎంఓయూల వల్ల ఎన్ని పరిశ్రమలు వచ్చాయో, అవి ఎక్కడ ఉన్నాయో తెలియని అయోమయ దుస్థితి ఏపీలో నెలకొన్నది. అమరావతి రూపశిల్పి, ఆంధ్ర రాష్ట్ర పునర్ నిర్మాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విశాఖ వేదికగా నవంబరు 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో 45 దేశాల నుంచి 300 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు పైగా ఒప్పందాలు జరగనున్నాయి. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు లాండ్ అవ్వగా మరికొన్ని నవంబర్‌లో శంకుస్థాపనలు చేసుకోనున్నాయి. అందులో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ఇండస్ట్రీ, గూగుల్ డేటా సెంటర్ తదితర పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. దీనికితోడు ఈ 18 నెలల కాలంలో బీపీసీఎల్ లాంటి కేంద్ర ప్రభుత్వ దిగ్గజ సంస్థలు తోడుకావడంతో రాష్ట్రంలో పెట్టుబడుల్లో విజన్ @ 2047 అధ్యాయం మొదలయ్యిందనే అంచనాకు అంతా వచ్చారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ దేశాలకు వెళ్లి, ప్రపంచ వేదికలపై నిలబడి తమ రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను, సానుకూల విధానాలను, స్థిరమైన పాలనను, నైపుణ్యం కలిగిన మానవ వనరులను, నూతన సాంకేతిక విధానాలను ‘బ్రాండింగ్’ చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించే ఈ ప్రక్రియలో రాష్ట్ర నాయకత్వం చేస్తున్న కృషి అసాధారణమైనది. రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు కేవలం రాష్ట్రంలో కూర్చుని సదస్సులు నిర్వహించడానికే పరిమితమవకుండా, స్వయంగా విదేశాలకు వెళ్లి పెట్టుబడులకు స్వాగతం పలుకుతున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆకర్షించేలా విదేశాల్లో పర్యటిస్తూ చేస్తున్న కృషి అద్భుతంగా ఉందని ప్రజలు కొనియాడుతున్నారు. ఆయనే ఒక స్టార్ క్యాంపెయినర్‌గా ముందుండి పలు దేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహంలా వచ్చేలా కృషి చేస్తున్నారు.


ఇదే బాటలో యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇప్పటికే అరబ్ దేశాల్లో పర్యటించి ఎంతోమంది నేతలను కలిసి విశాఖ పెట్టుబడుల సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించారు. పెట్టుబడుల సదస్సు అనేది ఒక రాష్ట్రం తనకున్న పారిశ్రామిక సామర్థ్యాన్ని, సహజ వనరులను, విధానపరమైన సరళతను ప్రపంచానికి ప్రదర్శించే ఒక వేదిక. ఈ సదస్సు ద్వారా రాష్ట్రం అనేక ప్రయోజనాలను పొందుతుంది. ఈ సదస్సుల అంతిమ లక్ష్యం ఎప్పుడూ ఒక్కటే– రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బహుముఖంగా అభివృద్ధి చేయటం.

పెట్టుబడులు ఊరికే రావు. ఒక నాయకుడి దూరదృష్టి, సమయపాలన, పాలనా అనుభవం, జాతీయ అంతర్జాతీయ నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధాలతో రాష్ట్రంలో సుస్థిర విధానాలు ఏర్పడతాయి. వాటి ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు రావడానికి అవకాశాలు ఉంటాయి. దానికితోడు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల దీర్ఘకాలికంగా స్థిరమైన, పారదర్శకమైన పారిశ్రామిక విధానాలు అమలు అవుతాయి. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందన్నది ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ద్వారా ఆచరణలో చూపిస్తున్నారు. అందుకే ఈ ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచింది. ఇది రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలకు, తీసుకుంటున్న చర్యలకు నిదర్శనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక మోడల్‌గా నిలుస్తుంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్ల అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. పారిశ్రామిక కార్యకలాపాల పెరుగుదలతో రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతున్నది. ఇది సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతోధికంగా తోడ్పడుతున్నది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కుదుటపడుతున్న రాష్ట్ర ఆదాయ పరిస్థితికి ఉపకరిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కుదుట పడితే ప్రభుత్వానికి అప్పులు చేసే తిప్పలు తప్పి అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే వీలు ఏర్పడుతుంది.

ఇప్పటికే కుదిరిన ఎంఓయూలు (MoU) కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, నిర్ణీత గడువులోగా అవి వాస్తవరూపం దాల్చేలా పర్యవేక్షణా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి బలోపేతం చేస్తున్నారు. అందులో భాగంగా ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ఇండస్ట్రీ, గూగుల్ డేటా సెంటర్‌కు ఈ నెలలోనే శంకుస్థాపన చేయడం బలాన్నిస్తోంది.

పెట్టుబడుల ఆకర్షణలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని అధిగమించడం రాష్ట్రాభివృద్ధికి కీలకం. భూసేకరణ సమస్యలు, అనుమతుల జాప్యం, ప్రభుత్వ అధికారుల నుంచి పారిశ్రామికవేత్తలకు సరైన సహకారం లభించకపోవడం వంటి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పరిష్కరిస్తున్నది. ప్రభుత్వం, అధికారులు, పారిశ్రామికవేత్తలు, కార్మికులు ఒకే జట్టుగా పని చేసినప్పుడు మాత్రమే ‘రాష్ట్రాభివృద్ధి’ అనే ఏకైక ఎజెండా సాకారమవుతుంది.

రాష్ట్ర ఆర్థిక పురోగతికి పెట్టుబడుల సదస్సు ఒక ముఖ్యమైన అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, రాష్ట్రాభివృద్ధి ఏకైక ఎజెండాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా, ప్రతి రాష్ట్రం కూడా సుసంపన్నమైన భారత భవిష్యత్తును నిర్మించగలుగుతుంది. పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు ఊపిరితిత్తుల్లాంటివి. వాటిని ఆహ్వానించి, పోషించి, రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే శక్తి ప్రభుత్వాలకు ఉంటుంది.

కొలుసు పార్థసారథి

రాష్ట్ర గృహ నిర్మాణ,

సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి

(విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్)

ఇవి కూడా చదవండి

ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్

ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం

Updated Date - Nov 12 , 2025 | 01:10 AM